నిన్న వేట.. నేడు పోట్లాట
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:46 AM
నల్లమల అడవిలో జూలైలో వేటగాళ్ల కారణంగా ఒక పులి మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇప్పుడు మరో పులి మరణం వెలు గు చూసింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఆ ప్రాంతా నికి వెళ్లి పరిశీలించారు.
నల్లమలలో చనిపోతున్న పులులు
ఒకే డివిజన్‌లో వరుస ఘటనలు
ఉక్కిరిబిక్కిరవుతున్న అధికారులు
మార్కాపురం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అడవిలో జూలైలో వేటగాళ్ల కారణంగా ఒక పులి మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇప్పుడు మరో పులి మరణం వెలు గు చూసింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఆ ప్రాంతా నికి వెళ్లి పరిశీలించారు. పులుల మధ్య జరిగిన పోట్లాటలో అది మృతి చెందిందని చెప్పారు. ఏదిఏమైనా గిద్దలూరు అటవీ డివిజన్ పరిధిలో వరుస పులి మరణాలు అటవీ అధికారులను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. ఈఏడాది జూలై 31న రాచర్ల సమీపంలో ఒక పులి కళేబరం కనిపిం చింది. దానిని వేటగాళ్లు చంపినట్లు తేల్చిన అటవీ అధికారులు ఏడుగురుని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ఉన్నత స్థాయి కమిటీ ద్వారా విచారణ చేయించారు. పులుల భద్రతపై ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించారు. ఈ ఘటన మరువక ముందే మంగళవారం పాపినేనిపల్లి సమీపంలో మరో పులి మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కళేబరాన్ని గుర్తించి పరిశీలించారు. ఒక పులి ఆవాస ప్రాంతంలోకి మరో పులి రావడంతో రెండింటి మధ్య జరిగిన పోట్లాటలో మరణించిందని చెప్పారు. దీని వయస్సు దాదాపు మూడేళ్లు ఉంటుందని భావిస్తున్నారు. గిద్దలూరు అటవీ డివిజన్‌లో జరుగుతున్న వరుస ఘటనలతో అధికారులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
రాచర్ల ఎఫ్‌బీవో సస్పెన్షన్
రాచర్ల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ప్రాజెక్టు టైగర్ గిద్దలూ రు డివిజన్ పరిధిలో జూలై 31న వెలుగు చూసిన పులి మృతి కేసులో మరొకరిపై వేటు పడింది. రాచర్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మానాయక్‌ను సస్పెండ్ చేస్తూ ప్రకాశం (టి) డివిజన్ డిస్ర్టిక్ట్ ఆఫీసర్ వినోద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ ఆర్డర్ శనివారం సాయంత్రం గిద్దలూరు డీఎఫ్‌వో కార్యాలయానికి చేరింది. పులి మృతి ఘటనలో ఇప్పటికే ఇద్దరు వాచర్‌లు, ఒక ఎఫ్‌ఆర్‌వోపై చర్యలు తీసుకున్న విషయం విదితమే.