Share News

తాజా బలంతో బరిలోకి!

ABN , Publish Date - Oct 07 , 2026 | 03:33 AM

కూటమిలోని మూడు పార్టీల నడుమ 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సర్దుబాటుతో సంబంధం లేకుండా తాజా బలాబలాల ఆధారంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు.

తాజా బలంతో బరిలోకి!

  • 2024 నాటి సర్దుబాటుతో సంబంధం లేదు

  • ప్రస్తుత బలాబలాల ఆధారంగా పోటీ

  • ‘స్థానికం’పై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం?

  • ఉండవల్లిలో గంటకుపైగా చర్చలు

  • కూటమి ఐక్యతకు దెబ్బ లేకుండాముందుకు వెళ్దామన్న బాబు

  • జనసేన ఆశిస్తున్న సీట్ల జాబితా అందజేసిన పవన్‌

  • అన్ని స్థాయిల్లో చర్చించాక తుది నిర్ణయం తీసుకుందామన్న సీఎం

అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కూటమిలోని మూడు పార్టీల నడుమ 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సర్దుబాటుతో సంబంధం లేకుండా తాజా బలాబలాల ఆధారంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల కార్యకర్తలు, నాయకుల మనోభావాలను గౌరవిస్తూనే.. కూటమి ఐక్యతకు భంగం కలగకుండా సీట్ల సర్దుబాటుపై ముందుకెళ్దామని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటే ప్రధాన అజెండాగా వీరిద్దరి నడుమ గంటకుపైగా చర్చలు సాగాయి. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చారు. ఆయనకు మంత్రి లోకేశ్‌ స్వాగతం పలికారు. ఆత్మీయంగా కౌగిలించుకుని.. కరచాలనం చేసి ఇంట్లోకి తీసుకెళ్లారు. చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం ఏకాంతంగా గంటకుపైగా చర్చించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నడుమ సీట్ల పంపిణీపైనే ప్రధానంగా చర్చ జరిగింది. తొలి నుంచీ బీసీల పార్టీగా ఉన్న టీడీపీ స్థానిక ఎన్నికల్లో వారికి 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందని, సుప్రీంకోర్టులో దీనిపై తీర్పు వెలువడిన వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తామని చంద్రబాబు పవన్‌కు తెలిపారు. ఈ సందర్భంగా.. జనసేన ఆశిస్తున్న స్థానాల జాబితాను పవన్‌ ఆయనకు అందజేశారు. వీటిపై ఎన్‌డీఏ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలోనూ చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ఉభయులూ నిర్ణయించారు. పవన్‌ 2 గంటలపాటు సీఎం నివాసంలో ఉన్నారు.


ఎమ్మెల్యేలున్న చోట..ఎక్కువ సీట్లు కోరుతున్న జనసేన!

వేరే ప్రాంతాల్లో అడుగుతున్న బీజేపీ!!

చంద్రబాబుకు తెలిపిన పల్లా, నిమ్మల

పవన్‌ కల్యాణ్‌తో సమావేశం అనంతరం చంద్రబాబుతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి రామానాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి సమన్వయ కమిటీ సమావేశాల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయుల్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశాల సారాంశాన్ని వారిద్దరూ ఆయనకు వివరించారు. ‘జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట చైర్మన్‌ పదవితో పాటు 50 శాతం కార్పొరేటర్లు/కౌన్సిలర్ల స్థానాలను ఆ పార్టీ ఆశిస్తోంది. దీనివల్ల ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ సమన్వయంతో పనిచేసే వెసులుబాటు ఉంటుందని భావిస్తోంది. అయితే బీజేపీ ఆలోచన వేరుగా ఉంది. తమ ఎమ్మెల్యే ఉన్న చోట నాయకత్వం ఎలాగూ ఉంది కాబట్టి వేరే చోట చైర్మన్‌, కార్పొరేటర్ల స్థానాలు కేటాయించాలన్న ప్రతిపాదన తెచ్చింది. తద్వారా ఇతర ప్రాంతాల్లోనూ తమ పార్టీ స్థానిక నాయకత్వం బలపడే అవకాశం ఏర్పడుతుందన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది’ అని పల్లా, నిమ్మల వివరించారు. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కానందున.. అవి తేలాకే అభ్యర్థుల పోటీపై తుది నిర్ణయం తీసుకోగలమన్నారు. 2024లో సాధించిన ఓట్ల కంటే ఎక్కువగా స్థానిక ఎన్నికల్లో సాధించాలని సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో కూటమి నేతలు ఐక్యంగా ఉండి అన్ని స్థానాలూ కైవసం చేసుకోవాలని సూచించారు. పవన్‌ కల్యాణ్‌ తనకు అందజేసిన జనసేన స్థానిక అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయాలని పల్లా, నిమ్మలను ఆయన ఆదేశించారు.


రాష్ట్ర సమన్వయ కమిటీ జూమ్‌ కాన్ఫరెన్స్‌

కూటమి పార్టీల రాష్ట్ర సమన్వయ కమిటీ మంగళవారం రాత్రి జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. టీడీపీ నుంచి పల్లా, నిమ్మల.. జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్‌, బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ పాల్గొన్నారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక అభ్యర్థుల జాబితాలపై నిర్ణయానికి వద్దామని మనోహర్‌ సూచించారు. అయితే జనసేన బలంగా ఉందనుకుంటున్న స్థానాల వివరాలను ఇవ్వాలని పల్లా కోరారు. గురువారం మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 03:33 AM