Share News

పెసా మొబిలైజర్లను నియమించాలి

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:40 AM

దేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజన తెగలకు స్థానిక స్వపరిపాలనను అందించడానికి, సంప్రదాయ గ్రామసభల నిర్వహణ ద్వారా ఏజెన్సీ వనరులపై వారి హక్కులను రక్షించడానికి పెసా (PESA) చట్టం–1996ను...

పెసా మొబిలైజర్లను నియమించాలి

దేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజన తెగలకు స్థానిక స్వపరిపాలనను అందించడానికి, సంప్రదాయ గ్రామసభల నిర్వహణ ద్వారా ఏజెన్సీ వనరులపై వారి హక్కులను రక్షించడానికి పెసా (PESA) చట్టం–1996ను ప్రభుత్వం తెచ్చింది. ఈ చట్టాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఏజెన్సీ పరిధిలోని గ్రామాల్లో పెసా మొబిలైజర్లను ప్రభుత్వం నియమించింది. తమ గ్రామంలోని గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై, అటవీ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం వీరి బాధ్యత. దాంతోపాటు గ్రామ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, వాటికి గ్రామస్థులు హాజరయ్యేలా చూడడంతోపాటు, పలు అభివృద్ధి పనుల ప్రణాళికలు గ్రామసభల్లో ఆమోదం పొందేలా చూడడం, పలు గ్రామ కమిటీలను సమన్వయపరచడం వీరి విధి. ఆదివాసీ ప్రాంతాల్లో భూములు, అడవులు, ఇసుక క్వారీలు, స్థానిక వనరులపై నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు ‘పెసా గ్రామసభ’కు ఉంటాయి. ఈ సభలను నడిపించడంలో మొబిలైజర్లదే కీలక పాత్ర.

గతంలో ప్రతి గ్రామపంచాయతీకి ఒకరి చొప్పున ప్రభుత్వం వీరిని నియమించినప్పటికీ, ప్రస్తుతం వారిలో మూడో వంతు మంది మాత్రమే పనిచేస్తున్నారు. అరకొర జీతాలు, అవి కూడా సకాలంలో విడుదల కాకపోవడంతో చాలా మంది మొబిలైజర్లు విధుల నుంచి తప్పుకున్నారు. ఉన్న ఆ కొద్దిమంది మొబిలైజర్లు కూడా తమ విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ఐటీడీఏ, డీపీఓ అధికారులు వారిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెసా గ్రామ సభలో ఎంతో కీలకమైన మొబిలైజర్లను తగు సంఖ్యలో నియమించాలి. వారికి జీతాలు క్రమం తప్పకుండా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. తద్వారా పెసా చట్టం పటిష్ఠంగా అమలయ్యేలా చూడాలి.

వూకె రామకృష్ణ దొర

ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Updated Date - Aug 27 , 2026 | 04:44 AM