సైబర్ నేరాల అడ్డుకట్టకు ‘ఏపీ సైబర్ గార్డ్’ వ్యవస్థకు సీఎం చంద్రబాబు శ్రీకారం
ABN , Publish Date - May 29 , 2026 | 09:55 PM
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ‘ఏపీ సైబర్ గార్డ్’ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ప్రారంభిస్తూ, ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.
అమరావతి, మే 29: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఏపీ సైబర్ గార్డ్’ పేరుతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రజలను ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షించడమే లక్ష్యంగా పోలీసు శాఖ చేపడుతున్న చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజల్లో అవగాహన పెంపు, తక్షణ స్పందన వ్యవస్థలను బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. సైబర్ మోసాలు రోజురోజుకీ కొత్త రూపాల్లో పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని అరికట్టేందుకు ‘ఏపీ సైబర్ గార్డ్’లో భాగంగా 6 పిల్లర్స్ రెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందాలు సాంకేతిక నిపుణులు, పోలీసు అధికారులు, డిజిటల్ ఫోరెన్సిక్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తాయి. సోషల్ మీడియా మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్, ఫేక్ యాప్స్, ఫిషింగ్ లింకులు, డిజిటల్ అరెస్టులు వంటి నేరాలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.
సైబర్ మోసాలపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించేలా ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధితుల డబ్బులు నిలిపివేయడానికి వెంటనే బ్యాంకులతో సమన్వయం చేయాలని సూచించారు. డబ్బు ఇతర ఖాతాలకు మళ్లకముందే ఫ్రీజ్ చేసే చర్యలు తీసుకుంటే, బాధితులకు నష్టం తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలకు పాల్పడితే తప్పించుకోలేమనే భయం నేరస్తుల్లో కలగాలి అని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలపై కఠిన నిఘా ఉండాలని, నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు, కేంద్ర సంస్థలతో సమన్వయం పెంచి అంతర్రాష్ట్ర సైబర్ నెట్‌వర్క్‌లపై కూడా దృష్టి సారించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
For More AP News And Telugu News