మద్యం షాపుల రెన్యువల్
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:39 AM
రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ అమలుపై స్పందన ఎలా ఉంటుందోనన్న కారణాలతో ఎక్సైజ్ శాఖ కొత్త నోటిఫికేషన్ జారీకి మొగ్గు చూపలేదు.
మరో ఏడాది పొడిగింపు.. ఫీజుపై 38 శాతం భారం
రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ అమలుపై స్పందన ఎలా ఉంటుందోనన్న కారణాలతో ఎక్సైజ్ శాఖ కొత్త నోటిఫికేషన్ జారీకి మొగ్గు చూపలేదు. ప్రస్తుతం ఉన్న లైసెన్సుదారులకే మరో ఏడాదిపాటు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న లైసెన్స్ ఫీజుపై అదనంగా 38 శాతం చెల్లించేలా నిబంధన విధించింది. ఒకవేళ ప్రస్తుత లైసెన్సుదారులు విముఖత చూపితే ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల ఫీజుతో కొత్త దరఖాస్తులు స్వీకరించి, లాటరీ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించింది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఎక్సైజ్ శాఖ సెప్టెంబరు 20వ తేదీ నాటికే రెన్యువల్ ప్రక్రియను ముగించాలని షెడ్యూల్ ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం తొలి నాలుగు నెలల లైసెన్స్ ఫీజుతోపాటు అదనపు 38 శాతం మొత్తాన్ని తక్షణమే జమ చేయాలి. జిల్లాలో వార్షిక లైసెన్స్ ఫీజు రూ.70 లక్షలు ఉన్న షాపులే అధికంగా ఉన్నాయి. ఈ లెక్కన 38 శాతం అదనపు మొత్తం దాదాపు రూ.27 లక్షలు, వార్షిక ఫీజులో మూడో వంతు రూ.23.30 లక్షలు కలిపి తక్షణం రూ.47.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. పర్మిట్ రూమ్ ఫీజు మరో రూ.2.50 లక్షలు కలుపుకుంటే, ఒక షాపు రెన్యూవల్ కావాలంటే చేతినుంచి రూ.50 లక్షలు సమకూర్చుకోవాలి.
తక్కువ అమ్మకాలే సమస్య
జిల్లాలోని మొత్తం 193 మద్యం షాపుల్లో 15 షాపులు కల్లుగీత కార్మికుల కోటా కింద మంజూరు చేసినవి. వీటికి ఫీజులో రాయితీ ఉండటంతో రెన్యువల్‌కు ఎటువంటి అడ్డంకులు లేవు. అయితే జనరల్ కేటగిరీలోని 175 షాపులపైనే ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. ఉండి, పాలకోడేరు, వీరవాసరం, పాలకొల్లు ప్రాంతాల్లో షాపులు తక్కువగా ఉండి విక్రయాలు జోరుగా ఉన్నాయి. ఇక్కడ రోజుకు రూ.రెండు లక్షల నుంచి రూ.రెండున్నర లక్షల వరకు అమ్మకాలు సాగుతుండటంతో వ్యాపారులు ముందంజలో ఉన్నారు. భీమవరం టౌన్, భీమవరం రూరల్, పెంటపాడు, ఆచంట, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో షాపులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో విక్రయాలు తగ్గిపోయాయి. ఇక్కడ సగటు అమ్మకాలు రోజుకు రూ.1.50 లక్షలకే పరిమితమయ్యాయి. కొన్ని పట్టణాల్లో నష్టాలు నివారించేందుకు వ్యాపారులంతా సిండికేట్‌గా మారి లాభన ష్టాలను పంచుకుంటూ నెట్టుకొస్తున్నారు.
పడిపోయిన ఆదాయం..
రెండేళ్ల క్రితం తీవ్ర పోటీ పడి రూ.50 లక్షల వరకు వెచ్చించి లాటరీలో షాపులు దక్కించుకున్న వ్యాపారులు, ఇప్పుడు మరో రూ.27 లక్షలు అదనంగా చెల్లించాల్సి రావడంతో పునరాలోచనలో పడ్డారు. వ్యవసాయం, ఆక్వా రంగాలపైనే జిల్లా ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే శ్రామిక వర్గం తగ్గడంతో బ్రాండెడ్ మద్యం విక్రయాలు పడిపోయాయి. దీనికితోడు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొన్న 20 శాతం కమీషన్‌ను 14 శాతానికే పరిమితం చేయడంతో మార్జిన్లు తగ్గిపోయాయి. పది రోజుల వ్యవధిలోనే ఈ నిధులు సమకూర్చుకోవడం తలకుమించిన భారంగా మారిందని లైసెన్సుదారులు తర్జనభర్జన పడుతున్నారు. అధికారులు మాత్రం నిర్దేశిత గడువులోగా ప్రస్తుత వ్యాపారులతోనే రెన్యూవల్ చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
గడువు ఈ నెల 21వ తేదీ
భీమవరం క్రైం, సెప్టెంబర్ 12(ఆంధ్రజ్యోతి): జిల్లా లోని 193 మద్యం దుకాణాల లైసెన్స్‌ల రెన్యువల్‌కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారి బి.సుబ్బారావు తెలిపారు. శనివారం భీమవరం జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఓపెన్ కేటగిరి షాపులు 175, గీత కులాలకు సంబంధించిన 18 షాపులకు ఈ ఏడాది అక్టోబరు ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 30వ తేదీ వరకు లైసెన్స్‌లు రెన్యువల్ చేస్తాం. ఇందుకు 38 శాతం ఫీజు చెల్లించాలి. లైసెన్సుదారులం దరూ దుకాణాలను ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా రెన్యువల్ చేయించుకోవాలన్నారు.