Share News

జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు పునరుజ్జీవం

ABN , Publish Date - Sep 11 , 2026 | 07:00 AM

రాష్ట్రంలో జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎం) కింద గతంలో రద్దయిన తాగునీటి పథకాలకు ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించింది. రద్దయిన 13,252 పనులను పునరుద్ధరించడంతోపాటు...

జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు పునరుజ్జీవం
Jal Jeevan Mission

  • రూ.4053.85 కోట్లతో పనుల పునరుద్ధరణ

  • 7439 గ్రామాల్లో సింగిల్‌ విలేజ్‌ స్కీముల అమలు

  • 5 మల్టీ విలేజ్‌ స్కీములు కొనసాగింపు

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎం) కింద గతంలో రద్దయిన తాగునీటి పథకాలకు ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించింది. రద్దయిన 13,252 పనులను పునరుద్ధరించడంతోపాటు, 13,247 సింగిల్‌ విలేజ్‌ స్కీములను 7,439 గ్రామాలవారీ పథకాలుగా పునర్య్వస్థీకరించేందుకు అనుమతి ఇచ్చింది. వీటితోపాటు ఐదు మల్టీ విలేజ్‌ స్కీములను కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. మొత్తం పనులకు అంచనా వ్యయం రూ.4053 కోట్లుగా నిర్ణయించింది. ఈమేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని పునర్య్వస్థీకరించే పనుల్లో 25 శాతం కంటే తక్కువ ఖర్చు జరిగినవి, పైపులు కొనుగోలు చేయనివి, పనులు ప్రారంభం కానివి, అప్పగింత జరగనివి ఉన్నాయి. కాగా, జేజేఎం 2.0 మార్గదర్శకాల నేపథ్యంలో పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు అంశాలపై స్పష్టత ఇచ్చింది. రిట్రోఫిట్టింగ్‌ పథకాలకు సహాయం ఉండదని నేషనల్‌ జల్‌జీవన్‌ మిషన్‌ స్పష్టం చేసింది. కొత్త పథకాల మంజూరు ప్రధానంగా పీఎం జన్మాన్‌, జేజీయూఏ పరిధిలో ఇంకా కవరేజీ లేని ప్రాంతాలకే పరిమితం కానుంది. జేజేఎం-ఐఎంఐఎస్‌ ప్రకారం కొనసాగుతున్న పథకాలు 42,068 కాగా, వాటి అంచనా వ్యయం రూ.17,748 కోట్లు. సింగిల్‌ విలేజ్‌ స్కీములను కలిపి సమగ్ర పథకంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సంబంధిత స్కీమ్‌ ఐడీ, ఆమోదిత వ్యయం జేజేఎం-ఐఎంఐఎ్‌సలో యథాతథంగా కొనసాగుతాయి.


పథకం పేరు, దాని భాగాలను మాత్రమే జేజేఎం 2.0 మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చి హర్‌ఘర్‌ జల్‌ లక్ష్యాన్ని సాధించేలా పనులు చేపట్టనున్నారు. 13,247 ఎస్‌వీఎస్‌ పథకాలను 7439 గ్రామాల వారీ పథకాలుగా పునర్యవస్థీకరించనున్నారు. ఇందుకు రూ.3046 కోట్లు ఖర్చు కానున్నాయి. అలాగే 5 ఎంవీఎస్‌ పథకాలకు రూ.1007 కోట్లు కేటాయించారు. రద్దయిన పనులను పునరుద్ధరించడంతోపాటు, గ్రామంలోని అన్ని ఆవాసాలకు మౌలిక వసతులను కల్పించేందుకు సమగ్ర గ్రామ ప్యాకేజీ నిధులను వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించే హర్‌ ఘర్‌ జల్‌ లక్ష్యాన్ని నిర్ణీత గడువులో సాధించాలని స్పష్టం చేసింది. 13,247 పథకాల పునరుద్ధరణ, పునర్యవస్థీకరణకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో గతంలో 2943 పనులకు రూ.1811 కోట్లతో ఇచ్చిన పరిపాలనా అనుమతులు తక్షణమే రద్దయినట్లు ప్రభుత్వం పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..
సీసీ కెమెరాల నిఘాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఏపీ పర్యాటకానికి కేంద్రం సహకారం
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 07:00 AM