Share News

SARAS Mela 2026: బాబు.. బంగారం.. మహిళల ఆనందం

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:18 AM

సీఎం అంటే నాలుగు గోడల మధ్య కూర్చునే పెత్తందారు కాదని.. అన్నగా అండగా ఉండటానికే ఇష్ట పడతానంటూ స్టాల్స్ అన్నీ కలియతిరిగారు చంద్రబాబు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ని సందర్శించి వారి బాగోగులు, ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారాయన.

SARAS Mela 2026: బాబు.. బంగారం.. మహిళల ఆనందం
SARAS Mela 2026

గుంటూరు సిటీ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న కళాకృతులు.. చేతితో రూపొందించిన బొమ్మలు, వస్తువులు.. ఆకట్టుకుంటున్న వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత, కళంకారీ వస్ర్తాలు.. మహిళలను, యువతులను కట్టిపడేస్తున్న ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు.. నోరూరిస్తోన్న ఆహార పదార్థాలు, వంటకాలను సరస్‌ కేంద్రం గుంటూరువాసులకు అందుబాటులోకి తెచ్చింది. దేశంలో, రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటుంది. కశ్మీర్‌ మొదలుకొని కన్యాకుమారి వరకు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు, ముంబై నుంచి మిజోరం వరకు తూర్పు, పశ్చిమ రాష్ట్రాల స్వయం సహాయక బృందాల రాకతో సరస్‌ ప్రాంగణం మినీ ఇండియాను తలపిస్తోంది. అఖిల భారత స్థాయిలో, న్యూఢిల్లీ వెలుపల ఇంత భారీ ఎత్తున సరస్‌ ప్రదర్శన నిర్వహించడం ఇదే తొలిసారి కావడం అదీ గుంటూరులో ఏర్పాటు చేయడం విశేషం.


అయితే, సరస్‌ మేళాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించగా.. అక్కడ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం అంటే నాలుగు గోడల మధ్య కూర్చునే పెత్తందారు కాదని.. అన్నగా అండగా ఉండటానికే ఇష్ట పడతానంటూ స్టాల్స్ అన్నీ కలియతిరిగారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని సందర్శించి వారి బాగోగులు, ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వివిధ స్టాళ్లను సందర్శించి మహిళా వ్యాపారుల్ని అభినందించారు. మాడుగుల హల్వా రుచి చూశారు. మహిళా సంఘాల ఉత్పత్తుల నాణ్యత, మార్కెట్‌ సామర్థ్యాన్ని ప్రశంసించారు. ప్రతి స్టాల్‌ ఒక విజయగాథను చెబుతోందని వ్యాఖ్యానించారు.


సరస్‌లో ఆసక్తికర పరిణామం..

దేశంలో అత్యంత భద్రతా వలయంలో ఉండే అతి ముఖ్య రాజకీయ నేతల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకరు. అలాంటి నేత భద్రతా వలయాన్ని పూర్తిగా ఛేదించుకుని సామాన్య ప్రజల చెంతకు చేరుతున్నారు. గతానికి భిన్నంగా ప్రతి ఇంటి సంగతులు అడిగి తెలుసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు.. ఎంత సంపాదిస్తున్నారు.. ఏం కావాలని కోరుతున్నారు.. ఇలా అనేక ప్రశ్నలు వేసి జవాబులు రాబడుతున్నారు. గురువారం గుంటూరు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఆసాంతం ఆహ్లాదంగా సాగింది. ఇంటికి ‘అన్న’ వస్తే.. మహిళ ఎంత ఆనందపడతారో అంతకంటే మించిన సంతోషం చేరివచ్చిన వారిలో కనిపించింది. సీఎం చంద్రబాబు సరస్‌ స్టాల్స్‌ పర్యటన మాడుగుల హల్వా వద్ద మొదలై చేతి వృత్తిదారుని మట్టికుండల వద్ద ముగిసింది. అక్కడ జరిగిన సంభాషణలు యథాతథంగా..


