Share News

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Nov 13 , 2026 | 09:05 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా రూ.4 వేల కోట్ల బకాయిలు మిగిల్చారని మండిపడ్డారు.

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్
AP Fee Reimbursement

అమరావతి, నవంబర్ 13: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

సొంత బాబాయ్ హత్య నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వరకు జగన్ వ్యవహారశైలి ఒకే విధంగా ఉంటుందని, తప్పు చేయడం.. ఆ నెపాన్ని ఇతరులపై నెట్టడం.. అబద్ధాలతో తప్పించుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తు కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. సొంత ప్రచారం కోసం, తన ఫొటోల కోసం చూపించిన శ్రద్ధలో కొంతైనా విద్యార్థుల విద్యాభవిష్యత్తుపై పెట్టి ఉంటే రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయేవి కావని నారా లోకేశ్ మండిపడ్డారు.


గత వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి వెళ్లిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాటిని చెల్లిస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు. గడిచిన రెండున్నరేళ్లలోనే సుమారు రూ.5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తాము చెల్లిస్తుంటే తమపైనే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంతో వాస్తవాలను మార్చలేరని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న గత పాలన చరిత్రను చెరిపేయలేరని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనను సైతం స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం జగన్‌కు అలవాటుగా మారిందని తీవ్రంగా విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

మహారాష్ట్రలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..

ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన

Updated Date - Nov 13 , 2026 | 09:40 PM