క్లాసులోకొచ్చి.. రంపంతో కోసి
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:52 AM
ఆమె పదో తరగతి విద్యార్థిని.. ఎప్పటిలానే ఉదయం తోటి పిల్లలతో కలిసి ఆటోలో స్కూలుకు వచ్చింది. మొదటి పీరియడ్ తర్వాత టీచర్ ఉండగానే ఓ ఉన్మాది తరగతి గది వద్దకు వచ్చాడు. ఎలక్ర్టిక్ రంపాన్ని ఆన్ చేశాడు. బయట మొక్కలు కట్ చేయడానికేమో అని టీచర్ అనుకున్నంతలోనే..
రెక్కీ చేసి మరీ.. టెన్త్ విద్యార్థినిపై ఉన్మాది దాడి
ఎలక్ట్రిక్ రంపంతో కోసిన రాక్షసుడు
రాప్తాడు జడ్పీ పాఠశాలలో దారుణం
తీవ్రంగా గాయపడిన విద్యార్థిని
అడ్డుకోబోయిన విద్యార్థినికీ గాయాలు
నిందితుడు వరసకు సోదరుడే
ఘటనపై ప్రభుత్వం సీరియస్
గ్రీన్ చానల్‌లో బాలిక బెంగళూరుకు తరలింపు
కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం, లోకేశ్
అనంతపురం క్రైం, రాప్తాడు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఆమె పదో తరగతి విద్యార్థిని.. ఎప్పటిలానే ఉదయం తోటి పిల్లలతో కలిసి ఆటోలో స్కూలుకు వచ్చింది. మొదటి పీరియడ్ తర్వాత టీచర్ ఉండగానే ఓ ఉన్మాది తరగతి గది వద్దకు వచ్చాడు. ఎలక్ర్టిక్ రంపాన్ని ఆన్ చేశాడు. బయట మొక్కలు కట్ చేయడానికేమో అని టీచర్ అనుకున్నంతలోనే.. గదిలోకి ప్రవేశించాడు. ‘ఏయ్.. ఎవరు నువ్వు?’ అని టీచర్ ప్రశ్నించేంతలోనే.. చేతిలోని ఎలక్ర్టిక్ రంపంతో ఆ విద్యార్థినిపై దాడికి దిగాడు. విచక్షణా రహితంగా కోసేశాడు. బాలిక ముఖం, చేతులు, ఛాతీ భాగం తెగి.. అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయింది.
అడ్డుకున్న మరో విద్యార్థినిపైనా ఆ ఉన్మాది దాడికి తెగబడ్డాడు. గది అంతా రక్తం చిందింది. పుస్తకాలు రక్తపు మరకలతో నిండిపోయాయి. ఈ ఘటనతో తరగతి గదిలోని విద్యార్థులంతా భీతావహులయ్యారు. కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. శనివారం ఉదయం అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన దారుణమిది. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలికను ఆఘమేఘాలపై గ్రీన్ చానల్ ద్వారా బెంగళూరు తరలించింది.
గాయపడిన బాలికది రాప్తాడు మండలం అయ్యవారిపల్లి కాగా, నిందితుడు ఆమెకు వరసకు అన్నయ్య అయ్యే హేమంత్(27) శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నాగలూరుకు చెందినవాడని పోలీసులు గుర్తించారు. దాడికి కారణాలు స్పష్టంగా తెలియకపోయినా, ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు.
వరసకు సోదరుడే..
రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. ధర్మవరం మండలం నాగలూరుకు చెందిన హేమంత్ తల్లిదండ్రులు చిన్నప్పుడే మృతిచెందారు. హేమంత్ సోదరిని ఆ బాలిక మేనమామకు ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో తరచూ అయ్యవారిపల్లికి వచ్చి వెళ్లేవాడు. దురలవాట్లకు బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ, డబ్బుకోసం కూలిపనులు చేస్తుంటాడు. చెల్లెలి వరస అయ్యే సదరు విద్యార్థిని పెళ్లి చేసుకోవాలని హేమంత్ వెంటబడుతున్నట్లు, ఆమె వ్యతిరేకించడంతో కక్ష పెంచుకుని పక్కా ప్రణాళికతో దాడిచేశాడని భావిస్తున్నారు. బాలిక నోరు తెరిస్తేగాని విషయంపై స్పష్ట త రాదని అంటున్నారు. ఈ దాడికి ముందు నాలుగైదు రోజులుగా రెక్కీ నిర్వహించాడని సమాచారం.
