Share News

ఆరోగ్యమస్తు!

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:10 AM

రాష్ట్రంలో ఆరోగ్య రంగం మరింత బలోపేతం కానుంది. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించడంతో పాటు.. వ్యాధులను తొలి దశలోనే గుర్తించి, నియంత్రించేందుకు రూ.249.5 కోట్లతో పూర్తిచేసిన 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధమయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.

ఆరోగ్యమస్తు!

  • 249.5 కోట్లతో 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులు సిద్ధం

  • 10 ఎమర్జెన్సీ చికిత్స కేంద్రాలు.. 12 ప్రయోగశాలలు

  • కేంద్ర మంత్రి నడ్డా, సీఎం చేతుల మీదుగా నేడు ప్రారంభం

అమరావతి/గుంటూరు మెడికల్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరోగ్య రంగం మరింత బలోపేతం కానుంది. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించడంతో పాటు.. వ్యాధులను తొలి దశలోనే గుర్తించి, నియంత్రించేందుకు రూ.249.5 కోట్లతో పూర్తిచేసిన 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధమయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు చేతులమీదుగా శనివారం ఈ ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు వైద్య కళాశాలలో శుక్రవారం మంత్రి మాట్లాడారు. ప్రధాన మంత్రి ఆయూష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మౌలిక వసతుల పథకం కింద ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో రూ.234.5 కోట్లతో చేపట్టిన 10 అత్యవసర చికిత్స కేంద్రాలు, రూ.15 కోట్లతో చేపట్టిన 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు ఉన్నాయని చెప్పారు. కొవిడ్‌ సమయంలో వార్డులను కరోనా బాధితులకు కేటాయించాల్సి రావడంతో ఇతర రోగులకు సాధారణ వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తాయని మంత్రి గుర్తుచేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూనే సాధారణ వైద్యసేవలకు అంతరాయం లేకుండా ప్రాజెక్టులు ఉపయోగపడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొత్తం 24 అత్యవసర చికిత్స కేంద్రాలు మంజూరు చేసిందని చెప్పారు. వాటిలో 10 కేంద్రాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయని తెలిపారు.


శనివారం ప్రారంభించనున్న 10 కేంద్రాలను... కడప, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఒంగోలు, అనకాపల్లి, రాజమహేంద్రవరం, కర్నూ లు, హిందూపురం, విజయవాడల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 14 ప్రయోగశాలల సేవలందిస్తుండగా.. మరో 12 శనివారం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఒక్కో ప్రయోగశాలకు రూ.1.25 కోట్ల చొప్పున రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. 2021లో కేంద్రం ఏపీకి రూ.1,280 కోట్లు మంజూరు చేయగా... గత వైసీపీ హయాంలో రూ.28కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..

Updated Date - Sep 12 , 2026 | 03:10 AM