ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు.. రికార్డు స్థాయిలో మెజార్టీలు
ABN , Publish Date - Nov 07 , 2026 | 08:16 PM
ఏపీ పరిషత్ పోరులో అభ్యర్థులు పలు భారీ మెజార్టీ విజయాలను నమోదు చేశారు. గత ఎన్నికల్లోని రికార్డులనూ బద్దలు కొట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ పరిషత్ పోరులో అభ్యర్థులు పలు భారీ మెజార్టీ విజయాలను నమోదు చేశారు. గత ఎన్నికల్లోని రికార్డులనూ బద్దలు కొట్టారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో టీడీపీ జడ్సీటీసీ అభ్యర్థి డాక్టర్ నాగోతు వెంకట లక్ష్మీసరోజ 32,919 ఓట్ల మెజార్టీతో సీసీఎం అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ప్రస్తుతానికి ఇదే రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ విజయం. పల్నాడు జిల్లా పెదకూరపాడు జడ్పీటీసీ స్థానం కోసం బరిలోకి దిగిన జనసేన అభ్యర్థి పమిడిపాటి శ్రీనివాస్ రావు 30,273 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. పల్నాడు జిల్లా నూచెండ్ల మండలంలో జడ్పీటీసీ స్థానం కోసం పోటీపడిన జనసేన అభ్యర్థి శింగంశెట్టి వెంకట బాల ప్రసాద్ 28,863 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. అదే జిల్లాలోని మాచవరం మండలంలో టీడీపీ అభ్యర్థి కత్తి సరోజిని 22,882 ఓట్ల తేడాతో గెలిచారు.
నంద్యాల జిల్లా డోన్ మండలంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రేగటి లక్ష్మీవేదవతి 23,168 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి పుత్త బ్రహ్మం 21,407 ఓట్ల తేడాతో గెలుపొందారు. కడప జిల్లా వేంపల్లిలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి బత్తల వెంకట శివమ్మ 19,203 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి 18,728 ఓట్ల తేడాతో ఎన్నికయ్యారు.
ఈ వార్తలూ చదవండి
ఒక్క ఓటుతో తలరాత మారింది.. ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాల వేళ ఆసక్తికర ఘటనలు
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభంజనం