Share News

అక్కడ ఎందుకు ఓడారు..!?

ABN , Publish Date - Nov 04 , 2026 | 03:43 AM

నెల్లూరు జిల్లా పరిధిలో ఎన్నికలు జరిగిన నెల్లూరు కార్పొరేషన్‌, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో కూటమి విజయభేరి మోగించింది. టీడీపీకి చెందిన నెల్లూరు మేయర్‌ అభ్యర్థి రూప్‌కుమార్‌ యాదవ్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అక్కడ ఎందుకు ఓడారు..!?

  • ఆరుచోట్ల ఓటమిపై కూటమిలో చర్చ

  • సమన్వయ లోపం, అభ్యర్థి ఎంపికలో తప్పిదాలు

  • రెండు చోట్ల రెబల్స్‌ గెలుపుతో కొంత ఊరట

(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పుర పోరులో గెలుపు హోరు వినిపించినా... ఆరుచోట్ల కూటమి అభ్యర్థులు ఓడిపోయారు. స్థానికంగా నేతల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాలు, అధికారికంగా నిలబెట్టిన అభ్యర్థికి సహాయ నిరాకరణే దీనికి కారణమని తెలుస్తోంది. మునిసిపాలిటీలకు సంబంధించి... నందికొట్కూరు, బేతంచర్ల, నాయుడుపేట పీఠాలను వైసీపీ అభ్యర్థులే దక్కించుకున్నారు. ఆదోని, నెలిమర్లనూ కూటమి కోల్పోయినప్పటికీ... అక్కడ జనసేన, టీడీపీ రెబల్స్‌ గెలవడం కొంత ఊరట కలిగించే అంశం! ఇక... అనంతపురం మునిసిపల్‌ కార్పొరేషన్‌ కూడా కూటమికి దక్కలేదు. నందికొట్కూరులో టీడీపీ అభ్యర్థి ఓటమికి ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య మధ్య విభేదాలు ప్రధాన కారణంగా కన్పిస్తోంది.

డోన్‌ నియోజకవర్గ పరిధిలోని బేతంచర్లలో వైసీపీ చైర్‌పర్సన్‌తోపాటు 28 వార్డుల్లో 19 వార్డుల్లో వైసీపీ గెలుపొందింది. డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తన దృష్టినంతా డోన్‌ మున్సిపాలిటీపై పెట్టి బేతంచర్లను నిర్లక్ష్యం చేశారన్న వాదన ఉంది. కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ 30, వైసీపీ 15, బీజేపీ 3, ఇతరులు 4 వార్డుల్లో విజయం సాధించారు. అయినా అక్కడ కూటమి తరఫున బరిలో దిగిన టీడీపీ అభ్యర్థి కాకుండా... ఆదోని జనసేన ఇన్‌చార్జి మల్లప్ప సతీమణి రెబల్‌గా నిలిచి గెలిచారు. స్థానిక టీడీపీ నాయకత్వం సమర్థంగా పనిచేయకపోవడం, బీజేపీ ఎమ్మెల్యే నుంచి ఆశించినంత స్థాయిలో సహకారం అందకపోవడమే దీనికి ప్రధాన కారణం. కాగా... జనసేన రెబల్‌ అభ్యర్థి ఆ పార్టీ జెండాలు, పవన్‌ ఫొటోలతో ప్రచారం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల ఓట్లు కూటమి అభ్యర్థికి పడలేదని చెప్పవచ్చు.


ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ 10, జనసేన 5, వైసీపీ 2, ఇతరులు 6 వార్డుల్లో గెలిచారు. అయినా ఇక్కడ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి ఓటమి చెందారు. టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు, రెబల్‌ అభ్యర్థి లంక అప్పలనాయుడు ఇక్కడ విజయం సాధించారు. టీడీపీకి చెందిన పది వార్డుల నేతలు, కౌన్సిలర్లు ఆయనకు మద్దతుగా నిలిచారు. అలాగే జనసేనలోని కొన్ని వర్గాలు కూడా ఆయనకే సహకరించినట్లు సమాచారం.

బీజేపీ అభ్యర్థి ఎంపికపై స్థానిక కూటమి నేతల్లో అసంతృప్తి, టీడీపీ నాయకులతో సమన్వయం లోపించడం నెల్లిమర్లలో కూటమి ఓటమికి దారి తీశాయి. మరోవైపు... తిరుపతి జిల్లా నాయుడుపేటలో మొత్తం 19 వార్డుల్లో కూటమి అభ్యర్థులదే గెలుపు! కానీ... చైర్‌పర్సన్‌ స్థానాన్ని వైసీపీ సుమారు వెయ్యి ఓట్ల ఆధిక్యంతో గెలుచుకుంది. ఇక్కడ కూటమి అభ్యర్థి ఎంపికపై ఆది నుంచే అసంతృప్తి నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తండ్రి చేసిన తప్పిదాలూ దెబ్బతీశాయి.

కూటమి అభ్యర్థి ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థి ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొనడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక... వైసీపీ గెలుచుకున్న ఏకైక కార్పొరేషన్‌ అనంతపురం! ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఓటమికి కారణం కూటమి నేతల మధ్య సమన్వయం లోపించడమే. డివిజన్లలో టీడీపీ, బీజేపీ. జనసేన అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారం చేసుకున్నారు. మేయర్‌ అభ్యర్థి గెలుపుపై తగిన దృష్టి సారించలేదు. దీంతో... డివిజన్లలో కూటమి దూసుకుపోయినా, మేయర్‌ స్థానాన్ని మాత్రం కోల్పోయింది.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 03:43 AM