జనవరి 1 నుంచి ‘సంజీవని’ సేవలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 04:53 AM
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కుప్పం, చిత్తూరులో ఉత్తమ ఫలితాలు
వాటిని రాష్ట్రమంతటా విస్తరించాలి
ప్రాజెక్టుపై సమీక్షలో చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, నివారణ, చికిత్సకు ప్రాధాన్యతనిచ్చేలా తీసుకొస్తున్న సంజీవని ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చుని చెప్పారు. వైద్యసేవల్లో ఏపీ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచేలా ఈ ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించారు. కుప్పం, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే సంజీవని ప్రాజెక్ట్ అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, దీన్ని రాష్ట్రమంతటా విస్తరించేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబం విద్యకు, వైద్యానికే అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలను తీసుకువస్తున్నట్టు సీఎం వివరించారు. సంజీవని ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని నిర్దేశించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు.
బేస్‌లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర పోర్టల్స్‌తో ఇంటిగ్రేషన్ వంటి చర్యలు ఈ ప్రణాళికలో ఉన్నాయని వెల్లడించారు. కాగా, కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సంజీవని కార్యక్రమం అమలుతో వచ్చిన ఫలితాలను సమీక్షలో సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు అమలుతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టు అధికారులు వివరించారు. పౌరుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన సర్వేలో 91 శాతం మంది సంజీవని అనంతరం తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని చెప్పారన్నారు. స్ర్కీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.
సీపీఎం నేత మధు సతీమణి మృతికి సీఎం సంతాపం
సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీ పి.మధు సతీమణి, ఐద్వా నాయకురాలు సుమతి అకాల మరణం పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. మహిళా హక్కుల సాధనకు, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుమతి సేవలందించారని అన్నారు. ఆమె పార్థివదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించాలని కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఆదర్శనీయమని చంద్రబాబు పేర్కొన్నారు.
వసంతకుమార్ కుటుంబానికి భరోసా
గుండెపోటుతో మృతి చెందిన చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుడు చెరుకూరి వసంతకుమార్(53) కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయనకు భార్య శిల్పతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పార్టీకి 25 ఏళ్లుగా సేవలందించిన వసంతకుమార్ కుటుంబ సభ్యులతో చంద్రబాబు బుధవారం ఫోన్లో మాట్లాడి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలను కూడా చదవండి
హైడెన్సిటీ రైలు మార్గాల విస్తరణ
రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి డిజిటల్ అరెస్టు