Share News

అక్రమాలు అవాస్తవం

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:37 AM

మెగా డీఎస్సీ-2025లో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల టెట్‌ అర్హతలు, క్రీడా సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణపై వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, శాప్‌ వైస్‌ చైర్మన్‌/ఎండీ భరణి స్పష్టం చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం పొందిన టీచర్ల అర్హతలపై ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని, ఇందుకోసం రాష్ట్ర విద్యా శాఖలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అక్రమాలు అవాస్తవం

  • నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్‌ కోటా

  • పారదర్శకంగా మెగా డీఎస్సీ నియామకాలు

  • కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారిక సంస్థలిచ్చిన పత్రాలే పరిగణనలోకి

  • ఫిర్యాదులుంటే విచారణ జరుపుతాం

  • స్కూళ్లకెళ్లి టీచర్లను అవమానించొద్దు

  • అలా చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు

  • విద్యా శాఖ కమిషనర్‌, శాప్‌ ఎండీ హెచ్చరిక

  • ఆరోపణలపై కేస్‌ స్టడీస్‌ వివరాలు వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025లో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల టెట్‌ అర్హతలు, క్రీడా సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణపై వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, శాప్‌ వైస్‌ చైర్మన్‌/ఎండీ భరణి స్పష్టం చేశారు. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం పొందిన టీచర్ల అర్హతలపై ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని, ఇందుకోసం రాష్ట్ర విద్యా శాఖలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకానీ ఎవరైనా నేరుగా పాఠశాలలకు వెళ్లి టీచర్ల గురించి అవమానకరంగా మాట్లాడితే కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్సీ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తలు, పాటించిన నిబంధనలను తెలియజేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అభ్యర్థుల గురించి తమ విచారణలో వెల్లడైన కేస్‌ స్టడీస్‌ను వివరించారు.

పారదర్శకంగా ప్రక్రియ: అన్సారియా

మెగా డీఎస్సీ-2025లో టీచర్‌ ఉద్యోగం పొందిన అభ్యర్థుల టెట్‌, విద్యార్హతలు, కేటగిరీలు, రిజర్వేషన్లు, క్రీడా అర్హత సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలించామని విద్యా శాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా చెప్పారు. అభ్యర్థులు పొందుపర్చిన ఏవైనా సర్టిఫికెట్లు నకిలీవని లేదా అర్హతలకు విరుద్ధమని నిర్ధారణ అయితే చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం ఆరోపణల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ప్రతి కేసును అధికారికంగా తగిన ఆధారాలతో సహా పరిశీలిస్తున్నామని తెలిపారు. టీచర్ల నియామక ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల మేరకే జరిగినట్లు స్పష్టం చేశారు. పారదర్శకత, నిబంధనల అమలు, అధికారిక ఆధారాల పరిశీలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చిందని వివరించారు.


రికార్డుల ప్రకారమే క్రీడా కోటా: భరణి

క్రీడా కోటా అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలపై శాప్‌ వైస్‌ చైర్మన్‌/ఎండీ భరణి వివరణ ఇస్తూ.. స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించి 2025 ఆగస్టు 8 నుంచి 14 వరకు తాత్కాలిక జాబితాను ప్రచురించి గ్రీవెన్స్‌కు అవకాశం కల్పించామని చెప్పారు. వీటిపై తర్వాత వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించామన్నారు. స్పోర్ట్స్‌ కోటాపై హైకోర్టులో 69 రాతపూర్వక పిటిషన్లు దాఖలయ్యాయని, ఏపీ స్టేట్‌ జూడో అసోసియేషన్‌ జారీ చేసిన సర్టిఫికెట్ల ప్రామాణికతపై కోర్టులో పిల్‌ నంబర్‌ 170 ద్వారా పరిశీలనలో ఉందని తెలిపారు. 2017 నుంచి విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందినట్లు పిల్‌లో పేర్కొన్నారని తెలిపారు. విజిలెన్స్‌ విచారణ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించిందని, అందువల్ల ఈ అంశంపై తుది నిర్ణయం కోర్టు తీర్పు ప్రకారమే ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రీడా కోటాలో క్రీడాకారులకు అధికారిక సంస్థలు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. జాతీయ స్థాయి పోటీలకు సంబంధించి జాతీయ ఫెడరేషన్లు లేదా రాష్ట్ర అసోసియేషన్లు, ఇంటర్‌ యూనివర్సిటీ పోటీలకు సంబంధిత వర్సిటీలు, స్కూల్‌ గేమ్స్‌కు విద్యా/క్రీడా అధికారి, కేలో ఇండియా గేమ్స్‌కు స్పోర్ట్స్‌ అథారిటీకి ధ్రువీకరణలు జారీ చేసే అధికారం ఉందని తెలిపారు. ఆ ప్రకారమే సర్టిఫికెట్లను టీచర్ల నియామక ప్రక్రియలో పరిశీలిస్తారని వివరించారు. ఒకే మండలానికి చెందిన ఏడుగురు క్రీడాకారుల జూడో సర్టిఫికెట్లపై ఆరోపణలు వచ్చాయని, వాటిపై విజిలెన్స్‌ విచారణ సాగుతోందని తెలిపారు. విచారణలో తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఒక క్రీడాకారుడు తన సొంత జిల్లాలో తప్పనిసరిగా పోటీలో పాల్గొనాలనే నిబంధన లేదని ఏపీ జూడో అసోసియేషన్‌ స్పష్టం చేసిందని చెప్పారు. క్రీడాకారులు తాము చదువుతున్న, పనిచేస్తున్న జిల్లాకు ప్రాతినిధ్యం వహించవచ్చని అసోసియేషన్‌ తేల్చిందని తెలిపారు. స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన అభ్యర్థుల కేస్‌ స్టడీస్‌ను ఆమె వివరించారు.


