యుద్ధం వచ్చినప్పుడే మాట్లాడతాం!
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:27 AM
‘ఎన్నికల సమయంలో నా స్పీచ్‌లు వేరేలా ఉంటాయి.. యుద్ధం వచ్చినప్పుడే కదా మాట్లాడతాం. హద్దులు దాటినప్పుడు కదా.. మన నోరు, మన గొంతు కట్టలు తెగుతుంది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేనెలా మాట్లాడతానో మీకు తెలుసు! అయితే ఇది శాంతి సమయం.. అని
హద్దులు దాటితే మన నోరు కట్టలు తెగుతుంది: పవన్ కల్యాణ్
కూటమి ప్రభుత్వం ఉన్నది ఓట్ల కోసం కాదు.. ప్రజల బాగు కోసం!
గొడవలు, కొట్లాటలు, గొడ్డలిపోట్లు లేకుండా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్దాం
‘జలధార’తో పులివెందులకూ స్వచ్ఛమైన నీరు: డిప్యూటీ సీఎం
కడప, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల సమయంలో నా స్పీచ్‌లు వేరేలా ఉంటాయి.. యుద్ధం వచ్చినప్పుడే కదా మాట్లాడతాం. హద్దులు దాటినప్పుడు కదా.. మన నోరు, మన గొంతు కట్టలు తెగుతుంది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేనెలా మాట్లాడతానో మీకు తెలుసు! అయితే ఇది శాంతి సమయం.. ప్రజల అభివృద్ధి చూడాల్సిన సమయం. రాయలసీమ అభివృద్ధికి కావలసినట్లుగా మాట్లాడుతున్నాను. గొడవలు, కొట్లాటలు లేకుండా, గొడ్డలిపోట్లు లేకుండా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్దాం’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు. ఓట్ల కోసం కాదు.. ప్రజల బాగు కోసం, సంతోషం కోసం, భావితరాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సోమవారం ప్రొద్దుటూరులో జలజీవన్ మిషన్‌లో భాగంగా ‘అమరజీవి జలధార’ పనులకు శ్రీకారం చుట్టిన ఆయన.. సభలో మాట్లాడారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో రూ.30,156 కోట్ల నిధులతో 3.27 కోట్ల మంది ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దీనిని అమలు చేస్తున్నామని తెలిపారు. 50,317 పనుల ద్వారా 24,601 జనావాసాల్లో 61.60 లక్షల కొళాయిల సామర్థ్యం పెంచి.. వాటిని స్థిరీకరించడంతో పాటు మరో 27.36 లక్షల కొత్త కొళాయి కనెక్షన్లను అందిస్తామని తెలిపారు. పవన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ప్రధాని చెప్పినా వైసీపీ పట్టించుకోలేదు
ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రారంభించిన ‘హర్ ఘర్ జల జీవన్ మిషన్’కు నాటి వైసీపీ ప్రభుత్వం తగిన ప్రాధాన్యమివ్వలేదు. ప్రధాని చెప్పినా వినలేదు. ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడినప్పటి నుంచి 2024 వరకు రాష్ట్రంలో ప్రతిరోజూ 816 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, 1072 ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు (ఓహెచ్‌బీఆర్)/గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(జీఎల్‌బీఆర్)లు, 28,086 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 1.18 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటికి అదనంగా.. 1046 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, 497 ఓహెచ్‌బీఆర్, 13,075 ఓహెచ్‌ఎ్‌సఆర్, 77 కిలోమీటర్ల పైప్‌లైన్ కేవలం ఐదేళ్లలో ఏర్పాటు చేస్తాం. 50,283 సింగిల్ విలేజ్ స్కీం, రెట్రో ఫిట్టింగ్ పనులకు రూ.9 వేల కోట్లు, మల్టీ విలేజ్ స్కీమ్స్‌కు రూ.19,500 కోట్లు, నీటి నాణ్యత పర్యవేక్షణ కోసం రూ.1624 కోట్లు కేటాయించాం. తాగునీటి పథకాలకు ఫిల్టర్ బెడ్స్ చాలా కీలకం. గత ప్రభుత్వంలో నీటి నిర్వహణ సక్రమంగా జరక్కపోవడంతో చాలా ఫిల్టర్ బెడ్స్ దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు రూ.35 కోట్లు ఖర్చు చేసి 340 పునరుద్ధరించాం.. ఇంకా 552 ఫిల్టర్ బెడ్స్‌ను రూ.88 కోట్లతో పునరుద్ధరించబోతున్నాం.
తాళ్లమాపురంపై నాడు వివక్ష..
గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తాళ్లమాపురం గ్రామ ప్రజలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నారు. ఇందుకు కూటమికి, ప్రత్యేకించి జనసేనకు మద్దతుదారులు ఉండడమే కారణం. దాదాపు 6 వేల మంది ప్రజల సమస్యలపై వినతిపత్రం ఇస్తే గత ఎమ్మెల్యే దానిని నలిపేసి పక్కనపడేశారు. ఆనాటి తాళ్లమాపురం పంచాయతీ ప్రజలు ఎదుర్కొన్న వివక్షను నాకు తెలియజేశారు. ఈ గ్రామానికి దాదాపు రూ.1.50 కోట్లతో సీసీ రోడ్లు, రూ.2 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులు మంజూరు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉపాధి పనులు, జేజేఎం పనులు చేపట్టిన చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే వివక్షకు తావులేకుండా సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. గతంలో కడపకు వచ్చిన సమయంలో మధ్యాహ్న భోజనం సమయంలో పిల్లలకు స్మార్ట్‌కిచెన్ ఏర్పాటుకు రూ.10 లక్షలు కేటాయించాను. అది ఈ రోజున చాలా సక్సెసయింది. నీతి ఆయోగ్ దానిని బ్లూప్రింట్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేసింది. ముఖ్యమంత్రి కడప జిల్లా అంతా విస్తరింపజేశారు. అందుకు ఆయనకు, విద్యా మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు. కలెక్టర్ శ్రీధర్‌కు ప్రత్యేక అభినందనలు.’’ అని పవన్ వ్యాఖ్యానించారు. కాగా, జలజీవన్ మిషన్ 2.0 ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులకు ఘన స్వాగతం లభించింది.
మీరు నమ్మి ఓటు వేసినందుకు, కూటమికి వెన్నంటి ఉన్నందుకు ఇవాళ రూ.30 వేల కోట్లకు పైగా విలువైన పనులను ప్రారంభించాం. నీరు తాగిన ప్రతిసారీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుంచుకోవాలని, ఆయన్ను చూసి స్ఫూర్తి పొందాలని అమరజీవి జలధార’ అని పేరు పెట్టాం.
ఆక్వా సాగు, పారిశ్రామిక కాలుష్యం వల్ల కొన్ని ప్రాంతాల్లో నీటి వనరులు కలుషితమవుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆక్వా, పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నాం.
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏపీకి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: మాధవ్
కూటమికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడం వల్లే నేడు గ్రామాల సమగ్ర అభివృద్ధి శరవేగంగా సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రొద్టుటూరు సభలో అన్నారు. 14, 15 కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాకు జమ అవుతున్నాయని.. దీంతో గ్రామాల్లో అభివృద్ధిని కేవలం రెండేళ్లలో సాధించగలిగామని చెప్పారు. ‘ఈ రెండేళ్లలో భారతదేశంలోనే అత్యధికంగా మన రాష్ర్టానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇదంతా డబుల్ ఇంజన్ సర్కారు వల్లే సాధ్యమైంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ది పథలో దూసుకుపోతోంది’ అని ప్రశంసించారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం