Share News

విశాఖ నేవీపై హనీట్రాప్‌

ABN , Publish Date - Oct 07 , 2026 | 03:58 AM

రాష్ట్రంలో గూఢచారుల హనీట్రాప్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. విశాఖ నేవీలో పనిచేస్తున్న ఉద్యోగులను ట్రాప్‌ చేసి, దేశానికి చెందిన కీలక రహస్యాలను పాకిస్థాన్‌కు చేర్చేందుకు జరిగిన కుట్రను ఏపీ కౌంటరు ఇంటెలిజెన్స్‌ (సీఐ సెల్‌) ఛేదించింది.

విశాఖ నేవీపై హనీట్రాప్‌

  • పాకిస్థాన్‌కు దేశ రక్షణ రహస్యాలు

  • కుట్రను ఛేదించిన ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌

  • ఇద్దరు అరెస్టు.. 18 మంది కోసం వేట

  • డబ్బు, ఇతర ప్రలోభాలతో సిబ్బందికి ‘పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌’ మహిళల వల

  • ఫేక్‌ ఖాతాలతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో పరిచయాలు

  • అందమైన యువతుల ఫొటోలతో రిక్వెస్టులు

  • ట్రాప్‌లో పడిన సిబ్బంది నుంచి కీలక వివరాలు

  • జలాంతర్గాముల సంఖ్య, ఇతర అంశాలపై ఆరా

  • ‘ఆపరేషన్‌ ఫైర్‌ వాల్‌’లో గుర్తించిన సీఐ సెల్‌

  • 10 రాష్ట్రాల పరిధిలో 12 టీమ్‌ల సోదాలు

  • కోయంబత్తూర్‌, విశాఖలో ఇద్దరి అరెస్టు

అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గూఢచారుల హనీట్రాప్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. విశాఖ నేవీలో పనిచేస్తున్న ఉద్యోగులను ట్రాప్‌ చేసి, దేశానికి చెందిన కీలక రహస్యాలను పాకిస్థాన్‌కు చేర్చేందుకు జరిగిన కుట్రను ఏపీ కౌంటరు ఇంటెలిజెన్స్‌ (సీఐ సెల్‌) ఛేదించింది. సున్నితమైన సమాచారం రాబట్టేందుకు పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌ (పీఐవో)కు చెందిన మహిళలు వేసిన ఎత్తును చిత్తుచేశారు. ‘ఆపరేషన్‌ ఫైర్‌ వాల్‌’ పేరిట ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. మరికొందరు అనుమానితులపై కన్నేసి, పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కుట్రలో 13 మంది నేవీ సిబ్బంది పాత్రను ఇప్పటివరకు పసిగట్టారు. అందులో.. విశాఖ నేవీలో పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఉద్యోగితో పాటు కాంట్రాక్టు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఏపీ పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు వివరాలివీ..


ఫేక్‌ ఖాతాలతో వల..

పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌ (పీఐవో) కోసం పనిచేస్తున్న జోషితా పాల్‌ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పరచుకొని, అనంతరం వాట్సాప్‌ కమ్యూనికేషన్‌కు మార్చినట్లు సీఐ సెల్‌ గుర్తించింది. ముంబైలోని ఓ షిప్‌ బిల్డింగ్‌ కంపెనీలో ఉద్యోగినిగా తనను తాను పరిచయం చేసుకుంది. మరో పీఐవో అన్వి మెహతా తనను ఢిల్లీకి చెందిన సైకాలజిస్టుగా నేవీ సిబ్బందికి పరిచయం చేసుకుంది. వాయిస్‌, వీడియో కాల్స్‌ ద్వారా వారితో సన్నిహితంగా మెలిగినట్లు మన అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరూ...భారత నేవీ రహస్యాల కోసం అందులో పనిచేసే సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఫేక్‌ ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలతో ఎరవేశారు. అందమైన యువతుల ఫొటోలతో నకిలీ పేర్లతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి, చాటింగ్‌ చేశారు. వాయిస్‌, వీడియో కాల్స్‌ ద్వారా సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత వాట్సాప్‌ కమ్యూనికేషన్‌ తమ పరిధిలోకి తీసుకుని రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు. నౌకల సంఖ్య, జలాంతర్గాముల కదలికలు, కమాండింగ్‌ ఆఫీసర్ల వివరాలు, ఫొటోలు ఇతర వివరాలను జోషితా పాల్‌ ఆరా తీసేదని, సీఐ సెల్‌ గుర్తించింది. ప్రతిఫలంగా డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టేదని కనుగొన్నారు. దేశ రక్షణకు సబంధించిన సున్నితమైన సమాచారాన్ని కోరడంతో పాటు వీడియో కాల్‌ ద్వారా నేవీ స్థావరాలు, నౌకలు, జలాంతర్గాముల్లోని సున్నిత ప్రాంతాలు చూపించాలని అన్వి మెహతా కోరింది. ఓటీపీలతో పాకిస్థాన్‌ వాట్సాప్‌ ఖాతాలను యాక్టివేట్‌ చేసి, మన దేశ రక్షణ సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసింది. క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు ఇస్తానంటూ ఆశ చూపి, హనీట్రాప్‌ వేసినట్లు ఏపీ సీఐ సెల్‌ గుర్తించింది. ఆ మహిళలు ఇద్దరూ పాకిస్థాన్‌ గూఢచారులని, ఆ దేశంలోనే ఉన్నట్లు గుర్తించింది.


