ప్రజల అంచనాలకు తగ్గట్లు మారాలి
ABN , Publish Date - Sep 11 , 2026 | 06:50 AM
ప్రజల ఆశలు, అంచనాలకు అనుగుణంగా కలెక్టర్లు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సీఎం సూచించారు. నాయకత్వం విషయంలో కొత్త ఆలోచనా విధానంతో ముందుకు సాగాలన్నారు.
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆశలు, అంచనాలకు అనుగుణంగా కలెక్టర్లు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సీఎం సూచించారు. నాయకత్వం విషయంలో కొత్త ఆలోచనా విధానంతో ముందుకు సాగాలన్నారు. పాలనలో టెక్నాలజీని అందిపుచ్చుకొని, వేగవంతమైన ఫలితాలను సాధించడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ల సదస్సులో ‘లీడర్‌షి్‌ప-న్యూఏజ్ గవర్నెన్స్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. గతంలో చాలా అంశాలపై దృష్టి పెట్టామని, ఇప్పుడు నాయకత్వంపై ఆలోచన చేయాలని చెప్పారు. నూతన నాయకత్వ విధానంతో పనిచేయడం ద్వారా వేగంగా ఫలితాలను సాధించడంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతి నాయకుడూ తమ బృందాన్ని ఎంత ప్రభావవంతంగా నిర్మిస్తారన్నదే ఫలితాలను నిర్ణయిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం మనం నాయకత్వ పరివర్తన దశలో ఉన్నామని, కొత్త నాయకత్వ విధానాలతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నాయకత్వం అనేది స్వీయ ప్రేరణతో ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఫైళ్లు, డేటాలేక్ వంటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఏఐ ద్వారా డేటాను విశ్లేషించుకుని, ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉండాలని చెప్పారు. సాంకేతిక యుగంలో నేర్చుకోవడం నిరంతర ప్రక్రియగా మారిందన్నారు. బ్యూరోక్రసీకి, రాజకీయ నేతలకు, వ్యాపారులకు వేర్వేరు నైపుణ్యాలు ఉండాల్సిందేనన్నారు. ప్రతి రంగంలోనూ సంతృప్తి అనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే భారతీయ వ్యాపారవేత్తలు అత్యుత్తమంగా ఉన్నారని, ప్రతిష్ఠాత్మక కంపెనీలకు వారే సారథ్యం వహిస్తున్నారని సీఎం చెప్పారు. ఏ వ్యవస్థలోనైనా ఇమిడిపోయే తత్వం భారతీయులదని, దానికి అనుగుణంగా మనం కూడా ఉండాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీసీ కెమెరాల నిఘాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఏపీ పర్యాటకానికి కేంద్రం సహకారం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News