వాన ఆగింది.. నీరు నిలిచింది!
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:23 AM
మూడు రోజులుగా దంచికొట్టిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మేఘాలు ఆవరించి.. చెదురుమదురుగా వానలు కురిశాయి. వాయుగుండం తీరం దాటినా ఉత్తరాంధ్రలో వాగులు, నదులు ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్నాయి.
నీరు దిగితేనే పూర్తి అంచనాకు వీలు
భారీ వర్షాలకుతోడు పైనుంచి వరదతోఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ పంట నష్టం!
రాష్ట్రమంతా వేల ఎకరాల్లో వరి మునక
ఉగ్రంగా ప్రవహిస్తున్న నాగావళి, వంశధార, బహుదా
ప్రకాశం బ్యారేజీ నుంచి 65 గేట్లు ఎత్తి
47వేల క్యూసెక్కులు దిగువకు..
పోలవరం నుంచి 4,13,091 క్యూసెక్కులు విడుదల
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్): మూడు రోజులుగా దంచికొట్టిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మేఘాలు ఆవరించి.. చెదురుమదురుగా వానలు కురిశాయి. వాయుగుండం తీరం దాటినా ఉత్తరాంధ్రలో వాగులు, నదులు ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్నాయి. గెడ్డలు పొంగి కల్వర్టులు, రోడ్లపైకి నీళ్లు పారుతుండటంతో ఏజెన్సీలోని చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలతో పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది. నీరు పూర్తిగా దిగితేగానీ పంటల పరిస్థితి తెలియదు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి ఈ సీజన్‌లోనే తొలిసారి అత్యధిక వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజ్ 70 గేట్లలో 65 గేట్లను అడుగు మేర ఎత్తి 47 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నందున శనివారం ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏకంగా రాకాసి అలలు బీచ్‌రోడ్డును తాకాయి. అలల ధాటికి తీరానికి ఆనుకుని ఉన్న రాళ్లు ఎగిరిపడ్డాయి. భారీ వర్షాలతో వరద నీరు జగ్గంపేట వద్ద పోలవరం కాలువలోకి దిగడంతో ఒకచోట లైనింగ్ ధ్వంసమైంది.
పెద్దాపురం పట్టణంలో ఓ వార్డు జలదిగ్బంధంలో చిక్కుకుంది. తాళ్లరేవు మండలంలో గాంధీనగర్ గ్రామం పూర్తిగా నీటమునిగింది. ఇళ్లల్లోకి సైతం నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిఠాపురంలో సుద్ద గడ్డకు వరద పోటు మరింత పెరగడంతో సమీప గ్రామాలు నీటమునిగాయి. వర్షాలకు నానిపోవడంతో రౌతులపూడి మండలం ఎస్.అగ్రహారంలో పెంకుటిళ్లు కూలిపోయింది. అలాగే భారీ వర్షాలకు యు.కొత్తపల్లి పరిధిలో నిర్మాణంలో ఉన్న సాగరమాల జాతీయ రహదారి చెరువును తలపించింది. వరద నీరు ముంచెత్తడంతో కాకినాడ-సామర్లకోట రోడ్డు పలుచోట్ల పూర్తిగా మునిగిపోయింది. దీంతో అచ్చంపేటవైపు వాహనాలను మళ్లించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,947 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
తగ్గని వరద పోటు..
సిక్కోలు జిల్లాలో నాగావళి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం ఉదయాన ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను, మధ్యాహ్నం రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో అన్నవరం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. తోటపల్లి, మడ్డువలస, ఒట్టిగెడ్డ తదితర ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో నాగావళి నది ఉధృతి పెరిగిపోయింది. ఫలితంగా పాలకొండ మండలంలో నదీతీర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అన్నవరం చుట్టూ నీటిని తీసేయడం కోసం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించారు. గ్రామస్థులకు అధికారులు ధైర్యం చెప్పి వ్యాధిగ్రస్థులు, గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామస్థులకు ఆహార పొట్లాలు సరఫరా చేయించారు. ఈ జిల్లాలో ఓనిగెడ్డ, జంపరకోటగెడ్డ, జంపర కోటగెడ్డ, రావాడగెడ్డ ఉప్పొంగి ప్రవహించాయి.
జల దిగ్బంధనంలో గ్రామాలు
విజయనగరం జిల్లాలో నారాయణపురం కుడికాలువకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లపై నీరు ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలోని దుప్పలపూడి గ్రామం జలదిగ్బంధంలో ఉంది. ఉపనదులు ఇంద్రావతి, శబరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల గోదావరికి ఒక మోస్తరు వరద ప్రవాహం తరలివస్తోంది. శుక్రవారం సాయంత్రం ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ 164 గేట్లను 1.5 మీటర్ల మేర పైకి ఎత్తి 4,10,245 క్యూసెక్కుల ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో గోదావరి నీటిమట్టం 9.10 అడుగులుగా నమోదయింది.
వంతెన దాటుతూ.. వ్యక్తి మృతి
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురంలో తూర్పు కొండవాగు వంతెన దాటుతూ గురువారం రాత్రి కేఆర్‌పురం కాలనీకి చెందిన పూనెం భాస్కరరావు (65) గల్లంతయ్యాడు. వంతెనకు కొద్దిదూరంలో పొదల్లో శుక్రవారం మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం లంక గ్రామంలో నాగావళి నది ఆవల గొర్రెల కాపరిలు సోడిముడి నాగరాజు, లడగల వెంకట్రావు, పల్లా అప్పారావు, ఆవాల గంగు చిక్కుకున్నారు. వారిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. విజయనగరం జిల్లాలోని ముంపు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వెళ్తున్న అధికారుల వాహనం జావాం సమీపంలో నీటిలో చిక్కుకుంది.
బలహీనపడిన వాయుగుండం
నెలాఖరుకు మరో అల్పపీడనం?
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసరాల నుంచి తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్యంగా పయనించి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారింది. మధ్యాహ్నానికి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు తూర్పు దిశగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఛత్తీ్‌సగఢ్ వైపు పయనించే క్రమంలో శనివారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. శని లేదా ఆదివారం వరకు దీని ప్రభావం ఉంటుంది. కాగా, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, ఉత్తర థాయ్‌లాండ్ పరిసరాల్లో ఈనెల 28 తరువాత ఉపరితల ఆవర్తనం ఆవరిస్తోందని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐరోపా వాతావరణ సంస్థ అంచనా వేసింది. అది థాయ్‌లాండ్ పరిసరాలకే పరిమితం అవుతుందని నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుత వాయుగుండం పూర్తిగా బలహీనపడ్డాక ఉత్తర, మధ్యభారతం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తాయన్నారు. వచ్చే నెల రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాన్‌కు అవకాశం ఉందని బంగ్లాదేశ్‌కు చెందిన ఒక సైక్లోన్‌మన్ అంచనా వేశారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