‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:00 AM
సర్వస్పర్శి.. సర్వవ్యాపి నినాదంతో బీజేపీని అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకూ చేరువ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో పార్టీని సిద్ధం చేయాలని సూచించారు.
‘సర్వస్పర్శి.. సర్వవ్యాపి’ ఆలోచనతో సాగుదాం
బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాధవ్
గుంటూరు(తూర్పు), సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సర్వస్పర్శి.. సర్వవ్యాపి నినాదంతో బీజేపీని అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకూ చేరువ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో పార్టీని సిద్ధం చేయాలని సూచించారు. గుంటూరులో శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి ఇచ్చిన అపూర్వమైన తీర్పును మరింత బలోపేతం చేసేలా స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. కూటమిలోనే పోటీ చేస్తామని, అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రతి కార్యకర్త పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథి, జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌జీ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి అక్టోబరు 17వరకు నిర్వహించనున్న సేవా సంకల్ప అభియాన్‌ను ప్రతి కార్యకర్త భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే పార్టీకి ప్రధాన ప్రాధాన్యమని, ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా మన ఊరు-మన జెండా కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా నిర్వహించి, పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తిని రగిలించారంటూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు జిల్లా నాయకులను మాధవ్ అభినందించారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..