మాడుగుల హల్వా.. స్టాల్‌

సీఎం : ఏమ్మా రోజుకు ఎన్ని కేజీలు అమ్ముతారు?

మహిళ: 40 కేజీలు అమ్ముతాం సార్‌

సీఎం: ఎంత మంది పని చేస్తారు?

మహిళ: నలుగురు పనిచేస్తారు సార్‌..

సీఎం: నెలకు ఎంత సంపాదిస్తారు?

మహిళ: రూ.లక్ష సంపాదిస్తాను సార్‌..

సీఎం: అందరికి ఇవ్వగా ఎంత ఉంటుంది?

మహిళ: నాకు 50 వేలు మిగులుతాయి సార్‌, మీ కోసం హల్వా ఉంచాను. తినండి సార్‌.

సీఎం: ఓకే ఇవ్వండి. నాకే కాదు మంత్రి గారికి (పెమ్మసానికి) కూడా ఇవ్వండి.(హల్వా తిన్న తర్వాత సీఎం తన సెక్యూరిటీని పిలిచి స్టాల్‌ యజమానికి రూ. 5 వేలు ఇవ్వాలని ఆదేశించారు)


మీతో ఫొటో కావాలంట సార్‌..

సీఎం సరస్‌ పర్యటన సందర్భంగా ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. సీఎం స్టాల్స్‌ సందర్శిస్తున్న సందర్భంగా ఒక డ్వాక్రా మహిళ ఆయనకు దగ్గరకు వచ్చి మరో మహిళను చూపిస్తూ సార్‌, ఈమె మీతో ఫొటో దిగాలని ఇందాకటి నుంచి అల్లాడిపోతోంది. ఒక్క ఫొటో ఆమెతో దిగండి సార్‌ అని అనడంతో సీఎం చంద్రబాబు నవ్వుతూ ఫొటో దిగారు.


ఇదే విగ్రహం శాండిల్‌ వుడ్‌ (ఎర్ర చందనం)తో చేస్తే..

చంద్రగిరి నియోజకవర్గం నుంచి తీసుకువచ్చిన వెంకటేశ్వరుని చెక్క విగ్రహం సీఎం చంద్రబాబును అమితంగా ఆకర్షించింది. ఆ విగ్రహం ఏ వుడ్‌ (కర్ర)తో తయారు చేశారు అనే విషయాన్ని ఆరా తీసిన సీఎం స్టాల్‌ యజమానికి పలు ప్రశ్నలు సంధించారు. ఇదే విగ్రహం శాండిల్‌ వుడ్‌(ఎర్ర చందనం)తో చేస్తే ఎంతకు అమ్మవచ్చు అని అడిగారు. అందుకు స్టాల్‌ యజమాని స్పందిస్తూ ఇదే విగ్రహం శాండిల్‌‌తో చేస్తే రూ. 2 వేలకు విక్రయించవచ్చు అని బదులిచ్చారు.


అప్పటికప్పుడే ఆర్థిక సాయం..

మట్టితో కుండలు, ఇతర వస్తువులు తయారు చేసే వెంకట్రావు అనే వ్యక్తిపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. స్టాల్‌ సందర్శన సందర్భంగా వెంకట్రావు భార్య తన భర్త అనారోగ్యం గురించి సీఎంకు విన్నవించారు. వెంటనే స్పందించిన సీఎం వైద్యానికి ఎంత కావాలి అని అడుగగా మహిళ రూ. 10 లక్షలు అవుతుందని చెప్పారు. రూ.6 లక్షలు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం స్పందనతో చేతి వృత్తిదారులు అమితానందం పొందారు.

-గుంటూరు సిటీ, ఆంధ్రజ్యోతి


Also Read:

చరిత్ర సృష్టించిన రుతురాజ్‌ గైక్వాడ్

బ్రేక్‌ఫాస్ట్‌ 8 గంటలకే.. గంట ఆలస్యమైనా ఏమవుతుందో తెలుసా..

కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం..

Updated Date - Jan 09 , 2026 | 03:49 PM