ఎలా గుర్తించారు?

భారత రక్షణ వ్యవస్థకు చెందిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని సేకరించేందుకు పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ అపరేటివ్స్‌. మహిళల పేర్లతో హనీట్రాప్‌ వల విసురుతున్నట్లు ఏపీ సీఐ సెల్‌ గుర్తించింది. నేవీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఫేక్‌ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా పరిచయం పెంచుకుని, ఆ తర్వాత వాట్సాప్‌ ఖాతాకు కమ్యూనికేషన్‌ మార్చి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు మన అధికారులు గుర్తించారు. విశాఖ నేవీలో పనిచేస్తున్న ప్రదీప్‌ ముఖర్జీ అనే బెంగాలీ ఈ మహిళల ట్రాప్‌లో పడినట్లు పసిగట్టారు. అక్కడి నేవీ, రక్షణ సంస్థల వ్యూహాత్మక ప్రాంతాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ మార్గాల్లో ‘పీఐవో’కు చేరవేస్తున్నట్లు సెప్టెంబరు 2న గుర్తించారు. వెంటనే బీఎన్‌ఎస్‌, ఉపా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌లకు 12 బృందాలను పంపారు. ఆయా రాష్ట్రాల్లోని యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌), స్థానిక పోలీసులు, నేవీ అధికారులతో కలిసి ’ఆపరేషన్‌ ఫైర్‌ వాల్‌ 2026’ పేరుతో 18 మంది అనుమానితులను విచారించారు. అందులో 13మంది పాత్రను గుర్తించారు. ఈ క్రమంలో విశాఖ నేవీలో కాంట్రాక్టు డ్రైవర్‌గా పని చేస్తున్న అన్నం సాయి వరప్రసాద్‌ను అరెస్టు చేశారు. పాక్‌కు సున్నితమైన సమాచారాన్ని చేరవేసి ప్రతిఫలంగా నగదు తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. విశాఖ నేవీ బేస్‌లో పనిచేస్తున్న ప్రదీప్‌ ముఖర్జీని తమిళనాడులోని కొయంబత్తూరులో అరెస్టు చేశారు.


పీఐవోలకు వాట్సాప్‌ ఖాతా యాక్టివేషన్‌ కోసం ఓటీపీ అందించడం, పీఐవోలతో కమ్యూనికేషన్‌ కొనసాగించడం, దేశ రక్షణకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని చేరవేయడంలో ఆయన పాత్ర ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నౌకలు, జలాంతర్గాముల కదలికల ఫొటోలు, వీడియోల కోసం ‘పీఐవో’ మహిళలు పెట్టిన ప్రలోభాలకు గురైనట్లు ఆధారాలు సేకరించారు. కోయంబత్తూరులో ఆచూకీ గుర్తించి స్థానిక కోర్టులో ట్రాన్సిట్‌ వారెంట్‌ తీసుకుని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అరెస్టుల సమయంలో స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కమ్యూనికేషన్‌ వివరాలు విశ్లేషిస్తున్నామని సీఐ సెల్‌ అధికారులు తెలిపారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో మరిన్ని వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 03:58 AM