Share News

పెట్టుబడుల పండగ

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:27 AM

రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

పెట్టుబడుల పండగ

రాష్ట్రంలో నేరాలు, ఘోరాలకు పాల్పడే రాజకీయ శక్తులను ప్రజలు తిరస్కరించాలి. కొందరు నేరస్థులతో రాజకీయాలు చేస్తూ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే హింసకు పాల్పడి పెట్టుబడిదారులను తరిమేస్తామని బెదిరించే రాజకీయ నాయకులు రాష్ట్రానికి అవసరం లేదు.

గత పాలకుల విధానాల వల్ల విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతింది. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడింది. గత పాలకులు ధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తూ ఆ ఫలితాలు అందరికీ అందేలా చేస్తున్నాం. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం.

వేగంగా ఎదుగుతున్న గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఏపీని ఎంచుకోవడం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది. అభివృద్ధి సూచికల్లో విద్యుత్‌ వినియోగం కీలకం. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘రెన్యూ ఎనర్జీ’ వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా రూ.10,370 కోట్లతో విండో సోలార్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి.

- సీఎం చంద్రబాబు

  • ఉత్తరాంధ్రకు వెల్లువలా వస్తున్నాయి: సీఎం

  • గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికి దోహదం: చంద్రబాబు

  • అనకాపల్లి జిల్లాలో 5,400 కోట్లతో పవర్‌ ప్రాజెక్టులకు భూమి పూజ

  • 5.9 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం

  • అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం

  • అధికారంలోకి వస్తే పెట్టుబడిదారులను తరిమేస్తామనేవారు రాష్ట్రానికి వద్దు: బాబు

అనకాపల్లి/రాంబిల్లి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, ప్రతిరోజూ పెట్టుబడుల పండగేనని అన్నారు. గురువారం రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సంస్థ రూ.5400 కోట్లతో ఏర్పాటు చేయనున్న సోలార్‌ ఇన్‌గాట్‌-వేఫర్‌ యూనిట్‌, హైబ్రిడ్‌ క్యాప్టివ్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్టు పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్‌.చింతువ పంచాయతీ గజిరెడ్డిపాలెం(ఏపీఐఐసీ ఫేజ్‌-2 సెజ్‌) గ్రామంలో నెలకొల్పనున్నారు. సంస్థ ఏర్పాటు చేసిన బ్లూప్రింట్‌, ప్లాంటు నమూనాను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందన్నారు. రూ.4200 కోట్లతో 6.5 గిగావాట్ల సోలార్‌ ఇన్‌గాట్‌-వేఫర్‌ యూనిట్‌, రూ.1200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్‌ క్యాప్టివ్‌ రెన్యువబుల్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుతో రాంబిల్లి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతం యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించే జిల్లాల్లో అనకాపల్లి భవిష్యత్తులో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లాలో ఆర్సెల్లార్‌ మిట్టల్‌, నిప్పన్‌ ఇండియా స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉన్న రంగారెడ్డి 25 ఏళ్ల తర్వాత దేశంలోనే అత్యంత ధనికమైన జిల్లాగా మారిందని, అదే తరహాలో అనకాపల్లి జిల్లా కూడా అభివృద్ధి చెందనుందని అన్నారు.

2.jpg


గ్రీన్‌ ఎనర్జీలో భారీ పెట్టుబడులు

‘‘2019-24లో నిర్వహణ లోపంతో అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసి విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేశారు. దీనివల్ల ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడింది. గత ప్రభుత్వం పెంచిన కరెంటు ట్రూఅ్‌పను ట్రూడౌన్‌ చార్జీలుగా యూనిట్‌పై 13 పైసలు తగ్గించాం. ఆ మొత్తం రూ.4498 కోట్ల మేర ఉంటుంది. రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం. 90 గిగావాట్ల మేర ప్రాజెక్టులు ఇప్పటికే ప్రతిపాదనల దశలో ఉన్నాయి. ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ నుంచి రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో గ్రీన్‌ ఈవీ వాహనాల ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్‌టీసీ ద్వారా 1,050 ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చంద్రబాబు అన్నారు. ఈ తేడాను ప్రజలు గమనించాలి (బాక్స్‌లో) ‘‘వివేకా హత్య తరహాలోనే కడపలో దస్తగిరి హత్య జరిగింది. డబ్బు, ఆస్తుల కోసం సొంత మనుషులనే హతమార్చే సంస్కృతి ప్రమాదకరం. ఇలాంటి అరాచక శక్తులపై ప్రభుత్వం నిరంతరం నిఘా కొనసాగిస్తుంది. కాకినాడలో ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్‌ను అతి ఘోరంగా చంపి, శవాన్ని డోర్‌ డెలివరీ చేశారు. ఇప్పుడు సాక్షులను బెదిరిస్తున్నారు. అటువంటి రాజకీయాలు చేసే నాయకులతో సమాజానికి ముప్పు తప్పదు. ఫ్లెక్సీలకు జంతుబలులు ఇచ్చి అభద్రతా భావాన్ని సృష్టించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.’’ అంటూ వైసీపీ నేతల తీరును ఎండగట్టారు.

అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి

‘‘ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇకముందు ఉద్యోగాల కోసం స్థానిక యువత బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ నెల 28న 15 బిలియన్‌ డాలర్లతో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ నిర్మాణానికి విశాఖపట్నంలో శంకుస్థాపన చేయనున్నాం. జూలై నెలలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అవుతుంది. విశాఖపట్నం-రాజమహేంద్రవరం మధ్య కార్గో కోసం నాలుగు లైన్లతో స్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు అవుతుంది. .హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయం.’’ అని అన్నారు.


గత ప్రభుత్వ తప్పులను సరిచేస్తూ..

‘‘గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తూ రాష్ట్రాన్ని 22 నెలల్లో అభివృద్ధి బాట పట్టించాం. గత పాలకులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. వాటిని రీషెడ్యూల్‌ చేస్తున్నాం. 2019-24లో పీపీఏలు రద్దు చేసి నిర్వాహణ లోపంతో అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసి వ్యవస్థను ధ్వంసం చేశారు. పీపీఏల రద్దు కారణంగా విద్యుత్‌ వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజా ధనాన్ని కట్టాల్సి వచ్చింది. ప్రజలపై రూ.32 వేల కోట్ల భారాన్ని గత పాలకులు మోపారు.’’అని విమర్శించారు.ఈ కార్యక్రమంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర, రెన్యూ ఎనర్జీ సీఎండీ సుమంత్‌ సిన్హా తదితరులు పాల్గొన్నారు.

పెట్టుబడిదారులకు భరోసా

‘‘రాష్ట్రంలో పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుంది. భూములు ఇచ్చిన వారికి అండగా నిలుస్తుంది. కాలుష్య రహిత వాతావరణం, సర్క్యులర్‌ ఎకానమీ దిశగా చర్యలు తీసుకుంటాం. పెట్టుబడులు, పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గత 22 నెలల్లో 802 ఎంఓయూలు కుదుర్చుకుని పెట్టుబడులపై నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా అనుమతులు ఇస్తూ స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌తో సుపరిపాలన అందిస్తున్నాం. 2019-24 మధ్య పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటే భయపడేవారు. ఆ పరిస్ధితి నుంచి ఎన్డీయే బ్రాండ్‌తో పెట్టుబడుదారుల్లో విశ్వాసాన్ని తిరిగి తీసుకురాగలిగాం. భవిష్యత్తులో రాష్ట్రంలో 40 లక్షల ఇళ్లకు సోలార్‌ రూఫ్‌టా్‌పలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’’ అని చంద్రబాబు చెప్పారు.

82 వేలకోట్ల పెట్టుబడులు పెడతాం రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సీఎండీ సుమంత్‌ సిన్హా

సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా మారుస్తామని రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ సంస్థ సీఎండీ సుమంత్‌ సిన్హా అన్నారు. ఇప్పటికే గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో తమకు యూనిట్లు ఉన్నాయని, ఏపీలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, పరిశ్రమలను ఆహ్వానించే చర్యలు తమను ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. ఇక్కడ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి ఆరు నెలల్లోనే అనుమతులు మంజూరు చేశారన్నారు. సెమీ కండక్టర్‌, సోలార్‌ ప్యానల్‌ తయారీకి ఉపయోగించే మెటీరియల్‌ను ఇక్కడ ఇన్‌గాట్‌-వేఫర్‌ యూనిట్‌లో తయారు చేస్తామన్నారు. దాంతోపాటు అనుబంధంగా పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాంబిల్లి యూనిట్‌ వల్ల 2400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కంపెనీలో స్థానికులకు 20 శాతం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగిన నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. 2030 నాటికి 6.5 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అమెరికా అనుబంధ పరిశ్రమలు గ్రీన్‌ ఎనర్జీని ఎక్కువగా వినియోగిస్తాయన్నారు. తమ కంపెనీకి సమీపంలోనే గూగుల్‌ రానుండడంతో తమ ప్లాంటుకు ఎక్కువగా డిమాండ్‌ ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

3.jpg


Also Read:

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి, వెండి ధరలు మరింత పతనం

సర్కారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది

భారత్‌, చైనా నరకాలు..!

Updated Date - Apr 24 , 2026 | 06:53 AM