కూలీలా వచ్చి.. పథకం ప్రకారమే దాడి..
రాప్తాడు జడ్పీ పాఠశాలలో పలు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేరుగా ఒక్కడే వెళితే అనుమానిస్తారని భావించిన హేమంత్, మెటీరియల్ తీసుకుని కొందరు కూలీలు ఆటోలో రాగా, వారి వెనుకే హేమంత్ లోపలికి ప్రవేశించాడు. దీంతో అతడూ పనులకోసమే వచ్చాడని అందరూ భావించారు. పదో తరగతి గది వద్దకు ఉదయం 10 గంటల సమయంలో వెళ్లిన హేమంత్, బయటే ఎలక్ట్రిక్ రంపాన్ని ఆన్ చేశాడు. ఆ సమయంలో గదిలో పాఠాలు చెబుతున్న గణిత ఉపాధ్యాయిని రాజరాజేశ్వరి అది చూసి.. చెట్ల కొమ్మలను కత్తిరిస్తున్నారని భావించారు. అంతలోనే ఉన్మాది లోపలికి రావడంతో ఆమె ప్రశ్నించారు. ‘ఏయ్.. ఎవరు నువ్వు..?’ అని అంటుండగానే రంపంతో నేరుగా బాలిక వద్దకు దూసుకెళ్లిన హేమంత్, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ముఖం, గొంతు, ఛాతీ భాగాలు తీవ్రంగా కోతకు గురయ్యాయి.
ఆమె పక్కనే కూర్చున్న మరో విద్యార్థిని అడ్డుకోబోగా, ఆమెపైనా దాడి చేశాడు. దీంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాలిక రక్తపు మడుగులో పడిపోగా, విద్యార్థులందరూ భయంతో పరుగులు తీశారు. అడ్డుకోబోయిన టీచర్‌నూ నిందితుడు బెదిరించాడు. రంపాన్ని తరగతి గదిలోనే పడేసిన ఉన్మాది.. బైక్‌పై పారిపోయాడు. హెచ్‌ఎంకు ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చేసరికి గదిలో దృశ్యాలు భీతావహంగా కనిపించాయి. వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. విషయం దావానలంలా వ్యాపించడంతో స్థానికులు, బంధువులు బడివద్దకు చేరుకున్నారు. బాధిత విద్యార్థులను వైద్యశాలకు తరలించారు. బాలికకు తీవ్రగాయాలు కావడంతో బయటి నుంచి ప్రైవేటు వైద్య నిపుణులను రప్పించారు.
స్థానికంగా ఉన్న ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేయడం సాధ్యం కాదని, ప్లాస్టిక్ సర్జరీ ఓటీ అవసరమని నిర్ణయించి, బెంగళూరుకు తరలించాలని నిర్ణయించారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడి గురించి తెలియగానే ఎస్పీ జగదీశ్‌తో హోంమంత్రి అనిత మాట్లాడారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతపురం సర్వజన వైద్యశాల నుంచి బాలికను బెంగళూరుకు తరలించే క్రమంలో ముగ్గురు వైద్యులు, ఇద్దరు టెక్నీషియన్‌లను పంపించారు. హిమోగ్లోబిన్ శాతం 4కు పడిపోవడంతో ఆస్పత్రిలోనే రక్తం ఎక్కించారు. దారిపొడవునా రక్తం, ప్లాస్మా ఎక్కించేలా ప్రత్యేక బృందాన్ని పంపించారు.
రైల్వే గేట్‌మన్ చొరవతో దొరికిపోయిన ఉన్మాది
బాలికపై దాడిచేసిన అనంతరం హేమంత్ అనంతపురం నగర శివారులోని ప్రసన్నాయపల్లి మార్గంలో ధర్మవరం వైపు వెళ్లాడు. ఆ సమయంలో రైలు వస్తుండటంతో ప్రసన్నాయపల్లి గేట్‌ను మూసివేశారు. అయినా ఆగకుండా బైక్‌ను లోపలికి తీసుకుని వెళ్లడంతో గేట్‌మన్ తన సెల్‌ఫోన్‌తో అతడి ఫొటో తీశాడు. అనంతరం.. గేట్‌మన్ తీసిన ఫొటో ఆధారంగా పోలీసులు హేమంత్ అని గుర్తించారు. ధర్మవరం రైల్వేస్టేషన్‌లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఇంకా అరెస్టు చేసినట్లు ప్రకటించలేదు. దాడి ఘటన అనంతరం క్లూస్ టీమ్, ఫింగర్ ఫ్రింట్స్ టీమ్ రాప్తాడు ఉన్నత పాఠశాలకు చేరుకుని అణువణువు పరిశీలించింది. మొత్తం 8 భాగాలుగా డివైడ్ చేసి పాయింట్స్ సేకరించారు. ఘటనపై రెండు కేసులు నమోదు చేశారు.
