Share News

‘సంజీవని’ గేమ్‌చేంజర్‌

ABN , Publish Date - Sep 13 , 2026 | 04:04 AM

రాష్ట్ర వైద్యరంగంలో సంజీవని పథకం గేమ్‌చేంజర్‌గా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లు, 12 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌లను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి శనివారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.

‘సంజీవని’ గేమ్‌చేంజర్‌

జనవరి 1 నుంచి డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు

వైద్యారోగ్య రంగంలో సాంకేతికత వినియోగం

ప్రజలకు మెరుగైన వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం

ఫార్మా రంగానికి చిరునామాగా రాష్ట్రం

మెడ్‌టెక్‌లో వైద్య పరికరాల ఉత్పత్తికి ప్రోత్సాహం

డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం

ప్రజల భాగస్వామ్యంతో నం.1గా ఏపీ: చంద్రబాబు

ఏపీ సురక్షితమైన చేతుల్లో ఉంది: నడ్డా

బయోవ్యాలీకి కమిటీని పంపిస్తామని హామీ

249 కోట్లతో 10 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లు,

12 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌లు ప్రారంభం

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్యరంగంలో సంజీవని పథకం గేమ్‌చేంజర్‌గా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే జనవరి 1 నుంచి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.249 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 10 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లు, 12 ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌లను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి శనివారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. తొలుత విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబొరేటరీలను వారిద్దరూ సందర్శించి, ప్రారంభించారు. అనంతరం విజయవాడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళా వేదికలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఫార్మా రంగానికి ఏపీ చిరునామాగా ఉందని, మెడ్‌టెక్‌ పార్క్‌ ద్వారా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వైద్యారోగ్య రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.


కేంద్ర ప్రభుత్వం గత 12ఏళ్లలో వైద్యరంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. దేశంలో మెడికల్‌ సీట్లను 51వేల నుంచి రెండింతలకు పైగా పెంచిందని తెలిపారు. ప్రపంచానికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించిన ఘనత భారతదేశానికి, ప్రధాని మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని, జన ఔషధ కేంద్రాల ద్వారా పేదలకు మందులు అందుతున్నాయని చెప్పారు. అభా కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. వంటశాలను ఫార్మసీగా, ఆహారాన్నే ఔషధంగా భావించాలని, ఆ దిశగా ఆరోగ్య పద్ధతులను మార్చుకోవాలని సూచించారు. ధ్యానం, ప్రాణాయామం, యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పారు. సంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చనని పేర్కొన్నారు. కేంద్ర సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఏపీని దేశంలోనే నం.1 స్థానంలో నిలుపుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంజీవని భేష్‌: కేంద్ర మంత్రి నడ్డా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంజీవని కార్యక్రమంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రశంసలు కురిపించారు. వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితిని తగ్గిస్గూ, ఆరోగ్య సేవలను ఇంటి ముందుకు తీసుకొచ్చేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. ప్రతి ఒక్కరికీ 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య వివరాలను నమోదు చేసి సమగ్ర ఆరోగ్య రికార్డులను రూపొందించడం ఎంతో ఆకట్టుకుందని, దీనిని జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని నడ్డా ప్రకటించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ సీసీబీలతో రాష్ట్రవ్యాప్తంగా 500 పడకలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వం ఈ బ్లాక్‌ల నిర్మాణాన్ని గాలికి వదిలేసిందని, కేవలం రూ.28 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వాటా నిధులు కేటాయించి రూ.250 కోట్లతో వీటి నిర్మాణం చేపట్టామని చెప్పారు.


సీఎంపై నడ్డా ప్రశంసల జల్లు

ఆంధ్రప్రదేశ్‌ సురక్షితమైన చేతుల్లో ఉందని, చంద్రబాబు విజన్‌, నిబద్ధత కలిగిన నాయకుడని నడ్డా ప్రశంసించారు. ఉమ్మడి, విభజిత రాష్ట్రం అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర మరువలేమని, ఇప్పుడు కొత్త ఏపీని సృష్టిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ముందస్తుగా వ్యాధులను గుర్తించడం, నివారణ, మెరుగైన చికిత్సతో పాటు అందుబాటు ధరల్లో వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. వంటశాలే ఫార్మసీ- ఆహారమే ఔషధం అని చంద్రబాబు చెప్పిన మాటలు అక్షరాలా నిజమని నడ్డా పేర్కొన్నారు.

చంద్రబాబు విజ్ఞప్తి.. నడ్డా సమ్మతి

రాష్ట్ర ఆరోగ్య రంగానికి నిధులు కేటాయిస్తున్న ప్రధాని మోదీకి, మంత్రి నడ్డాకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం వల్లే ఇటువంటి అభివృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. అమరావతిలో క్వాంటం బయో వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని, దీనికి జాతీయ గుర్తింపు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై నడ్డా సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటున్నామని, క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం నుంచి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం నుంచి సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపనున్నట్లు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Updated Date - Sep 13 , 2026 | 04:04 AM