పెట్టుబడులకు సదస్సుకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:01 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవంబరులో నిర్వహించనున్న సీఐఐ పెట్టుబడిదారుల ప్రధాన భాగస్వామ్య సదస్సుకు ముందుగా ప్రాంతీయ సదస్సులు ఏర్పాటుచేస్తోంది. అందులో భాగంగా తొలి సదస్సును బుధవారం ఆనందపురం మండలం గంభీరంలోని ఐఐఎంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 500 మంది వరకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు హాజరుకానున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు.
నేడు గంభీరంలోని ఐఐఎంలో ప్రాంతీయ సదస్సు
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తలు రాక
కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు
ఎంఎస్‌ఎంఈ పాలసీ 4.0, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, లభించే రుణాలు వివరించనున్న ప్రజా ప్రతినిధులు
అమ్మకందారులు, కొనుగోలుదారులు మధ్య బి టు బి సమావేశాలు
పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు
విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవంబరులో నిర్వహించనున్న సీఐఐ పెట్టుబడిదారుల ప్రధాన భాగస్వామ్య సదస్సుకు ముందుగా ప్రాంతీయ సదస్సులు ఏర్పాటుచేస్తోంది. అందులో భాగంగా తొలి సదస్సును బుధవారం ఆనందపురం మండలం గంభీరంలోని ఐఐఎంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 500 మంది వరకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు హాజరుకానున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఎంఎస్‌ఎంఈ పాలసీ 4.0 గురించి ప్రాంతీయ సదస్సులో మంత్రులు వివరిస్తారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, లభించే రుణాలు వెల్లడిస్తారు. స్థానికంగా కొత్త ఆలోచనలతో వచ్చే స్టార్టప్‌ల నిర్వాహకులను పెట్టుబడిదారులతో అనుసంధానిస్తారు. వివిధ రకాల ఉత్పత్తులు, వాటి అమ్మకందారులు, కొనుగోలుదారులు కూర్చుని చర్చించుకునేలా బి టు బి సమావేశాలు ఏర్పాటుచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఒక కుటుంబం...ఒక పారిశ్రామికవేత్త’ నినాదం సాకారమయ్యేలా ఇక్కడ చర్చలు నిర్వహిస్తారు. ప్రాంతీయ సదస్సులను ఒక్కో నగరంలో ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తుండగా విశాఖపట్నంలో ‘టెక్నాలజీ అండ్ డీప్ టెక్’ అంశాన్ని ఎంచుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల పథకాలు, అందించే రాయితీలు, ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటుచేసిన పారిశ్రామిక పార్కులు, వాటిలో అందుబాటులో ఉన్న భూములు తదితర వివరాలన్నీ ప్రదర్శించేందుకు ప్రత్యేకమైన స్టాళ్లు ఏర్పాటుచేశారు. ప్రధాన వేదికపై సమావేశంతో పాటు సమాంతరంగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్న రంగాలు, అవకాశాలు, అనుకూల వాతావరణం, మౌలిక వసతులు, ప్రభుత్వ సహకారం గురించి ఈ సదస్సు ద్వారా వెల్లడిస్తారు. పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కూడా చేయనున్నారు.
ప్రముఖుల రాక
విశాఖలో ప్రాంతీయ సదస్సుకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్‌వస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సుకు ప్రారంభోత్సవ కార్యక్రమంగా దీనిని భావిస్తుండడంతో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ వారం రోజులుగా దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ షాన్మోహన్, పరిశ్రమల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ బన్సాల్, డీసీపీ మణికంఠ తదితరులు మంగళవారం సాయంత్రం గంభీరం వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. వీవీఐపీల పార్కింగ్, వేదికల వద్ద వసతులు వంటివి తనిఖీ చేశారు.