ఏపీ సాంప్రదాయ హస్తకళలకు ఏఐ సాయంతో డిజిటల్ హంగులు
ABN , Publish Date - May 24 , 2026 | 05:59 PM
ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను రంగంలోకి దించింది.
అమరావతి, మే 24: ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI - కృత్రిమ మేధ) సాంకేతికతను రంగంలోకి దించింది. హస్తకళారూపాల అమ్మకాలను భారీగా పెంచడమే లక్ష్యంగా లేపాక్షి షోరూమ్‌లలో సరికొత్త ఏఐ వ్యవస్థలను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి, హస్తకళల శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఈ వినూత్న చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ, సాంకేతికతను ప్రభుత్వ శాఖల్లో అనుసంధానం చేయాలనే సంకల్పంలో భాగంగా హస్తకళల అభివృద్ధి సంస్థ(లేపాక్షి) ఆధునికీకరణ, పునర్వ్యవస్థీకరణపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు.
‘తరంగా’ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ – రియల్ టైమ్ పర్యవేక్షణ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 లేపాక్షి షోరూమ్‌ల నిర్వహణను ఆధునికీకరిస్తూ ‘తరంగా’ పేరుతో ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి నుంచే అన్ని లేపాక్షి షోరూమ్‌ల రోజువారీ స్టాక్, అమ్మకాల వివరాలను ఈ వ్యవస్థ ద్వారా రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తారు. ఏదైనా షోరూమ్‌లో స్టాక్ తగ్గితే తరంగా వ్యవస్థ వెంటనే అలర్ట్స్ పంపుతుంది. ఏ ప్రాంతంలో ఏ కళారూపానికి ఎక్కువ డిమాండ్ ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా స్టాక్‌ను రీఫిల్ చేస్తుంది. ఎక్కువ అమ్మకాలు జరిగే ప్రధాన షోరూమ్‌లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా డిమాండ్‌ను ముందే అంచనా వేసి హస్త కళాకారులకు కొత్త ఆర్డర్లను సకాలంలో అందించే వీలు కలుగుతుంది.
‘కళాక్షి’ వాట్సాప్ బోట్ – అరచేతిలో హస్తకళల సమాచారం
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ‘కళాక్షి’ పేరుతో ఏఐ ఆధారిత వాట్సాప్ లింక్‌ను ప్రభుత్వం రూపొందించింది. వినియోగదారులు తమ వాట్సాప్ ద్వారానే హస్తకళల వివరాలను తెలుసుకుని, నచ్చిన వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసిన వస్తువులను నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కళారూపాల పూర్తి సమాచారాన్ని, వాటి వెనుక ఉన్న చరిత్రను, ప్రత్యేకతను ఈ ఏఐ టూల్ వివరిస్తుంది. అలాగే సదరు వస్తువును తయారు చేసిన హస్తకళాకారుల వివరాలను కూడా ఇది అందిస్తుంది.
'వినియోగదారుల ఆధునిక అభిరుచులకు అనుగుణంగా లేపాక్షి కేంద్రాలను ఆధునికీకరిస్తున్నాం. హస్తకళలకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ద్వారా, మన సాంప్రదాయాన్ని నమ్ముకున్న హస్తకళాకారులకు ఆర్థిక భరోసానిచ్చి, వారికి గౌరవప్రదమైన జీవనాన్ని అందించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం' అని మంత్రి సవిత స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వివాహేతర సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!
పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలి: ఎంపీ మల్లు రవి
For More TG News And Telugu News