Share News

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

ABN , Publish Date - Nov 20 , 2026 | 07:41 PM

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రెండు వరుస తుఫాన్లతో ఏపీలో ఉద్యాన పంటలకు రూ.1,092 కోట్ల మేర భారీ నష్టం జరిగిందని ఆయన తెలిపారు.

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రెండు వరుస తుఫాన్లతో ఏపీలో ఉద్యాన పంటలకు రూ.1,092 కోట్ల మేర భారీ నష్టం జరిగిందని ఆయన తెలిపారు. ఉద్యాన పంటల పునరుద్ధరణకు రూ.96.33 కోట్ల అదనపు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 28న అర్నబ్, నవంబర్ 2న మురసు తుఫాన్ల ధాటికి ఉద్యాన రైతాంగం కుదేలైందన్నారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 29,960 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, వరుస తుఫాన్ల కారణంగా 71,576 మంది ఉద్యాన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. అర్నబ్ తుఫాన్‌తో 215 మండలాల్లో 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని సీఎం వివరించారు.


అలాగే, అర్నబ్ ప్రభావంతో ఒక్క అరటి పంటే 15,549 హెక్టార్లలో దెబ్బతిన్నదని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మురసు తుఫానుతో 108 మండలాల్లో 6,748 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. అరటి పంట పునరుద్ధరణకు ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద హెక్టారుకు రూ.44 వేలు ఇవ్వాలని, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఎండుమిర్చి, కూరగాయల రైతులను ఆదుకోవాలని లేఖలో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల జిల్లాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయని వివరించారు. మొవ్వ విరిగిన కొబ్బరి చెట్లకు కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు నుంచి ఆర్థిక సాయం అందించాలని కోరారు. రైతుల దీర్ఘకాలిక ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 20 , 2026 | 07:41 PM