ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
ABN , Publish Date - Aug 26 , 2026 | 07:12 PM
టిబెట్‌లో సంభవించిన భూకంపం తమ దేశంలో వరదలకు కారణమై ఉండవచ్చని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు
ఇంటర్నెట్ డెస్క్: టిబెట్‌లో సంభవించిన భూకంపం తమ దేశంలో వరదలకు కారణమై ఉండవచ్చని నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ తెలిపారు. టిబెట్‌లో కొండచరియలు విరిగి పడి తమ దేశంలోని భోటేకోశీ నదిలో వరదలకు దారి తీశాయని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు మంత్రి ఖనాల్ వివరించారు. టిబెట్‌లో నేడు ఉదయం 8.37 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే దానిపై నిపుణులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, వరదలు ముంచెత్తిన రసువా జిల్లాకు అనుకుని ఉన్న గ్యిరోంగ్ పోర్టు ప్రాంతంపై (టిబెట్) భారీ వరద విరుచుకు పడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
నేపాల్-చైనా సరిహద్దుకు సమీపంలో ముంచుచరియలు, కొండచరియలు విరిగిపడినట్టు శాటిలైట్ ఇమేజీల్లో కనిపించిందని నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది అంతకుముందే, లేండే నదికి అడ్డంగా మంచుచరియలు పేరుకోవడంతో అక్కడ భారీగా నీరు నిలిచిపోయిందని ఖఠ్మాండూ యూనిర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. ఆ తరువాత అకస్మాత్తుగా మంచుచరియలు, కొండచరియలు పడిపోవడంతో ఎగువన ఉన్న లేండే నది నీరు భోటే కోశీ నదిలోకి పోటెత్తి ఆకస్మిక వరదలకు దారి తీసిందని చెప్పారు. ఆ సమయంలోనే టిబెట్‌లో భూకంపం సంభవించిందని వివరించారు. ఈ నేపథ్యంలో పూర్తి ఘటనా క్రమం ఎంటో తెలుసుకునేందుకు నేపాల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
నేపాల్‌లో ప్రవహించే బోటే కోశీ నదికి లేండే ఓ ఉపనది. ఈ నది టిబెట్‌లో మొదలవుతుంది. సరిహద్దును దాటి నేపాల్‌లోకి ప్రవేశించాక భోటే కోశీ నదిలో కలుస్తుంది. అనంతరం భోటే కోశీ నది మరింత దిగవకు వచ్చేసరికి త్రిశూలీ నదిగా పిలుస్తారు. ఈ క్రమంలో త్రిశూలీ నది నేపాల్‌లోని దేవఘాట్ వద్ద కాళీ గండకి నదిలో కలిసి నారాయణి నదిగా భారత్‌లోకి (బిహార్) ప్రవేశిస్తుంది. భారత్‌లో దీన్ని గండక్ నదిగా పిలుస్తారు. ఇది బిహార్, యూపీల మధ్య సరిహద్దుమీదుగా ప్రవహిస్తూ అంతిమంగా గంగా నదిలో కలుస్తుంది.
ఈ వార్తలనూ చదవండి:
నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 1000 మంది గల్లంతు..