హైడెన్సిటీ రైలు మార్గాల విస్తరణ.. మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 26 , 2026 | 08:13 PM
దేశంలో రద్దీ అత్యధికంగా ఉండే రైలు మార్గాల విస్తరణ దిశగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం కీలక ప్రకటన చేశారు.
న్యూఢిల్లీ: దేశంలో రద్దీ అత్యధికంగా ఉండే రైలు మార్గాల విస్తరణ దిశగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం కీలక ప్రకటన చేశారు. ప్రధానమైన 7 హైడెన్సిటీ మార్గాలను నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్టు చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీని, ఇతర ప్రధాన నగరాలను అనుసంధించే హైడెన్సిటీ మార్గాల్లో రైళ్ల రాకపోకలు అత్యధికంగా జరుగుతున్నాయి. మొత్తం రైలు నెట్‌వర్క్‌లో వీటి వాటా కేవలం 16 శాతమే అయినప్పటికీ 41 శాతం రైళ్ల రాకపోకలు ఈ మార్గాల మీదుగానే సాగుతుంటాయి.
ఈ రూట్‌లలో నాలుగు లైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. ప్రధాని మోదీ విజన్ ప్రకారం ఈ విస్తరణ చేపడుతున్నామని చెప్పారు. దీంతో, ప్యాసింజర్లు, సరకు రవాణా మరింత సమర్థవంతంగా సాగుతుందని అన్నారు. ఈ విస్తరణతో అనేక పర్యావరణ, ఆర్థిక పరమైన ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు.
ఢిల్లీ-హౌరా, హౌరా-చెన్నై, చెన్నై-ముంబై, ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-చెన్నై, ముంబై-హౌరా, ఢిల్లీ-గువాహటి రూట్లలో అత్యధిక సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై మార్గాల్లో 160 కిలోమీటర్ల వేగంతో హైస్పీడు రేళ్లు నడిపే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ-హౌరా మార్గంలో రోజుకు 100 గూడ్స్ రైళ్లు, 120 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక డిల్లీ-ముంబై రూట్‌లో రోజుకు 90 ప్యాసింజర్ రైళ్లు, 80-85 గూడ్స్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 7 హైడెన్సిటీ మార్గాలను నాలుగు లైన్లకు విస్తరించేందుకు కేంద్రం నడుం బిగించింది.
ఈ వార్తలనూ చదవండి:
నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 1000 మంది గల్లంతు..