రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి డిజిటల్ అరెస్టు
ABN , Publish Date - Aug 27 , 2026 | 04:39 AM
ఎన్‌ఐఏ అధికారిని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నానంటూ రిటైర్డు బ్యాంకు ఉద్యోగి అయిన ఓ 85 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.85.20 లక్షలు కొట్టేశారు. కానీ మోసాన్ని వెంటనే గ్రహించిన వృద్ధుడు పోలీసులకు సకాలంలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ నగదు వేరే ఖాతాలకు బదిలీ అవ్వకముందే ఫ్రీజ్ చేశారు
రూ.85 లక్షలకు టోకరా
సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగదు ఫ్రీజ్
హైదరాబాద్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఎన్‌ఐఏ అధికారిని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నానంటూ రిటైర్డు బ్యాంకు ఉద్యోగి అయిన ఓ 85 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.85.20 లక్షలు కొట్టేశారు. కానీ మోసాన్ని వెంటనే గ్రహించిన వృద్ధుడు పోలీసులకు సకాలంలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ నగదు వేరే ఖాతాలకు బదిలీ అవ్వకముందే ఫ్రీజ్ చేశారు. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో నివసిస్తున్న వృద్దుడైన మాజీ బ్యాంకు ఉద్యోగికి ఈనెల 21న గుర్తు తెలియని ఓ వ్యక్తి వాట్సా్‌ప్‌లో వీడియో కాల్ చేశాడు. పోలీసు దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తి తానో ఎన్‌ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారినని పరిచయం చేసుకొని తెలుగులోనే మాట్లాడాడు. వృద్దుడి ఆధార్ కార్డు నెంబర్ ఉపయోగించి అబ్దుల్ సలామ్ అనే వ్యక్తి కర్ణాటక, కేరళలో బ్యాంకు ఖాతాలు మోసపూరిత లావాదేవీలు చేశాడని చెప్పాడు. ఈ విషయం బయటకు పొక్కితే అరెస్టు తప్పదంటూ భయపెట్టాడు. పైఅధికారులకు తెలియకుండా విడిగా మెసేజ్ చేస్తానని నమ్మించాడు. వృద్ధుడి ఖాతాలో ఉన్న రూ.85.20లక్షలను వేరే ఖాతాకు మళ్లించాడు. ఆర్‌బీఐ ధృవీకరణ తర్వాత డబ్బు వెనక్కి వస్తుందని భరోసా ఇచ్చాడు. నగదు బదిలీ జరిగిన కాసేపటికి వృద్ధుడికి మళ్లీ ఫోన్ చేసి.. రూ.42లక్షల జరిమానా పడిందని ఆ మొత్తం వెంటనే చెల్లించాలని చెప్పాడు. మోసాన్ని గ్రహించిన వృద్ధుడు బ్యాంకు అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు వెంటనే 1930కు ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలో దిగిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.. వృద్ధుడి ఖాతాలోని నగదు కోయంబత్తూర్‌లోని ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాకు చేరినట్లు తెలుసుకున్నారు. ఆ ఖాతాలో ఉన్న మొత్తం రూ.85.20లక్షలను ఫ్రీజ్ చేయించారు. నేరం జరిగిన గంటల వ్యవధిలోనే ఫిర్యాదు రావడం వల్లే వేరే ఖాతాలకు బదిలీ కాకముందే ఆపగలిగామని సీఎస్‌బీ శిఖా గోయల్ తెలిపారు.