‘ఖాకీ’ కొలువుకు వేళాయె..
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:38 AM
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రాష్ట్ర హోం శాఖలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హోం శాఖలోని కీలకమైన పోలీసు విభాగంతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖలో 2,050 పోస్టుల భర్తీకి ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
2,050 ఉద్యోగాలకునోటిఫికేషన్ జారీ
438 ఎస్‌ఐ.. 1569 కానిస్టేబుల్ పోస్టులు
ఫోరెన్సిక్ అసిస్టెంట్లు 43,
ఫైర్‌మన్లు 158, జైలు వార్డర్లు 171 కూడా
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. త్వరలో షెడ్యూల్
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రాష్ట్ర హోం శాఖలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హోం శాఖలోని కీలకమైన పోలీసు విభాగంతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖలో 2,050 పోస్టుల భర్తీకి ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ) బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 438 ఎస్‌ఐ పోస్టులతో పాటు 1,569 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. విభాగాల వారీగా.. 253 ఎస్‌ఐ పోస్టులు, ఆర్మ్‌డ్ రిజర్వ్‌లో 116, ఎస్పీఎఫ్‌లో 9, కమ్యూనికేషన్‌లో 50, పీటీవోలో 10ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది.
అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 542, ఆర్మ్‌డ్ రిజర్వ్ 285, అగ్నిమాపక శాఖలో 158 ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. జైళ్ల శాఖలో 171 వార్డెన్ పోస్టులు భర్తీ చేస్తుండగా వీరిలో పురుషులు 150, మహిళలకు 21 పోస్టులు కేటాయించారు. పోలీసు కానిస్టేబుల్ కమ్యూనికేషన్ విభాగంలో 200 పోస్టులు, పీటీవోలో 198 డ్రైవర్, 15 మెకానిక్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. సైంటిఫిక్ విభాగంలో ఫిజికల్, కెమికల్, బయాలజీ విభాగాలకు సంబంధించి 43 అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు వివరించింది.
ఇవీ నిబంధనలు
సివిల్, ఏఆర్, పోలీసు ట్రాన్స్‌పోర్ట్, ఎస్పీఎఫ్‌లలో ఎస్‌ఐ పోస్టులకు కనీస విద్యార్హత డిగ్రీ కాగా వయసు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు లభిస్తుంది. ఈ పోస్టులకు ప్రాథమిక రాత పరీక్షతో పాటు దేహదారుఢ్య, శారీరక సామర్థ్య, తుది రాత పరీక్షలు ఉంటాయి. అదే విధంగా పీటీవో, కమ్యూనికేషన్ విభాగాల్లో ఎస్‌ఐ పోస్టులకు రాత పరీక్ష ఉండదు.
సివిల్, ఏఆర్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ కాగా వయో పరిమితి 18నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వారికి ఐదేళ్ల సడలింపు ఉంటుంది. విద్యార్హత పదో తరగతి పాసై, ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన వారు అర్హులు.
అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో పైర్‌మెన్లు, వార్డర్ల పోస్టులకు ఇంటర్మీడియట్ విద్యార్హత కాగా ఎస్‌సీ, ఎస్టీలు 10వ తరగతి పాసై ఇంటర్ పరీక్ష రాసి ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, ప్రాథమిక రాత పరీక్ష షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు ఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య