Share News

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:32 AM

జిల్లాలో మొన్న జరిగిన మునిసిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో బీఫారం అందుకున్న అభ్యర్థులకు సంబంధిత పార్టీల గుర్తులను కేటాయించారు.

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

-పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు

- అభ్యర్థుల అక్షర క్రమంలోనే గుర్తుల కేటాయింపు

- చాలా సింబల్స్‌కు దగ్గర పోలికలు

- ఓటర్లు తికమకపడే అవకాశం

- అభ్యర్థుల్లో ఆందోళన

విజయనగరం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొన్న జరిగిన మునిసిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో బీఫారం అందుకున్న అభ్యర్థులకు సంబంధిత పార్టీల గుర్తులను కేటాయించారు. ఇప్పుడు జరగనున్న పంచాయతీ ఎన్నికలకు మాత్రం అభ్యర్థులకు పార్టీల గుర్తులు కాకుండా ప్రత్యేక గుర్తులను కేటాయిస్తారు. సర్పంచ్‌ అభ్యర్థులకు, వార్డు సభ్యులకు వేర్వేరు గుర్తులు ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్‌ అభ్యర్థులకు 25 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను కేటాయించింది. కొన్ని గుర్తులు సులువుగా ప్రజల్లోకి వెళతాయి. మరికొన్ని గుర్తులు గుర్తించడం కష్టం. అందుకే పోటీ చేయబోయే అభ్యర్థులు గుర్తుల విషయంలో ఒకింత ఆందోళనతో ఉన్నారు. అందుకే గుర్తులు కేటాయించిన మరుక్షణం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 776 పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటికీ మూడు విడతల్లో పోలింగ్‌ జరగనుంది. సర్పంచ్‌ అభ్యర్థులకు మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు సాసరు, క్యారెట్‌, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్‌, టెలీఫోన్‌, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, ఆనాసపండు, షటిల్‌, చేతికర్ర, చెంచా గుర్తులను కేటాయించనున్నారు. వార్డు సభ్యులకు ప్రెషర్‌ కుక్కర్‌, గౌను, స్టూల్‌, ఇస్త్రిపెట్టే, పోస్టు డబ్బా, గ్యాస్‌ స్టౌ, బీరువా, ఐస్‌క్రీమ్‌, కెటిల్‌, కటింగ్‌ ప్లేయర్‌, విద్యుత్‌ స్తంభం, గరాటా, డిష్‌ యాంటీనా, రంపం, కెమెరా, క్యారమ్‌బోర్డు, వయోలిన్‌, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులు కేటాయించనున్నారు. ఇందులో చాలావరకూ గుర్తులు చాలా దగ్గర పోలికలతో ఉంటాయి. ఓటు వేసే సమయంలో కొందరు ఓటర్లు తికమకపడుతుం టారు. అందుకే గుర్తుల విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

గుర్తులు తెలిసినా గందరగోళమే..

ఈ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలిసేలా గుర్తులు కేటాయిస్తారు. అదే విధంగా సర్పంచ్‌లకు సంబంధించి గులాబీ రంగు బ్యాలెట్‌, వార్డు సభ్యుడికి సంబంధించి తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాన్ని సిద్ధం చేశారు. పోటీలో ఉన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడానికి ఇష్టపడకపోతే నోటాకు వేసే అవకాశాన్ని కల్పించారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత రిటర్నింగ్‌ అధికారి బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేస్తారు. అభ్యర్థుల పేర్లలో మొదటి అక్షరం ఆధారంగా నోటిఫై చేసి ఎన్నికల గుర్తులను వరుస క్రమంలో కేటాయిస్తారు. ఈ క్రమంలో బాగా ప్రాచుర్యంలో ఉండి.. గ్రామీణ ప్రాంత ప్రజలు గుర్తించే గుర్తులు వస్తే బాగుంటుంది. లేదంటే ఓటర్లు తికమక పడే అవకాశం ఉంది. ఉదాహరణకు గ్యాస్‌ సిలెండర్‌, గ్యాస్‌ పొయ్యి వంటి గుర్తులు ఓటర్లను తికమక పెట్టేలా ఉంటాయి. మరికొన్ని గుర్తులు కూడా చాలా దగ్గరగా పోలి ఉంటాయి. దీంతో ఓటును ఒకరికి బదులుగా మరొకరికి వేసే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కోసారి ఫలితాలు కూడా తారుమారు అవుతాయి. కొందరు తెలివిగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని సొంతవారితో నామినేషన్‌ వేయించి.. ప్రత్యర్థికి దగ్గరగా ఉండే గుర్తును కూడా పొందుతారు. ఇది కూడా దెబ్బతీసే అంశమే.

Updated Date - Nov 14 , 2026 | 12:32 AM