  • స్పోర్ట్స్‌ కోటాపై సందేహాలు.. వాస్తవాలు

క్రీడా కోటాలో ఎంపికైన భార్యాభర్తలు

నొస్సం కరిష్మా, షేక్‌ ఇమామ్‌ హుస్సేన్‌.. భార్యాభర్తలు. వీరిద్దరూ టీచర్‌ పోస్టులకు ఎంపికయ్యారు. వీరి జూడో సర్టిఫికెట్ల ప్రామాణికతపై సందేహాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరూ 2014 నవంబరు 11-13న విజయవాడలో జరిగిన సీనియర్‌ అంతర్‌ జిల్లా జూడో టోర్నమెంట్‌లో రెండో స్థానం సాధించినట్లు రికార్డుల్లో ఉంది. మహిళలు, పురుషుల విభాగాల్లో వేర్వేరు బరువు కేటగిరీల్లో పాల్గొన్నందున వారి క్రీడా ప్రతిభను వేర్వేరుగా పరిగణించారు. క్రీడా పోటీల్లో పాల్గొనడానికి విద్యా సంస్థల్లో తప్పనిసరిగా నమోదై ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. 2014లో షేక్‌ ఇమామ్‌ హుస్సేన్‌ కర్ణాటకలో బీఈడీ చదువుతున్నా.. తన స్వస్థలం ఆధారంగా కర్నూలు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏపీ తరఫున పోటీల్లో పాల్గొన్నారు.

సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌పై వివాదం

పెద్ది అప్పలరాజు అనే క్రీడా కోటా అభ్యర్థి బాక్సింగ్‌ సర్టిఫికెట్‌పై వివాదం ఏర్పడింది. అప్పలరాజు మొదట తప్పుగా తన సోదరుడి క్రీడా సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారని ఆరోపణ. అయితే ఎన్ని పత్రాలు అప్‌లోడ్‌ చేసినా దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకునే అవకాశం తుది దశలో ఉంది. అభ్యర్థి నేషనల్‌ చాంపియన్‌షిప్‌ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేశారు. ఫిజికల్‌ వెరిఫికేషన్‌లో కూడా అదే సర్టిఫికెట్‌ సమర్పించారు. 2023లో గోవాలో జరిగిన 37వ నేషనల్‌ గేమ్స్‌ రికార్డుల్లో ‘పాండా’గా పేరు నమోదైంది. అసలు సర్టిఫికెట్‌లో అభ్యర్థి పేరు పెద్ది అప్పలరాజుగానే ఉంది.

రికార్డుల ప్రకారం పరిగణనలోకి

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొనడ పద్మజ 2021లో ఏపీ సీనియర్‌ ఇంటర్‌ డిస్ర్టిక్ట్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానం సాధించిన విషయంలో ఆమె వయస్సు, గత క్రీడా రికార్డులపై సందేహాలు వ్యక్తమయ్యాయి. రికార్డులు, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సమర్పించిన ఫామ్‌-2 ఆధారంగా ఆమె క్రీడా విజయాన్ని చెల్లుబాటుగా పరిగణించారు. 2025 ఏప్రిల్‌ 19న జారీ చేసిన జీవో 4లోని నిబంధనల ప్రకారం ఆమెను ఎంపిక చేశారు.


