Share News

కూటమికే.. పట్టణం

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:57 AM

TDP victory in Palasa and Ichchapuram పుర ఓటర్లు కూటమికే పట్టం కట్టారు. జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. వార్డుల్లో సైతం కూటమి కౌనిల్సర్లు విజయదుందుభి మోగించారు.

కూటమికే.. పట్టణం
ఇచ్ఛాపురం, పలాస చైర్‌పర్సన్‌లు లీలారాణి, గంగాభవాని

  • పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో టీడీపీ ఘన విజయం

  • రెండు చోట్లా చైర్‌పర్సన్‌ స్థానాలతో 50 వార్డులు కైవసం

  • లీలారాణికి.. 5,834 ఓట్ల మెజార్టీ

  • గంగాభవానికి 8,845 ఓట్ల ఆధిక్యం

  • ఇచ్ఛాపురం/ పలాస, నవంబరు 3(ఆంధ్రజ్యోతి):

  • పుర ఓటర్లు కూటమికే పట్టం కట్టారు. జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. వార్డుల్లో సైతం కూటమి కౌనిల్సర్లు విజయదుందుభి మోగించారు. పలాసలో మొత్తం 36 వార్డులకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 31 స్థానాలు దక్కించుకున్నారు. ఇచ్ఛాపురంలో 28 వార్డులకుగానూ.. 19 స్థానాలను కైవసం చేసుకున్నారు. రెండు చోట్ల అఖండ విజయం దక్కడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

  • ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో కూటమి ఘన విజయం సాధించింది. చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి ఆశి లీలారాణి 5,834 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి పిలక రాజ్యలక్ష్మిపై గెలుపొందారు. ఇచ్ఛాపురంలో మొత్తంగా 31,452 మంది ఓటర్లు ఉన్నారు. ఆదివారం పోలింగ్‌ రోజు 20,626 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ఏకంగా 12,624 ఓట్లతో టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి లీలారాణి విజయం సాధించారు. పోలైనవాటిలో మూడు వంతుల ఓట్లతో విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. సిట్టింగ్‌ చైర్‌పర్సన్‌గా.. మూడోసారి వైసీపీ తరపున ఎన్నికల బరిలో దిగిన పిలక రాజ్యలక్ష్మి కేవలం 6,790 ఓట్లకే పరిమితమయ్యారు.

  • ఇచ్ఛాపురంలో మొత్తం 28 వార్డులకుగాను 15 చోట్ల టీడీపీ, వైసీపీ 7 చోట్ల, జనసేన అభ్యర్థులు 4 చోట్ల కౌన్సిలర్లుగా గెలుపొందారు. ఇద్దరు స్వతంత్రులు సైతం విజయం సాధించారు. తొలిరౌండ్‌లో 14 వార్డులకు ఫలితాలు ప్రకటించగా.. 10 వార్డులకుపైగా కూటమి అభ్యర్థులే గెలిచారు.

  • గత ఎన్నికల్లో 23 వార్డులుండేవి. అప్పట్లో వైసీపీ 15 స్థానాల్లో గెలిచింది. టీడీపీ ఆరు స్థానాల్లో గెలువగా ఇండిపెండెంట్లు రెండు చోట్ల విజయం సాధించారు. టీడీపీ గెలిచినచోట భారీ మెజార్టీలు రాగా.. వైసీపీ గెలిచిన చోట స్వల్ప మెజార్టీలు రావడం విశేషం.

  • ఒకరు మూడు.. మరొకరు ఆరుఓట్ల తేడాతో..

  • ఇచ్ఛాపురం మునిసిపల్‌ ఫలితాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. చాలా తక్కువ ఓట్ల తేడాతో కొందరు కౌన్సిలర్లుగా గట్టెక్కారు. ఒకటో వార్డులో జనసేన అభ్యర్థి అనపాన మణి.. వైసీపీ అభ్యర్థి సుగ్గు గీతారాణిపై 15 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 17వ వార్డులో టీడీపీ అభ్యర్థి సంతోష్‌కుమార్‌ కూడా వైసీపీ అభ్యర్థి రవిరామ్‌లిమ్మపై 15 ఓట్ల తేడాతో గెలుపొందారు. 18వ వార్డులో వైసీపీ అభ్యర్థి పిలక ఈశ్వరి.. టీడీపీ అభ్యర్థి నందిగాం సరస్వతిపై కేవలం 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 26వ వార్డులో జనసేన అభ్యర్థి దాసరి శేఖర్‌.. వైసీపీ అభ్యర్థి కాళ్ల ధర్మతేజాపై కేవలం మూడు ఓట్ల తేడాతో గెలవడం విశేషం. ఓట్ల లెక్కింపు అనంతరం విజేతల వివరాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎన్‌.రమేష్‌ ప్రకటించారు. విజేతలకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

  • పలాసలో గంగాభవానికి 8,845 ఓట్ల మెజార్టీ

  • పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి వజ్జ గంగాభవానీ.. అఖండ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి తాళాసు శ్రీపద్మపై 8,845 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా జరిగిన ఈ ఎన్నికల్లో గంగాభవానీ గెలుపొందడం విశేషం. 2002లో ఇదే తరహాలో జరిగిన ఎన్నికల్లో ఆమె భర్త వజ్జ బాబూరావు గెలుపొందగా, అదే రీతిలో ప్రస్తుతం భవానీ గెలుపొందారు. మంగళవారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకూ ఓట్ల లెక్కింపు జరగ్గా మొత్తం 18 రౌండ్లలో కూడా గంగాభవానీకి అధికంగా ఓట్లు నమోదవుతూనే ఉన్నాయి. 15వ రౌండ్‌ పూర్తయ్యేసరికి ఆమె గెలుపు ఖాయం కావడంతో వైసీపీ అభ్యర్థి శ్రీపద్మ తమ అనుచరులతో బయటకు వెళ్లిపోయారు.

  • రికార్డు సృష్టించిన కూటమి

  • మొదటిసారిగా పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు కూటమిగా బరిలోకి దిగారు. జనసేనకు - 5, బీజేపీకి -1 స్థానం కేటాయించి మిగిలిన 30 స్థానాల్లో టీడీపీ కౌన్సిలరు అభ్యర్థులు పోటీ చేశారు. టీడీపీకి 27, జనసేనకు 3, బీజేపీకి 1 స్థానంతో మొత్తం 31 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి బ్యాలెట్‌ బాక్స్‌లను తెరచి ఓట్లను లెక్కించాల్సి ఉంది. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కింపు ఆలస్యం కావడంతో కౌన్సిలర్ల ఓట్ల లెక్కింపు 9 గంటలకు ప్రారంభించారు. అప్పటికే అభ్యర్థులు కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉత్కంఠతో ఎదురుచూస్తూ.. అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌ చొరవ తీసుకొని లెక్కింపు వేగవంతం చేయాలని ఎన్నికల అధికారి ఇ.శ్రీనివాసులుకు ఆదేశించారు. లెక్కింపు ప్రారంభం నుంచీ కూటమి అభ్యర్థులను వరుస విజయాలు వరిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటిగా 13,14, 15 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారని ప్రకటించారు. దీంతో పలాస-కాశీబుగ్గ అంతా టీడీపీ విజయంపై ధీమా వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రతీ గంటకు ఎన్నికల ఫలితాలను ఆరా తీయడం, టీడీపీ అభ్యర్థులు గెలుపొందారనే సమాచారం అందడంతో ఉబ్బితబ్బయ్యారు. మధ్యలో 18,2,21 వార్డులు వైసీపీ అభ్యర్థులు గెలుపొందడం, తరువాత లాటరీలో 35వ వార్డు వైసీపీకి రావడం.. ఆ పార్టీ నాయకులకు కాస్త ఊరటనిచ్చింది. టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి వజ్జ గంగాభవానీకి మొదటి రౌండు నుంచి ఆధిక్యం రావడంతో వైసీపీ నాయకులు గెలుపుపై ఆశలు వదులుకున్నారు. సాయంత్రం 4.30గంటలకు వజ్జ గంగాభవానీ 8,845 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం ఆమె భర్త వజ్జ బాబూరావుతో కలిసి కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకొని గెలుపుపత్రాలు అందుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్‌గా విజయం సాధించిన గంగాభవానీకి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

