బీపీ, షుగర్ పైపైకి..!
ABN , Publish Date - Sep 02 , 2026 | 04:55 AM
మారుతున్న ఆహారపు అలవాట్లు.. విపరీతమైన పని, మానసిక ఒత్తిడి.. అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా రాష్ట్రంలో బీపీ, షుగర్ రోగుల సంఖ్య రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది.
59 లక్షల మందికి బీపీ..
48 లక్షల మందికి షుగర్
ఆరోగ్య శాఖ ఎన్సీడీ 4.0 సర్వేలో వెల్లడి
అమరావతి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మారుతున్న ఆహారపు అలవాట్లు.. విపరీతమైన పని, మానసిక ఒత్తిడి.. అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా రాష్ట్రంలో బీపీ, షుగర్ రోగుల సంఖ్య రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఆరోగ్యశాఖ చేపట్టిన ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) 4.0 సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ప్రజల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడంతోపాటు, క్యాన్సర్, రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వంటి దీర్ఘకాలిక అసంక్రమిత వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించే లక్ష్యంతో ఆరోగ్య శాఖ ఈ సర్వే చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 59.27 లక్షల మంది రక్తపోటు (బీపీ), 48.12 లక్షల మంది మధుమేహం (షుగర్)తో బాధపడుతున్నారని గుర్తించారు. అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో, 18 ఏళ్లు అంతకంటే ఎక్కవ వయసున్న జనాభాను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 సర్వేలో భాగంగా ఇప్పటి వరకూ 2,82,38,795 (66.05 శాతం) మందికి స్ర్కీనింగ్ పరీక్షలు పూర్తిచేశారు. ఈ మేరకు సర్వే నివేదికను ఆరోగ్యశాఖ కమిషనర్ చక్రధర్‌బాబు మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అందించారు. 2025 సెప్టెంబరు 17న ప్రారంభమైన ‘ఎన్సీడీ 4.0’ సర్వే ఆగస్టు 31 నాటికి పూర్తయింది. గత సర్వే (ఎన్సీడీ 3.0)తో పోల్చితే కొత్తగా 11.79 లక్షల మంది బీపీ, 10.72 లక్షల మంది మధుమేహం బారిన పడినట్టు గుర్తించారు.
బీపీ, షుగర్‌లో బాపట్ల టాప్..
జిల్లల వారీగా చూస్తే బీపీ, షుగర్ బాధితుల్లో బాపట్ల జిల్లా టాప్‌లో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అట్టడుగున నిలిచింది. బాపట్ల జిల్లా జనాభాలో అత్యధికంగా 19.65 శాతం మంది బీపీ బాధితులున్నారు. కోనసీమ (19.45 శాతం), పశ్చిమ గోదావరి (19.05 శాతం), కృష్ణా (17.97 శాతం), తూర్పు గోదావరి (17.77 శాతం) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 5.63 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 8.47 శాతం, అన్నమయ్య జిల్లాలో 9.93 శాతం బీపీ కేసులు వెలుగుచూశాయి. మధుమేహ బాధితుల్లో కూడా బాపట్ల జిల్లా 16.89 శాతం మందితో అగ్రస్థానంలో ఉంది. పశ్చిమగోదావరిలో (15.89 శాతం), తూర్పుగోదావరి (15.23 శాతం), ప్రకాశం (15.19 శాతం), కృష్ణా (15.01 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం 1.51 శాతం మందికి మాత్రమే మధుమేహం ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. అత్యల్ప కేసులు నమోదైన జాబితాలో పోలవరంలో (5.88 శాతం), శ్రీసత్యసాయి జిల్లా (6.56 శాతం), కర్నూలు (6.68 శాతం), పార్వతీపురం మన్యం (7.14 శాతం) కూడా ఉన్నాయి.
55 వేల క్యాన్సర్ అనుమానిత కేసులు
క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు నిర్వహిస్తున్న స్ర్కీనింగ్ పరీక్షల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 55 వేలకుపైగా అనుమానిత కేసులను గుర్తించారు. 22,110 మందికి నోటి, 14,822 మందికి రొమ్ము, 18,837 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అనుమానిత కేసులను తదుపరి పరీక్షల కోసం క్యాన్సర్ వైద్య విభాగాలకు పంపించగా... ఈ పరీక్షల్లో 2,026 మందికి నోటి క్యాన్సర్, 3,571 మందికి రొమ్ము క్యాన్సర్, 2,076 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆరోగ్యశాఖ ప్రత్యేక చొరవ తీసుకుని వారికి మెరుగైన చికిత్స అందిస్తోంది.
సహజ జీవన వినం: సత్యకుమార్
గిరిజన జనాభా అధికంగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమతో కూడిన జీవన విధానం వల్లే బీపీ, మధుమేహం కేసులు తక్కువగా ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో కనిపించే సంప్రదాయ జీవన విధానం, సహజసిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యం, నిత్య జీవితంలో శారీరక శ్రమ వంటి అలవాట్లు ఈ ఆరోగ్యంపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ఈ వార్తలను కూడా చదవండి
సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని