పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిపై హత్యాయత్నం.. పరిస్థితి విషమం
ABN , Publish Date - Sep 21 , 2026 | 09:35 PM
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఉపాధ్యాయుడిపై గుర్తుతెలియని వ్యక్తులు రాడ్‌తో దాడి చేసి పరారయ్యారు.
పశ్చిమగోదావరి, సెప్టెంబర్ 21: జిల్లాలోని కాళ్ల మండలంలోని పెదఅమిరం గ్రామంలో ఓ ఉపాధ్యాయుడిపై దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఉపాధ్యాయుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
స్థానికులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్లమండలం పెదఅమిరం గ్రామానికి చెందిన చోడాబత్తుల వెంకట రత్నం అనే వ్యక్తి.. అదే జిల్లాలోని ఉండి మండలం పరిధిలోని ఎన్ఆర్‌పి అగ్రహారంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల అనంతరం.. వాకింగ్ చేయడానికి వెంకటరత్నం ఇంటినుంచి బయటికి వెళ్లారు. కాగా.. వాకింగ్ చేస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై రాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. గమనించిన స్థానికులు వెంకటరత్నాన్ని భీమవరం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటరత్నం ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి చుక్కెదురు
ఢిల్లీలో మూడో జాతీయ ఏఎన్‌టీఎఫ్ సదస్సు.. ప్రారంభించనున్న అమిత్ షా