Share News

ఆర్టీసీకి జోన్‌ల జంఝాటం!

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:30 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో జిల్లా కేంద్రం ప్రధాన పరిపాలన కేంద్రంగా ఉంది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత ప్రతి జిల్లాకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాటైంది. ఏపీఎస్‌ఆర్టీసీలోనూ జిల్లా ప్రజారవాణా అధికారి(డీపీటీవో) పరిధిలోనే అన్నీ జరిగిపోతున్నాయి.

ఆర్టీసీకి జోన్‌ల జంఝాటం!

  • చిన్న జిల్లాలకు డీపీటీవోలు.. నేటికీ ఉమ్మడి రాష్ట్ర విధానాలే

  • ఫలితంగా రూ.150 కోట్ల భారం.. 4 జోన్లను 2 క్లస్టర్లు చేయాలి

  • కార్యకలాపాలు పూర్తిగా డిజిటల్‌.. డీపీటీవోల సంఖ్యను తగ్గించాలి

  • ఏపీఎస్‌ఆర్టీసీ-2.0లో సంస్కరణలు.. ఉద్యోగ సంఘాల సూచన

ప్రగతి రథచక్రాలకు తరచుగా ఆర్థిక బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఆదాయాన్ని సృష్టించడం ఎలా ఉన్నప్పటికీ ఉన్న వ్యవస్థను స్థిరీకరించి, ప్రస్తుత కాలానికి అనుగుణంగా దానిని మార్పు చేస్తే ఆర్టీసీపై దాదాపు రూ.150 కోట్ల మేరకు ఆర్థిక భారం తప్పుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్‌ అధికారులు చెబుతున్నారు. ‘ఏపీఎస్‌ఆర్టీసీ-2.0’లో సంస్కరణలకు పెద్దపీట వేయాలని సూచిస్తున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో జిల్లా కేంద్రం ప్రధాన పరిపాలన కేంద్రంగా ఉంది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత ప్రతి జిల్లాకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాటైంది. ఏపీఎస్‌ఆర్టీసీలోనూ జిల్లా ప్రజారవాణా అధికారి(డీపీటీవో) పరిధిలోనే అన్నీ జరిగిపోతున్నాయి. కానీ, ఆర్థిక భారం మోయలేకపోతున్న ఆర్టీసీకి జోన్ల వ్యవస్థ భారంగా మారింది. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో తీసుకునే నిర్ణయాలు జిల్లాల్లో డీపీటీవోలు అమలు చేస్తున్నారు. దీంతో జోన్ల వ్యవస్థ ఎందుకు అనే చర్చ మొదలైంది. 35ఏళ్ల క్రితం ఆర్టీసీలో జోన్ల వ్యవస్థ ఏర్పడింది. మారుతున్న కాలానికి, అవసరాలకు ఈ వ్యవస్థ అవసరం లేదనే వాదన ఉద్యోగుల్లో బలంగా వినిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకుంటే ఏటా రూ.120కోట్ల వరకు ఆర్టీసీపై భారం తగ్గుతుందని సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాల్లో 12మంది రీజినల్‌ మేనేజర్లు(ఆర్‌ఎం) ఉండగా, ఇప్పుడు ఏకంగా 26 మంది(డీపీటీవో) పెరిగారు. వీరంతా సంస్థకు అదనపు భారంగా మారారని అంటున్నారు. రెండు, మూడు డిపోలు ఉన్న చిన్న జిల్లాలకు సైతం డీపీటీవోలను నియమించడం.. వారికి జీతభత్యాల రూపంలో రూ.30 కోట్లు ఇవ్వడం సంస్థపై అదనపు భారం మోపడమేనని అభిప్రాయ పడుతున్నారు.


పాత తరహాలోనే పాలన!

రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు దాటినా ఆర్టీసీలో పాత పరిపాలనా నమూనానే కొనసాగుతుండటంపై ఉద్యోగులు, రిటైర్డ్‌ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, జోనల్‌ వ్యవస్థ వల్ల ఒకే అంశంపై రీజియన్‌, జోన్‌, ప్రధాన కార్యాలయం మధ్య ఫైళ్లు తిరుగుతున్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని అంటున్నారు. డిపో మేనేజర్ల స్వతంత్ర నిర్ణయాధికారం తగ్గుతోందని విమర్శిస్తున్నారు.

‘ఏపీఎస్‌ ఆర్టీసీ 2.0’లో కీలక నిర్ణయం

ఎలక్ట్రిక్‌ బస్సులు, డిజిటల్‌ సేవలు, ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణతో ‘ఏపీఎస్‌ ఆర్టీసీ 2.0’ పేరిట కొత్త దిశగా అడుగులు వేస్తున్న ఆర్టీసీకి పరిపాలనా సంస్కరణలు అంతే కీలకంగా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత కొనసాగుతున్న జోనల్‌ వ్యవస్థ ఇప్పటికీ అవసరమేనా? లేక కాలానుగుణంగా కొత్త నమూనా తీసుకురావాలా? అన్న అంశంపై ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీతో సమగ్ర సమీక్ష నిర్వహిస్తేనే సంస్థ భవిష్యత్తుకు స్పష్టమైన దిశ లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, జోనల్‌ వ్యవస్థను పూర్తిగా తొలగించడం సరైన నిర్ణయం కాదని మరో వర్గం వాదిస్తోంది. ప్రస్తుతం ఉన్న 4 జోన్ల విధానం రద్దుచేసి 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఉమ్మడి జిల్లాల కోసం రూపొందించిన పరిపాలనా వ్యవస్థ విభజిత చిన్న జిల్లాలకు అవసరమా?.. అనేది ఇప్పుడు ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది.

పరిష్కారం ఇదీ!

  • 4 జోన్ల స్థానంలో రెండు లేదా మూడు ఆపరేషనల్‌ క్లస్టర్ల ఏర్పాటు.

  • ప్రాంతీయ మేనేజర్లకు అధిక పరిపాలన, ఆర్థిక అధికారాల కల్పన.

  • ప్రధాన కార్యాలయం-రీజియన్‌ మధ్య పూర్తిస్థాయి డిజిటల్‌ వ్యవస్థ.

  • జోన్‌ స్థాయిలో ఇంజినీరింగ్‌, వర్క్‌షాప్‌ విభాగాలే కొనసాగాలి.

  • రీజియన్‌ స్థాయికి వాణిజ్య, పరిపాలనా కార్యకలాపాలు అప్పగించాలి.

ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Updated Date - Sep 13 , 2026 | 03:30 AM