  • లాటరీలో త్రివేణికి నిరాశ

  • పలాస 35వవార్డు టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థిని జోగ త్రివేణికి త్రుటిలో విజయం తప్పిపోయింది. ఈమెకు, వైసీపీకి చెందిన కౌన్సిలర్‌ అభ్యరి మార్పు అరుణకు సమానంగా 340 ఓట్లు పోల్‌ అయ్యాయి. దీంతో ఎన్నికల ఫలితాలు ఆగిపోయాయి. రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు నల్లవరపు సూర్యతేజ వీరిద్దరితో ముందుగా మాట్లాడి లాటరీ పద్ధతి ద్వారా గెలుపోటములు నిర్ణయిస్తామని తెలిపారు. అనంతరం ఇరు అభ్యర్థుల పేర్లను కాగితాలపై రాసి మడత పెట్టారు. అనంతరం వాటిని ఒక డబ్బాలో వేసి తీశారు. ఎవరిది ముందు పేరు వస్తుందో వారిని విజేతలుగా ప్రకటించారు. మొదటి పేరు వైసీపీ అభ్యర్థి అరుణకు రావడంతో ఆమె విజేతగా నిలిచారు. దీంతో త్రివేణి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

  • ఈ విజయం.. కూటమి శ్రేణులది

  • ఇచ్ఛాపురం ప్రజలకు రుణపడి ఉన్నాను. ఇది మాటల్లో చెప్పలేని ఆనందం. కూటమి పార్టీ శ్రేణుల సమన్వయంతోనే ఈ విజయం సాధ్యమైంది. నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విప్‌ బెందాళం అశోక్‌బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇచ్ఛాపురం మునిసిపాల్టీ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాను.

  • - ఆశి లీలారాణి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, ఇచ్ఛాపురం

  • అభివృద్ధి చేస్తా.....

  • నా గెలుపునకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీషకు కృతజ్ఞతలు. వారి అడుగుజాడల్లో వెళ్తూ పలాస అభివృద్ధికి బాట వేస్తా. 2002లో నా భర్త వజ్జ బాబూరావు మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికై.. మునిసిపాలిటీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. అదే తరహాలో పలాస-కాశీబుగ్గను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తా.

  • - వజ్జ గంగాభవాని, చైర్‌పర్సన్‌, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ

  • ఇచ్ఛాపురం మునిసిపాలిటీ

  • ------------------------------------------

  • అభ్యర్థి పేరు పోలైన ఓట్లు

  • ---------------------------------------

  • ఆశి లీలారాణి (టీడీపీ) 12,624

  • పిలక రాజ్యలక్ష్మి (వైసీపీ) 6790

  • బిరాలు బుడ్డెపు (కాంగ్రెస్‌) 127

  • బచ్చు మంగమ్మ (ఇండి) 220

  • చెల్లనవి 704

  • నోటా 161

  • ---------------------------------------------

  • మొత్తం 20,626

  • ---------------------------------------------

  • ఇచ్ఛాపురంలో పార్టీల వారీ వార్డులు

  • =========

  • టీడీపీ- 15

  • వైసీపీ - 7

  • జనసేన - 4

  • స్వతంత్ర - 2

  • ================

  • పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ

  • ------------------------------------------

  • అభ్యర్థి పేరు పోలైన ఓట్లు

  • ---------------------------------------

  • వజ్జ గంగాభవాని(టీడీపీ) 19561

  • తాళాసు శ్రీపద్మ (వైసీపీ) 10716

  • సీతమ్మ (కాంగ్రెస్‌) 157

  • దువ్వాడ శ్రీజ(స్వతంత్ర): 2330

  • లక్ష్మీప్రదాన్‌(స్వతంత్ర) : 219

  • మన్యాల రమ్య(స్వతంత్ర): 513

  • చెల్లని ఓట్లు : 969

  • నోటా : 213

  • ---------------------------------------------

  • మొత్తం : 34,678

  • ---------------------------------------------

  • పలాసలో పార్టీల వారీ వార్డులు

  • =========

  • టీడీపీ- 27

  • జనసేన - 3

  • బీజేపీ - 1

  • వైసీపీ - 4

  • స్వతంత్ర - 1

    03ICP12.gif3plsp16.gif

Updated Date - Nov 04 , 2026 | 12:57 AM