Share News

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల ఘర్షణలు..

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:43 AM

ఆంధప్రదేశ్‌ వ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. పలు చోట్ల ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల ఘర్షణలు..
ap second phase panchayat election

అమరావతి, నవంబరు 29: రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తేవడంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.


నిబంధనలు ఉల్లంఘించారంటూ..

కృష్ణాజిల్లా: జిల్లాలోని పామర్రు జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు తలెత్తాయి. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలోకి ఇరువర్గాల వారు ప్రవేశించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిబంధనలు అతిక్రమించారంటూ ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఇరువర్గాల నాయకులను పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వెలుపలకు పంపించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రం వద్ద శాంతిభద్రతలను అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్, పామర్రు సీఐ నాగప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.

రాళ్లురువ్వుకున్న ఇరువర్గాలు:

నంద్యాల: జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మండలంలోని పెట్నికోటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రంగప్రవేశం చేసిన పోలీసులు.. ఇరువర్గాల వారిని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.


వృద్ధుల ఓటు వేస్తున్నారంటూ..

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని నందిగామ మండలం మాగల్లులో వృద్ధుల ఓటు వేసే విషయంలో పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప వివాదం నెలకొంది. వృద్ధుల ఓటును తమకు అనుకూలంగా వేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఇరుపార్టీల మధ్య వివాదం మొదలైంది. అప్రమత్తమైన పోలీసులు.. ఇరువర్గాలతో మాట్లాడి నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

టీడీపీ కార్యకర్తలపై దాడి.. 10 మందికి గాయాలు

అనంతపురం: జిల్లాలోని యల్లనూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు.. టీడీపీ ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 10 మంది గాయాలపాలయ్యారు. అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


బ్యాలెట్ పేపర్లు చించేసిన మహిళ

కాకినాడ: జిల్లాలోని గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్లపై ఓటు వేసిన ఓ మహిళ.. పేపర్లను బయటకు తీసుకువచ్చి చింపివేసింది.

వైసీపీ నేతల అత్యుత్సాహం.. ఓటరు కాలర్ పట్టుకుని..

కృష్ణాజిల్లా: జిల్లాలోని పెనమలూరులో వైసీపీ నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఓటు వేయడానికి వెళ్లిన ఓ ఓటరును.. దొంగ ఓటు వేస్తున్నావ్ అంటూ వైసీసీ నేత కాలర్ పట్టుకుని బయటకు లాక్కొచ్చారు. తాను ఇదే బూత్‌లో ఓటరు అని చెప్తున్నా వినకుండా అత్యుత్సాహం ప్రదర్శించి ఓటరును అవమానించారు. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు కలుగజేసుకొని బూత్‌లో నుంచి అత్యుత్సాహం ప్రదర్శించిన వారిని బయటకు పంపించి వేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.


ఓటు వేయడానికి 13 కిలోమీటర్లు నడిచి వచ్చి..

అల్లూరి జిల్లా : జిల్లాలోని అనంతగిరి మండలంలో ఓటు వేయడానికి గిరిజనులు 13 కి.మీ. కాలినడకన ప్రయాణించి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. సమీప ​రొంపిల్లి, బూరిగ, చిన్నకోనేల గ్రామాల నుంచి గిరిజనులు నడిచి వచ్చి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. సుమారు 120 మంది ఓటర్లు ఉన్నా.. తమ గ్రామాలకు నేటికీ రహదారి సౌకర్యం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చి, భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ​గ్రామాలకు రోడ్డు వేసి రవాణా సమస్యను పరిష్కరించాలని.. ఓటు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఓటు వేయడం వల్ల తమ సమస్యలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రిగ్గింగ్ చేసేందుకు..

తిరుపతి: జిల్లాలోని రామచంద్రాపురం మండలం శ్రీరామపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గతంలో రిగ్గింగ్‌కు పాల్పడిన పోలింగ్ కేంద్రం వద్దకు ఒకే సారి వైసీపీ నేతలు గూమిగూడారు. దీంతో అప్రమత్తమైన టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. ఒకేసారి పోలింగ్ కేంద్రం వద్దకు ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చినా.. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటుచేసున్నాయి. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేవడానికి లాఠీచార్జ్ చేసి.. మాజీ జెడ్పీటీసీ, వైసీపీ నేత భానుకుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

Updated Date - Nov 29 , 2026 | 11:44 AM