Share News

ఏ ప్రాతిపదికన బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ ఇచ్చారు

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:35 AM

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కేటాయింపును ఏ ప్రాతిపదికన, ఏ గణాంకాల ఆధారంగా చేశారు? మీ నిర్ణయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు?సంబంధిత వివరాలన్నింటినీ తమ ముందు ఉంచాలని పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలను హైకోర్టు ఆదేశించింది.

ఏ ప్రాతిపదికన బీసీలకు 34శాతం రిజర్వేషన్‌ ఇచ్చారు

  • సంబంధిత గణాంకాలను మా ముందుంచండి.. పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలకు హైకోర్టు ఆదేశం

  • తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా

అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కేటాయింపును ఏ ప్రాతిపదికన, ఏ గణాంకాల ఆధారంగా చేశారు? మీ నిర్ణయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు?సంబంధిత వివరాలన్నింటినీ తమ ముందు ఉంచాలని పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలను హైకోర్టు ఆదేశించింది. బీసీల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆమోదం పొందలేదని చెబుతూ, దాని ఆధారంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోలు ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. నివేదికలోని గణాంకాల ఆధారంగా జీవోలు ఇచ్చామని చెబుతున్నారని, అలాంటప్పుడు ఆ వివరాలను బహిర్గతం చేయకపోవడం ఏమిటని ప్రశ్నించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఇచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కోర్టు సమయం ముగియడంతో పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల తరఫు సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ వాదనల కొనసాగింపు కోసం విచారణను ఈ నెల 16కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.


హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, 33.33 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలు జారీ చేసిన జీవో 105, 1065లు రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని, వాటిని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. అలాగే ఇవే జీవోలను సవాల్‌ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన పెనమకూరు వెంకట నరసింహ శర్మ మరో పిల్‌ దాఖలు చేశారు. ఈ ప్రజాహిత వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా పార్టీ ఇన్‌ పర్సన్‌ న్యాయవాది తాండవ యోగేష్‌ వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పులు ఇచ్చాయన్నారు. బీసీ రిజర్వేషన్‌ 34 శాతానికి తగ్గకుండా ఉండాలని 2019లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 176ను బిర్రు ప్రతా్‌పరెడ్డి కేసులో హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు.

16న అన్ని వ్యాజ్యాలూ విచారణ

పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల తరఫున సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపిస్తూ.. సమగ్ర కుటుంబ సర్వే, డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించామన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని రాజ్యాంగంలో ఎక్కడా నిర్దేశించలేదన్నారు. స్థానిక సంస్థలతో ముడిపడిన వ్యాజ్యాలన్నింటీనీ 16న విచారిస్తామని కోర్టు పేర్కొంది.


నివేదిక పరిశీలనలో ఉంది: ఏజీ

బీసీల స్థితిగతులపై రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఇచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. కమిషన్‌ పలు సిఫారసులు చేసిందని, వాటి ఆమోదంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నివేదికలో గణాంకాల ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నారన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏఆర్‌టీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

రెన్యువల్‌ అయ్యేలా చర్యలు చేపట్టండి

Updated Date - Sep 10 , 2026 | 05:36 AM