Share News

ఆ అధికారం మీకెక్కడిది?

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:31 AM

పొంతన లేని నీటి లెక్కలతో తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అధికారం కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి ఎక్కడిదని ఆంధ్రప్రదేశ్‌ ప్రశ్నించింది. గోదావరి జలాల్లో నీటి లభ్యత తేల్చకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఎలా ఆమోదం తెలుపుతుందని నిలదీసింది.

ఆ అధికారం మీకెక్కడిది?

  • పొంతన లేని నీటి లెక్కలతో టీ-ప్రాజెక్టులకు కేటాయింపులా?

  • కేంద్ర జలసంఘాన్ని ప్రశ్నించిన ఏపీ

  • తెలంగాణకు అనుకూలంగా ఉంటున్నారు

  • నీటి లభ్యత తేల్చకుండానే

  • కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతా?

  • 120 టీఎంసీల నిల్వకు ఓకే అంటే..

  • 180 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు

  • మా అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోకుండా టీఏసీ ఎలా ఆమోదిస్తుంది?

  • గోదావరి జలాల లభ్యతపై 2023 స్టడీ లెక్కలు తప్పుల తడకలు

  • కొత్తగా అధ్యయనం చేయాలి

  • కేటాయింపుల కోసం ట్రైబ్యునల్‌ వేయాలి

  • సమ్మక్క, పాలమూరు ప్రాజెక్టులకు అనుమతులివ్వొద్దు.. భేటీలో ఏపీ డిమాండ్‌

  • 10 రోజుల్లో మళ్లీ సమీక్షిద్దామన్న చైర్మన్‌


అమరావతి/న్యూఢిల్లీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పొంతన లేని నీటి లెక్కలతో తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అధికారం కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి ఎక్కడిదని ఆంధ్రప్రదేశ్‌ ప్రశ్నించింది. గోదావరి జలాల్లో నీటి లభ్యత తేల్చకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఎలా ఆమోదం తెలుపుతుందని నిలదీసింది. నీటి లభ్యతపై అధ్యయనం చేయకుండా.. కేటాయింపులు లేకుండా.. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా గణాంకాలు పదే పదే మార్చేస్తే ఎలాగని ప్రశ్నించింది. తక్షణమే గోదావరి జలాల్లో లభ్యతపై కొత్తగా అధ్యయనం చేపట్టాలని పట్టుబట్టింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా సాంకేతిక ఆమోదం ఇవ్వడాన్ని ఆక్షేపించింది. గోదావరి, కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం సోమవారం ఢిల్లీలో జల సంఘం చైర్మన్‌ అనుపమ్‌ ప్రసాద్‌ అధ్యక్షతన జల వివాదాల సమన్వయ కమిటీ సమావేశమైంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్లు.. ఏపీ జల వనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర విభాగం సీఈ రాధాకృష్ణ, సూపరిండెంట్‌ ఇంజనీర్‌ రాజేశ్వరి, డీఈ ఏసుబాబు, పోలవరం-బనకచర్ల నోడల్‌ ఆఫీసర్‌ రాంచందర్‌రావు, ఈఈ రమేశ్‌.. తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్‌, ఈఎన్‌సీ రవికుమార్‌ తదితరులు హాజరయ్యారు. జల సంఘం తీరును ఆంధ్రప్రదేశ్‌ నేరుగా ప్రశ్నించడంతో.. సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటిదాకా జల సంఘం తీసుకున్న నిర్ణయాలకు తలూపడం మినహా రాష్ట్రాలు ఇలా ఎదురుతిరిగి ప్రశ్నించడం చాలా అరుదు. అనుమతుల్లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇవ్వడాన్ని ఏపీ గట్టిగా తప్పుబట్టింది. దీంతో జల సంఘం నివ్వెరపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టును 120 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించడానికి అనుమతులిస్తే.. తెలంగాణ 180 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిందని.. ఒక ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులిస్తే.. మరో ప్రాంతంలో నిర్మిస్తే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఏపీ ప్రశ్నించింది. గోదావరి జలాల లభ్యతపై కొత్తగా అధ్యయనం చేయాలని భేటీలో పలుసార్లు డిమాండ్‌ చేసింది. 2023లో చేసిన అధ్యయనం ఉందన్న జలసంఘం వాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఈ లెక్కలన్నీ తప్పులతడకలుగా కొట్టివేసింది.


అవి పొంతన లేకుండా.. రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. జల సంఘం తెలంగాణకు సానుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. గోదావరి ట్రైబ్యునల్‌ ఆదేశాలు, రాష్ట్ర విభజన చట్టం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆ రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ఎందుకు నిరోధించడం లేదని నిలదీసింది. అనుమతుల్లేకుండా తెలంగాణ నిర్మిస్తున్న సమ్మక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు అనుమతులివ్వొద్దని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినందున టీఏసీ నిర్ణయంపై పునఃసమీక్షించాల్సిందేనని డిమాండ్‌ చేసింది. గోదావరి జలాల కేటాయింపుల కోసం ట్రైబ్యునల్‌ వేయాలని స్పష్టంచేసింది. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి నిలిపేయాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేస్తోందని.. యథేచ్ఛగా విద్యుదుత్పాదన కొనసాగిస్తోందని.. అలాంటప్పుడు కేంద్ర సంస్థకు ఉన్న అధికారాలేమిటని ప్రశ్నించింది. నదుల అనుసంధానంలో భాగంగానే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం చేపడుతున్నామని తెలిపింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గోదావరిలో నీటి లభ్యతను లెక్కకట్టాలని డిమాండ్‌ చేసింది. రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన రీతిలో నీటి లెక్కలను నిరూపించాలని కోరింది. గోదావరి నుంచి గత 2 నెలల్లో దాదాపు వెయ్యి టీఎంసీలు సముద్రం పాలయ్యాయని.. కళ్ల ముందు వృథా అవుతున్న నీళ్లను వాడుకునేందుకు పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టు చేపడితే తెలంగాణ అభ్యంతరం తెలుపడం సరికాదని తెలిపింది. కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టు ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎఫ్ఆర్‌)కు క్లియరెన్స్‌ ఇవ్వాలని కోరింది. గోదావరిలో నీటి లభ్యతపై జలసంఘం లెక్కలపై తమకున్న సందేహాలను తీర్చి.. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.


అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు..

కాళేశ్వరం ఎత్తిపోతలు, పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క ప్రాజెక్టులను 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయని, పాత ప్రాజెక్టులకే పేర్లు మార్చామని, కొత్త ప్రాజెక్టులేమీ చేపట్టలేదని తెలంగాణ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌ పేర్కొనగా.. ఆ ప్రాజెక్టుల నిర్మాణం ఏ ప్రాంతంలో చేపట్టేందుకు అనుమతులిచ్చారో చెప్పాలని ఏపీ సలహాదారు వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. అనుమతులకు విరుద్ధంగా తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యం ఎంతకు అనుమతులు వచ్చాయి.. ఎంత సామర్థ్యంతో నిర్మించారు? అనుమతులకు భిన్నంగా ప్రాజెక్టులు నిర్మిస్తే ఎలా’ అని ప్రశ్నించారు. 2023 నాటి గోదావరి జలాల అధ్యయన గణాంకాలను తాము అంగీకరించబోమన్నారు. కొత్తగా అధ్యయనం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో ఈ అంశాలపై పది రోజుల్లో మరోసారి సమీక్షిద్దామని జలసంఘం చైర్మన్‌ అన్నారు. అందులో చర్చించేందుకు ముందస్తుగా అజెండా పంపాలని రెండు రాష్ట్రాలకూ సూచించారు.

ఈ వార్తలనూ చదవండి

స్పృహ తప్పిన వృద్ధుడికి ఏఎస్‌ఐ సేవలు

12న జాతీయ లోక్‌ అదాలత్‌

Updated Date - Sep 08 , 2026 | 04:31 AM