ఆ ఉన్మాది నా కళ్లముందే కోసేశాడు
‘ఆ ఉన్మాది నా కళ్లముందే విద్యార్థిని చెట్లుకోసే యం త్రంతో విచక్షణా రహితంగా కోశాడు. వీపు, ముఖం, భుజం, చేతులు.. ఎక్కడ అందితే అక్కడ దాడి చేశాడు’ అని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన గణిత ఉపాధ్యాయిని రాజరాజేశ్వరి కన్నీటిపర్యంతమయ్యారు. ‘బాలిక రక్తపు మడుగులో పడి ఉంది. తరగతి గదంతా రక్తపు మరకలతో ఉంది. బాలికలను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చాం.’ అని స్కూల్ హెచ్.ఎం. రాజేశ్వరి తెలిపారు.
లోకేశ్ ఆదేశాలతో.. బెంగళూరుకు విద్యార్థిని తరలింపు
గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ముందుగానే మణిపాల్ ఆసుపత్రి ఉన్నత స్థాయి వైద్యవర్గాలతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాలికను తరలించేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు కోసం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడారు. ఘటనపై ఎక్స్‌లో లోకేశ్ స్పందిస్తూ.. ‘చిన్నారి చెల్లిని క్లాస్ రూంలో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. గుండె బరువెక్కింది. ఉన్మాదులను ఉక్కుపాదంతో అణచివేస్తాం. పిల్లల భద్రతపై నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవు’ అని అన్నారు.
రాప్తాడు ఘటనపై ప్రభుత్వం సీరియస్
పాఠశాల తరగతి గదిలో విద్యార్థినిపై దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. హెచ్‌ఎంతోపాటు ఆ సమయంలో తరగతి గదిలో ఉన్న టీచర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఘటనలో వారి బాధ్యత ఎంతనే చర్చ మొదలవడంతో చర్యలను నిలిపేసింది. జరిగిన దారుణంపై నివేదిక పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారులను రాష్ట్ర కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయి విచారణకు కమిషనర్ తమీమ్ అన్సారియా ఆదివారం జిల్లాకు వస్తున్నారు. ఇక్కడ చికిత్స పొందుతున్న మరో విద్యార్థినిని పరామర్శించి, ఆమెతో దాడి జరిగిన తీరు గురించి మాట్లాడతారు. ఆ తర్వాత రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి ఘటన జరిగిన తరగతి గదిని, పాఠశాలలో భద్రతను పరిశీలిస్తారు.
మంత్రి సవిత దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో బాలికలపై దాడిగురించి తెలియగానే మంత్రి సవిత తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆమె, దాడి గురించి తెలిసిన వెంటనే అనంతపురం కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.
దాడి హృదయవిదారకం: షర్మిల
రాప్తాడు ఉన్నత పాఠశాల తరగతి గదిలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దారుణమైన దాడి తీవ్ర దిగ్భారంతికి, ఆవేదనకు గురిచేసిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఒక చిన్నారి తన తోటి విద్యార్థుల కళ్లెదుటే తరగతి గదిలో ఇంతటి దారుణమైన హింసకు గురికావడం అత్యంత హృదయవిదారకమని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఈ అమానుష ఘటనే నిదర్శనమని తెలిపారు. బడుల్లో పిల్లలకు రక్షణ ఎక్కడని ‘ఎక్స్’లో ప్రశ్నించారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ
విద్యార్థినిపై రంపంతో దాడి జరిగిన ఘటన తీవ్రంగా బాధించిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే మహిళా కమిషన్ బృందం స్పందించిందని తెలిపారు. విద్యార్థిని తల్లితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైనా, ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులను సంప్రదించి సహాయం కోరాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!