తాగునీటి సరఫరాకు సిటిజన్ చార్టర్
ABN , Publish Date - Sep 02 , 2026 | 04:18 AM
తాగునీటి సరఫరాలో జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏపీ గ్రామీణ తాగు నీటి చార్టర్-2026ను జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని పంచాయతీలకు ఈ చార్టర్ వర్తిస్తుంది.
15 రోజుల్లో కొళాయి కనెక్షన్
అన్ని సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట గడువు
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): తాగునీటి సరఫరాలో జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏపీ గ్రామీణ తాగు నీటి చార్టర్-2026ను జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని పంచాయతీలకు ఈ చార్టర్ వర్తిస్తుంది. జల్‌జీవన్ మిషన్2.0 మార్గదర్శకాలకు అనుగుణంగా మంగళశారం జీఓ జారీ చేసింది. గ్రామీణ కుటుంబాలకు క్రమం తప్పకుండా, సురక్షితమైన తాగునీటిని నిర్ణీత సమయాల్లో అందించడం చార్టర్ ప్రధాన ఉద్దేశం.
ఫిర్యాదులకు గడువులు
తాగునీరు సరఫరా కాకపోవడంపై వచ్చే ఫిర్యాదును అదే రోజు నమోదు చేయాలి. స్థానికంగా ఏర్పడిన చిన్నపాటి సరఫరా అంతరాయాన్ని 24 గంటల్లో, పంపు లేదా మోటారు మరమ్మతును 48 గంటల్లో చేయాలి. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో అత్యవసర ట్యాంకర్ సరఫరాను 24 గంటల్లో అందించాలి. నీటి సరఫరాకు అంతరాయం కలిగించే పైప్‌లైన్ లీకేజీలను చిన్నపాటివి అయితే 24 గంటల్లో, పెద్దవైతే 72 గంటల్లో పరిష్కరించాలి. నీటి నాణ్యతపై ఫిర్యాదు అందితే 24 గంటల్లో తనిఖీ చేసి నమూనాలు సేకరించాలి. కలుషిత నీటి సమస్యను 24 గంటల్లో క్లోరినేషన్ లేదా డిస్ ఇన్‌ఫెక్షన్ చేపట్టాలి. కొత్త ఇంటి కుళాయి కనెక్షన్‌ను 15 పని దినాల్లో ఇవ్వాలి. దెబ్బతిన్న పబ్లిక్ స్టాండ్‌పోస్టును 7 పని దినాల్లో పునర్నిర్మించాలి. వినియోగదారు/కుటుంబ సేవా రికార్డులను కూడా అప్‌డేట్ చేయాలి. వర్తించేచోట బిల్లింగ్, వినియోగ చార్జీలపై ఫిర్యాదులను ఏడు పనిదినాల్లో పరిష్కరించాలి. ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల నీటి సరఫరా ఉండేలా చార్టర్ లో నిర్దేశించారు. సరఫరా చేసే నీటిలో అవశేష క్లోరిన్ కనీసం 0.20 పీపీఎం, గరిష్ఠంగా 1.00 పీపీఎం ఉండేలా చూడాలి. పైపులైన్ సరఫరాలో అంతరాయంపై 24 గంటల ముందే సమాచారం ఇవ్వాలి.
ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక నంబర్
ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేకత నంబర్ కేటాయించాలి. నిర్దేశించిన గడువులో ఫిర్యాదు పరిష్కారం కాకపోతే అది ఆటోమేటిక్‌గా తదుపరి అధికారికి చేరుతుంది. సేవలను గ్రామ పంచాయతీ కార్యాలయం, అవసరమైనచోట గ్రామ/వార్డు సచివాలయం, టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్, జిల్లా కంట్రోల్‌రూమ్, మొబైల్ యాప్/ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్, మండల/జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ కార్యాలయాల ద్వారా పొందవచ్చు. తాగునీటిని వృథా చేయకుండా చూడటం, గ్రామీణ నీటి వనరులు, పైప్‌లైన్లను కాపాడటం, ఆమోదిత వినియోగ చార్జీలను చెల్లించడం, లీకేజీలు, అక్రమ కనెక్షన్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రజల బాధ్యతలుగా పేర్కొన్నారు. వర్షపు నీటి సంరక్షణ, నీటి వనరుల సుస్థిరతకు కూడా ప్రజలు సహకరించాలని ప్రభుత్వం సూచించింది. జిల్లా సాంకేతిక విభాగాలు/ జిల్లా నీటి పారిశుధ్య మిషన్లు ప్రతి నెలా చార్టర్ అమలును సమీక్షించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలి.
ఈ వార్తలను కూడా చదవండి
సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని