పంటలకు రక్షక తడులు!
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:12 AM
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావానికి తేమ ఒత్తిడికి గురవుతున్న ప్రతి పంటనూ కాపాడేందుకు యుద్ధప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆదివారం జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
వర్షాభావ ప్రాంతాల్లో ప్రతి పంటనూ కాపాడాలి
అందుబాటులో ఉన్న నీటిని వినియోగించాలి
అధికారులంతా క్షేత్ర స్థాయిలో పర్యటించాలి
రైతుకు ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా ఇవ్వాలి
మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల నిర్దేశం
అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావానికి తేమ ఒత్తిడికి గురవుతున్న ప్రతి పంటనూ కాపాడేందుకు యుద్ధప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆదివారం జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సద్వినియోగంచేసి, పంటలకు రక్షక తడులు అందించాలని రెండు శాఖల అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి, అత్యవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలివ్వాలని, అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కార్యాచరణ మార్చుకుంటూ.. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రతి రైతుకూ ప్రభుత్వం అండగా ఉందనే భరోసా కల్పించాలని.. వర్షాభావంతో వారు నష్టపోకుండా అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల కింద సాగు చేసే రైతులు వరి కాకుండా, ఆరుతడి పంటలను పండించేలా చూడాలని నిమ్మల కోరారు.
పంటలు, వర్షాల ప్రస్తుత పరిస్థితి ఇదీ..
రాష్ట్రంలో జూన్ 1 నుంచి సెప్టెంబరు 12 వరకు 476.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా.. 218.2 మిమీ మాత్రమే నమోదైంది. అంటే 54.2 శాతం లోటు ఏర్పడింది. ఖరీ్‌ఫలో ఇప్పటి వరకు 26.50 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. సాధారణ సాగులో ఇది 74 శాతం. గతేడాది ఇదే సమయానికి 78శాతం పంటలు వేశారు. వరి 12.01 లక్షల హెక్టార్లు, పత్తి 4.11, కంది 2.63, వేరుశనగ 1.47, మొక్కజొన్న 1.08 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. 284 మండలాల్లోని 1,792 రైతుసేవా కేంద్రాల పరధిలోని పంటలపై ఎల్‌నినో ప్రభావం పడింది. మొత్తం 2,44,443 హెక్టార్లలో వివిధ పంటలు ప్రభావితమయ్యాయి. ఇందులో 1,92,387 హెక్టార్లు తేమ ఒత్తిడికి లోనవ్వగా.. 41,474 హెక్టార్లలో పంటలు వాడిపోయాయి. మరో 10,582 హెక్టార్లలో ఎండిపోయాయి. కర్నూలు జిల్లాలో 1,09,255 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 80,751, అనంతపురం జిల్లాలో 32,456 హెక్టార్లలో పంటలకు వర్షాభావం దెబ్బ తగిలింది. కంది 74,301, పత్తి 73,733, వేరుశనగ 25,818, మొక్కజొన్న 24,819, వరి 18,443 హెక్టార్లు ప్రభావితమయ్యాయి. ఇప్పటి వరకు 34,567 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు వేయగా, ఇంకా 95,112 హెక్టార్లను కవర్ చేయాల్సి ఉందని అధికారులు సమీక్షలో వివరించారు. పంటల ఆరోగ్య వివరాలు కేవలం గణాంకాల కోసం కాకుండా.. ఏ ప్రాంతంలో, ఏ పంటకు, ఏ సమస్య ఉందో గుర్తించి, రైతులకు సహాయపడేలా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’