Share News

హైకోర్టు చెప్పిందని..ఇంకో రెండేశారు!

ABN , Publish Date - Sep 10 , 2026 | 04:43 AM

మేత కంపెనీల ధరల ఉచ్చులో ఆక్వా రైతు చిక్కుకున్నాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.. కొత్త ధరపై హైకోర్టు స్టే ఇచ్చినా.. ఆ పూర్తి ప్రయోజనం రైతులకు దక్కలేదు. జూన్‌ 12 నాటి సర్క్యులర్‌లోని పదజాలాన్ని కంపెనీలు తమకు అనుకూలంగా అన్వయించుకుని మరోసారి ధర పెంచాయి. కోర్టు ఆదేశాల ప్రకారం పాత ధరకు మేత విక్రయిస్తున్నామంటూనే.. టన్నుకు మరో రూ.2 వేలు భారం మోపాయి.

హైకోర్టు చెప్పిందని..ఇంకో రెండేశారు!

  • టన్ను రూ.94 వేల నుంచి 96 వేలకు పెరిగిన మేత ధర

  • కోర్టు ఆదేశాలను అనుకూలంగా మలుచుకున్నఆక్వా కంపెనీలు

  • టన్ను రూ.94 వేల నుంచి 96 వేలకు పెరిగిన ఆక్వా మేత ధర

మండవల్లి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): మేత కంపెనీల ధరల ఉచ్చులో ఆక్వా రైతు చిక్కుకున్నాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా.. కొత్త ధరపై హైకోర్టు స్టే ఇచ్చినా.. ఆ పూర్తి ప్రయోజనం రైతులకు దక్కలేదు. జూన్‌ 12 నాటి సర్క్యులర్‌లోని పదజాలాన్ని కంపెనీలు తమకు అనుకూలంగా అన్వయించుకుని మరోసారి ధర పెంచాయి. కోర్టు ఆదేశాల ప్రకారం పాత ధరకు మేత విక్రయిస్తున్నామంటూనే.. టన్నుకు మరో రూ.2 వేలు భారం మోపాయి. వాస్తవంగా జూన్‌ 12న ఆక్వా మేత కంపెనీలు ఇచ్చిన సర్క్యులర్‌లో.. జూన్‌ 13 నుంచి కిలో మేతపై రూ.10 చొప్పున ధర పెంచుతున్నట్లు పేర్కొన్నాయి. దీంతో టన్ను మేత ధర రూ.86 వేల నుంచి రూ.96 వేలకు చేరింది. రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని కిలోకు రూ.4 ధర తగ్గించాలని చెప్పింది. కానీ కంపెనీలు రూ.2 మాత్రమే తగ్గించాయి. అంటే సర్క్యులర్‌లో ప్రతిపాదించిన రూ.10 పెంపులో రూ.8 మేర పెంపు అమలయ్యింది. ఇప్పుడు హైకోర్టు జూన్‌ 12 నాటి సర్క్యులర్‌లోని ధరను అమలు చేయాలని చెప్పడంతో.. అప్పట్లో ప్రభుత్వ జోక్యంతో కిలో మేతకు తగ్గించిన రూ.2 తిరిగి కలిపి, టన్ను మేత ధరను రూ.96వేలుగా నిర్ణయిస్తూ మేత కంపెనీల అసోసియేషన్‌ బుధవారం ప్రకటన ఇచ్చింది. కాగా, సెప్టెంబరు 1 నుంచి మేత ధరను కిలోకు మరో రూ.9 పెంచుతున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. దీనివల్ల టన్ను మేత ధర రూ.1.03 లక్షలకు చేరుతుంది. ఆక్వా సాగులో మేత ప్రధాన వ్యయభారం కావడంతో టన్నుకు రూ.2వేలు అదనపు భారం.. లాభనష్టాలపై ప్రభావం చూపుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.40 కోట్లు

రెన్యువల్‌ అయ్యేలా చర్యలు చేపట్టండి

Updated Date - Sep 10 , 2026 | 04:43 AM