ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే లక్ష్యం: మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - May 17 , 2026 | 01:37 PM
రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు..
అమరావతి, మే 17: రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ యూనిట్‌కు రూపాయి చొప్పున ఛార్జీలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. ‘దేశంలో ట్రూఅప్ పేరిట ఛార్జీలు పెరుగుతుంటే.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ట్రూడౌన్ విధానం ద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన తప్పుడు విధానాల వల్ల విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు, ప్రక్షాళన చర్యల వల్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయి. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పునరుద్పాదక విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్ర ప్రభుత్వంతో జరిపిన ప్రత్యేక సంప్రదింపుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయిలో 20 లక్షల ప్రధానమంత్రి సూర్యఘర్ కనెక్షన్లు మంజూరయ్యాయి. సామాన్యుడికి సైతం నాణ్యమైన, అంతరాయం లేని కరెంటును అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతోనే ప్రభుత్వం అడుగులు వేస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి ‘మెడికల్ దర్శనం’ కోటాను విస్తరించండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News