దోపిడీ కేసులో ముగ్గురి అరెస్టు
ABN , Publish Date - Oct 05 , 2026 | 01:00 AM
డబ్బును డాలర్లలో మారుస్తానని నమ్మించి పథకం ప్రకారం కారు అద్డాలు పగలగొట్టి రూ.71 లక్షలు దోపిడీకి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను ద్వారకా పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
మరో ఐదుగురి కోసం గాలింపు
సీతంపేట అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): డబ్బును డాలర్లలో మారుస్తానని నమ్మించి పథకం ప్రకారం కారు అద్డాలు పగలగొట్టి రూ.71 లక్షలు దోపిడీకి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను ద్వారకా పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్‌ఏడీ బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన కొణతాల రమేష్ ట్రేడింగ్, మార్కెటింగ్ వ్యాపారం చేస్తూంటారు. ఈ క్రమంలో రాజు అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో పరిచయమై డబ్బును డాలర్ల రూపంలో మార్చవచ్చని చెప్పాడు. దీంతో రమేష్, భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితుడు డి.రమేష్‌తో కలిసి అక్టోబరు 25న రాత్రి నగరానికి వచ్చాడు. రాజు పథకం ప్రకారం ద్వారకానగర్ డైమాండ్ పార్కు వద్ద బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఉన్న రమేష్ కారు అద్దాలను పగలగొట్టిన రాజు అనుచరులు కొణతాల రమేష్, స్నేహితుడు డి.రమేష్ వద్ద బ్యాగులో ఉన్న రూ.71.20 లక్షలు, సుమారు 10 తులాల బంగారు అభరణాలను దోచుకుని పారిపోయారు. బాధితులు ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రైమ్ ఏసీపీ వెంకటరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఈ మేరకు ముగ్గురిని శనివారం ఆరిలోవ, ఆనందపురం, విజయనగరం జిల్లా డెంకాడ ప్రాంతాల్లో అదుపులో తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ఎనిమిది మంది పాల్గొన్నట్టు వివరించారు. ఇందులో విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన కాళా రమణ (35), ఆనందరపురం వేమగొట్టిపాలేనికి చెందిన కోరాడ అప్పల రమణ, అలియాస్ రాజుగారు (25), రేసపువానిపాలేనికి చెందిన బొబ్బిలి పవన్‌కుమార్ (23)లను అరెస్టు చేశామని, మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు.