పెరిగిన బీసీ రిజర్వేషన్లు
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:42 AM
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రాష్ట్రంలో మొట్టమొదటసారి బీసీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లను నిర్ధారిస్తూ సిఫారసులు చేసింది.
ఎంపీటీసీలు, మేయర్లు, మున్సిపల్ వార్డు సభ్యుల విభాగాల్లో పెరుగుదల
వైసీపీ ప్రభుత్వంలో 24.56 శాతమే
ప్రభుత్వానికి మిశ్రా కమిషన్ నివేదిక
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రాష్ట్రంలో మొట్టమొదటసారి బీసీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లను నిర్ధారిస్తూ సిఫారసులు చేసింది. 1931 తర్వాత రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ కులగణన జరగలేదు. దీంతో బీసీలకు స్థానిక రిజర్వేషన్లు జనాభా ఆధారంగా కాకుండా ఉజ్జాయింపుగా ప్రకటించేవారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం స్థానిక రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం పోను మిగిలిన 29 శాతంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు సగటున 24.56 శాతం మాత్రమే రిజర్వేషన్లు ప్రకటించారు. ప్రస్తుతం సర్పంచ్‌లకు 27.95 శాతం, ఎంపీటీసీ 25.55 శాతం, ఎంపీపీ 24.6 శాతం, జడ్పీటీసీ 24.6 శాతం, జడ్పీ చైర్‌పర్సన్ 23.08 శాతం చొప్పున బీసీలకు సీట్లు కేటాయించేందుకు కమిషన్ సిఫారసు చేసింది. మరోవైపు కార్పొరేషన్ల మేయర్‌కు 35.29 శాతం, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ 33.02 శాతం, పట్టణ స్థానిక సంస్థల వార్డు సభ్యులకు 32.78 శాతం చొప్పున బీసీలకు సీట్లు దక్కనున్నాయి.
2021 నాటి లెక్కలతో పోలుస్తూ నివేదిక
స్థానిక ఎన్నికలకు సంబంధించి 2026లో బీసీలకు సిఫారసు చేసిన స్థానాలు, 2021లో బీసీలకు రిజర్వు చేసిన స్థానాలతో పోల్చిన నివేదికను మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం కొన్ని స్థానాల మొత్తం సంఖ్యలో తేడాలు వచ్చాయని పేర్కొంది. 2021లో కొన్ని స్థానాలకు పరిపాలనా కారణాలు, న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగకపోవడం, అలాగే విలీనానికి సంబంధించిన అంశాలు ఇందుకు కారణాలుగా పేర్కొంది. 2011 జనాభా లెక్కలతో 2026 యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాను పోల్చినప్పుడు ఎస్టీ, ఎస్సీల జనాభా నిష్పత్తి పెరగడంతో బీసీలకు సిఫారసు చేసిన స్థానాలు తగ్గినట్లు స్పష్టం చేసింది. తాజా సిపారసుల్లో ఎంపీటీసీలు, మేయర్లు, మున్సిపల్ వార్డు సభ్యుల విభాగాల్లో 2021తో పోలిస్తే బీసీల వాటా పెరగ్గా... సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వంటి విభాగాల్లో స్వల్పంగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2026లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,351 సర్పంచ్ స్థానాలకు గాను 3,128 సీట్లు (23.438 శాతం) బీసీలకు సిఫారసు చేశారు. అయితే 2021లో మొత్తం 13,098 స్థానాల్లో 3,111 సీట్లు (23.75 శాతం) బీసీలకు రిజర్వు అయ్యాయి. అనకాపల్లిలో 243 (37.62 శాతం), శ్రీకాకుళంలో 327(35.86 శాతం), విజయనగరంలో 284 (36.55 శాతం), అనంతపురంలో 165(28.60 శాతం), శ్రీసత్యసాయి జిల్లాల్లో 134 (28.69 శాతం), నెల్లూరులో 96 (13.71 శాతం) బీసీలకు సిఫారసు చేశారు.
ప్రస్తుతం మొత్తం 9.913 ఎంపీటీసీ స్థానాల్లో 2,400 (24.21 శాతం) బీసీలకు సిఫారసు చేశారు. 2021లో 9,700 స్థానాలకు గాను 2,104 (21.69 శాతం) వారికి రిజర్వు అయ్యాయి. ప్రస్తుతం మొత్తం స్థానాల సంఖ్యతో పాటు బీసీల వాటా కూడా పెరిగింది.
2026లో మొత్తం 661 జడ్పీటీసీ స్థానాల్లో 152 (238 శాతం) బీసీలకు సిఫారసు చేశారు. 2021లో 652 స్థానాల్లో 153 (23.47 శాతం) వారికి రిజర్వు అయ్యాయి.
రాష్ట్రంలోని 13 జడ్పీ చైర్‌పర్సన్‌లలో 3 బీసీలకు దక్కనున్నాయి. 2021లోనూ బీసీలకు మూడు సీట్లు కేటాయించారు. (ప్రస్తుతం మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగిన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన 15 జిల్లాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించనున్నారు.)
పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 3,884 వార్డు సభ్యుల స్థానాలకు గాను 1,273 సీట్లు (32.78 శాతం) బీసీలకు సిఫారసు చేశారు. 2021లో 3,117 వార్డుల్లో 958 (30.73 శాతం) మంది బీసీలు ఎన్నికయ్యారు.
2026లో 17 మేయర్ స్థానాల్లో 6 (35.29 శాతం) బీసీలకు సిఫారసు చేశారు. 2021లో 16 స్థానాల్లో 5 (31.25 శాతం) రిజర్వు చేశారు.
ప్రస్తుతం మున్సిపాలిటీల్లో మొత్తం 106 చైర్‌పర్సన్ స్థానాల్లో 35 (33.02 శాతం) బీసీలకు సిఫారసు చేశారు. 2021లో 103 స్థానాల్లో 33.01 శాతం ఈ వర్గాలకు రిజర్వు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!