సాఫ్ట్‌బాల్‌ సర్టిఫికెట్లపై స్పష్టత

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సాఫ్ట్‌బాల్‌ సర్టిఫికెట్లపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఫామ్‌-2కు సంబంధించి అసోసియేషన్‌ అధ్యక్షుడు జారీ చేయగలరా? అని సందేహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా.. శాప్‌ ఎండీకి పంపిన లేఖలో క్రీడాకారుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఏపీ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ తరఫున అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు స్పోర్ట్స్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు అధికారం ఇచ్చారు. ఆ అసోసియేషన్‌ను 2026లో శాప్‌ గుర్తించింది.

ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌

ఓసీ-ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీపై ఆరోపణలు ఎదురైనప్పుడు.. ఈ కేటగిరీ అభ్యర్థుల విషయంలో తహశీల్దార్‌ ఇచ్చిన ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా నియామకం చేపట్టారు. వ్యక్తిగత ప్రకటనలు కాకుండా అధీకృత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన ఉంది.


టెట్‌ ఉన్నా లేదని దుష్ప్రచారం

టెట్‌ అర్హత లేకుండానే డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారంటూ సాక్షి పత్రిక చేసిన దుష్ప్రచారాన్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. పలు ఆరోపణలకు వివరణ ఇచ్చింది.

జంపాల ఉష అనే అభ్యర్థి డీఎస్సీలో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు టెట్‌ లేదనేది ఆరోపణ. బీసీ-ఏ కేటగిరీకి చెందిన ఆమె 2012లో 79 మార్కులు, అదే ఏడాది మరో టెట్‌లో 80 మార్కులు, 2017లో 76 మార్కులతో 2-ఏ పేపర్లలో టెట్‌ అర్హత సాధించారు. ఆ తర్వాత గణితం సైన్స్‌లో 2-ఏ పేపర్‌లో మరో రెండుసార్లు అర్హత సాధించారు. 2011 నుంచి 2017 వరకు భాషా సబ్జెక్టులకు ప్రత్యేకంగా టెట్‌ లేదు. 2-ఏ పేపర్లలో ఏదైనా అర్హత సాధిస్తే సరిపోతుంది. అదే విధానంలో 2012, 2017లో ఉన్న టెట్‌ అర్హతల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేశారు.

ఓసీ కేటగిరీకి చెందిన గాయత్రిశ్రీ మిరియాల డీఎస్సీ క్రీడా కోటాలో స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు) ఉద్యోగం సాధించారు. ఆమె 2024లో టెట్‌ రాసి 97.89 మార్కులు సాధించారు. నిబంధనల ప్రకారం ఓసీలు 90 మార్కులు సాధించాలి. ఆమె అంతకంటే ఎక్కువ మార్కులే తెచ్చుకున్నా టెట్‌ లేకుండా ఉద్యోగం ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు.

ప్రగడ కల్యాణి అనే బీసీ-ఏ కేటగిరీ అభ్యర్థి క్రీడా కోటాలో స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ ఉద్యోగం సాధించారు. 2018లో 75 మార్కులతో టెట్‌ అర్హత సాధించారు. బీసీలకు అర్హత మార్కులు 75. ఆ మేరకు మార్కులతో ఆమె అర్హత సాధించినా టెట్‌ లేదని ఆరోపణలు చేస్తున్నారు.


వి.చక్రపాణి రెడ్డి అనే ఓసీ కేటగిరీ అభ్యర్థి ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటాలో డీఎస్సీలో ఉద్యోగం సాధించారు. చిత్తూరు జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌ స్టడీస్)గా పనిచేస్తున్నారు. 2024లో టెట్‌ రాసి 84.7 మార్కులు సాధించారు. నిబంధనల ప్రకారం ఓసీలకు 90 మార్కులు రావాలి. అయితే ఈ అభ్యర్థికి ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ రిజర్వేషన్‌ ఉన్నందున ఆ కేటగిరీలో 40 శాతం అంటే 60 మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ మేరకు టెట్‌ అర్హత సాధించినప్పటికీ లేదని ఆరోపణలు చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి

కరువు సహాయక చర్యలు చేపట్టాలి

లచ్చప్ప మాస్టారు..

Updated Date - Sep 08 , 2026 | 04:37 AM