Share News

కేంద్రం కలిసొస్తే అద్భుతాలు

ABN , Publish Date - Nov 14 , 2026 | 03:19 AM

కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

కేంద్రం కలిసొస్తే అద్భుతాలు

  • రెండున్నరేళ్లలో రూ.32.49 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే ఇందుకు నిదర్శనం

  • రాష్ట్రాభివృద్ధి నుంచి నదుల అనుసంధానం దాకా ముందడుగు

  • భోగాపురం, రైల్వే జోన్‌, విశాఖ స్టీల్‌ పునరుద్ధరణ మోదీ సహకారంతోనే సాకారం

  • అన్ని ప్రాంతాలకూ పెట్టుబడుల ప్రణాళికలు

  • దేశమంతా పెట్టుబడుల రక్షణ చట్టమే లక్ష్యం

‘‘కేంద్రం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేసి, జాతికి అంకితం చేయగలిగాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పునరుద్ధరణ, సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ వంటి ప్రాజెక్టులనూ కేంద్రం సాయంతో సాకారం చేసుకున్నాం. న్యూఢిల్లీ (కేంద్రం)- అమరావతి (రాష్ట్రప్రభుత్వం)కి సహకారం అందిస్తే, అభివృద్ధిలో దూసుకుపోతాం. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ పెట్టుబడులు తీసుకురావడం, ప్రాజెక్టులను గ్రౌండ్‌ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. రెండు రోజుల సదస్సులో 109 ఒప్పందాలు కుదిరాయి. రూ.9,02,434 కోట్ల పెట్టుబడులతో 2,00,358 ఉద్యోగాలు ఇవ్వడానికి దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చాయి.’’

- సీఎం చంద్రబాబు


విశాఖపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ పెట్టుబడులు రావడం, ఉత్పత్తులు ప్రారంభించడమే లక్ష్యంగా ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నామని ప్రకటించారు. రెండు రోజుల విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు కార్యక్రమంలో, అనంతరం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రైల్వేజోన్‌, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పునరుద్ధరణ వరకు కేంద్రం అందించిన సహకారంతోనే అద్భుతాలు చేయగలిగామన్నారు. నదుల అనుసంధానం, కొత్త రైల్వే లైన్లను కూడా మోదీ సహకారంతో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

‘‘గతంలో ఐటీ విప్లవాన్ని అందుకుని తెలుగువారిని ప్రపంచ నిపుణులుగా నిలిపాం. ఇప్పుడు వన్‌ ఫ్యామిలీ - వన్‌ ఏఐ అనే నినాదంతో వారిని జ్ఞానవంతులుగా తయారు చేస్తున్నాం. టెక్నాలజీని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి. ప్రతి ఇంటిపైనా సౌర విద్యుత్తు ఫలకాలను ఏర్పాటు చేసి, అత్యధిక ఉత్పత్తిని సాధిస్తాం. దేశ వ్యాప్తంగా 500 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంటే, అందులో 150 గిగావాట్ల లక్ష్యాన్ని ఏపీ నిర్దేశించుకుంది.

కేంద్రం సహకరిస్తే ఆ లక్ష్యాన్ని మించి సౌర విద్యుదుత్పత్తిని సాధిస్తాం.’’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఐఐ భాగస్వామ్య సదస్సుతో పాటు ఐదు సన్నాహక సమావేశాలు నిర్వహించామన్నారు. గోదావరి- కావేరి అనుసంధానంతో రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారమవుతాయని, ఇం దుకు కేంద్రం సహకారం అవసరమన్నారు.


ఇంకా ఆయన ఏమన్నారంటే..

ఎస్ర్కో ఖాతా ‘‘తయారీ రంగం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వైద్యం, విద్య, ఏవియేషన్‌, ఆటోమొబైల్‌ వంటి రంగాల్లో పెట్టుబడు లు వచ్చాయి. కియా సంస్థ ఏడాదికి మరో రెండు లక్షల కార్లు అదనంగా తయారు చేసేందుకు రూ.18,900 కోట్ల పెట్టుబడులు పెట్టేందు కు ముందుకు వచ్చింది. రిలయన్స్‌ సంస్థ రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో ఒప్పందాన్ని చేసుకుంది.

కేవలం 13 లైసెన్సుల ద్వారా ఐదు రోజుల్లోనే ఆటోమేటిక్‌ అనుమతులు ఇస్తున్నాం. సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానాలను అమలు చేస్తున్నాం. గురువారం నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్ర్కో ఖా తా అమల్లోకి వచ్చింది. పారిశ్రామిక సంస్కరణలో ఇది ట్రెండ్‌ సెట్టర్‌..’’

పెట్టుబడుల పరుగు...

‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2024 జూన్‌ నుంచి ఈ సదస్సు ముందు వరకు 714 ప్రాజెక్టులకు సంబంధించి రూ.22.6 లక్షల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిద్వారా రూ.19.3 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. వాటిలో 526 ప్రాజెక్టులకు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపాం. వాటి పెట్టుబడుల విలువ రూ.17.1 లక్షల కోట్లు కాగా, వాటి ద్వారా 12.9 లక్షల మందికి ఉపాధి కలగనుంది. ఇప్పటివరకు 303 ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైంది.

వాటిలో కొన్ని ప్రారంభదశకు చేరుకున్నాయి. ఈ సదస్సుకు ముందు అక్టోబరు 7 నుంచి 26వ తేదీ వరకు జరిగిన సదస్సుల ద్వారా రూ.86,522 కోట్లకు 194 ఒప్పందాలు జరిగాయి. వాటి ద్వారా 1,47,951 మంది కి ఉద్యోగాలు వస్తాయి. ప్రాంతీయ సదస్సులు, ప్రధాన సదస్సు కలిపి మొత్తం 303 ఒప్పందాలు అయ్యా యి. వాటి ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు, 3,48,309 ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వీటితో ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.32.49 లక్షల కోట్లకు చేరింది.’’


ఎంవోయూల పురోగతిపై ఏటా ఆడిట్‌

‘‘రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో వచ్చిన పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా ఇస్తాం. వారి రక్షణకు చట్టం తీసుకువస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులందరికీ ఈ చట్టం రక్షణగా ఉంటుంది. ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపించి పార్లమెంటులో ఆమోదించేలా చర్యలు తీసుకుంటాం.

రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేసే పారిశ్రామికవేత్తలపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. వారి కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఎంవోయూల పురోగతిపై ప్రతి ఏడాది ఆడిట్‌ రిపోర్టు విడుదల చేస్తాం. వచ్చే ఏడాది విశాఖలో 32వ సీఐఐ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తాం. ఈసారి ఐదు రోజులపాటు విశాఖలో ఉండేలా పారిశ్రామికవేత్తలకు ముందుగా ఆహ్వానం పంపిస్తాం.’’

స్పేస్‌ హబ్‌గా తిరుపతి..

‘‘స్పేస్‌ హబ్‌గా తిరుపతిని అభివృద్ధి చేస్తాం. దీనికోసం ఐదు వేల ఎకరాలు కేటాయిస్తాం. ఇప్పటివరకు భూఉపరితలంపై డేటా సెంటర్లు పని చేస్తున్నాయి. భవిష్యత్తులో అంతరిక్షంలో వాటిని నిర్మించే పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో 25 సెక్టోరియల్‌ పార్కులు ఏర్పాటుచేశాం. త్వరలో వ్యవసాయ రంగానికి ఏఐ స్టాక్‌ రూపొందిస్తున్నాం. మొండలీజ్‌ సంస్థతో కలిసి కోకో మిషన్‌ ఏర్పాటుచేస్తున్నాం.

అరకు కాఫీ ఉత్పత్తి, ప్రమోషన్‌ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాం. రాష్ట్రంలో రోడ్లు, రైల్వే, విమాన, జల రవాణా కనెక్టివిటీని మరింత పెంచుతాం. పోర్టులు, విమానాశ్రయాల ను అభివృద్ధి చేస్తాం. పోలవరం నిర్మాణం, రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. రూపాయికి ఎకరా భూమి ఇచ్చినప్పుడు చాలామంది విమర్శలు చేశారు. కానీ, దీనివల్ల పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి.’’


విశాఖ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ..

‘‘విశాఖలో ఐటీ, పర్యాటక రంగాల అభివృద్ధికి కృషిచేస్తున్నాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పునరుద్ధరించడమే కాకుండా, అనకాపల్లికి మిత్తల్‌ స్టీల్‌ తెచ్చాం. విశాఖ నుంచి వివిధ దేశాలకు సబ్‌ సీ కేబుళ్లు వేస్తున్నారు. విశాఖకు వచ్చే ప్రతినిధులు నగర వాతావరణం, ప్రజల ఆతిథ్యంతో సంతృప్తి చెందుతున్నారు. అరకు అందాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్‌ చేస్తాం.

వచ్చే భాగస్వామ్య సదస్సుకు వచ్చే ప్రతినిధులను అరకు లోయకు తీసుకువెళతాం. ప్రస్తుతం నీటి భద్రత కీలకమైన అంశంగా మారింది. గోదావరి - కావేరి నదుల అనుసంధానం దక్షిణాది రాష్ట్రాలకు పరిష్కారం చూపుతుంది. దీనివల్ల రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇలా అన్ని రాష్ట్రాలూ నీటి వివాదాలు పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలి..’’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 03:24 AM