భారత్, చైనా నరకాలు..!
ABN , Publish Date - Apr 24 , 2026 | 06:40 AM
భారత్, చైనా తదితర దేశాలను నరకాలుగా.. ఆ దేశాల నుంచి అమెరికాకు వచ్చేవారిని ‘గ్యాంగ్‌స్టర్స్ విత్ ల్యాప్‌టా్‌ప్స’గా అభివర్ణిస్తూ అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ చేసిన...
జన్మతః పౌరసత్వం కోసమే తొమ్మిది నెలల
గర్భంతో అమెరికాకు వస్తున్నారు
వాళ్లు ల్యాప్‌టా్‌పలతో వచ్చే గ్యాంగ్‌స్టర్లు
అమెరికా రాజకీయ విశ్లేషకుడు శావేజ్
వ్యాఖ్యల వీడియో రీపోస్ట్ చేసిన ట్రంప్
ఆ వ్యాఖ్యలు జుగుప్సాకరం: కేంద్రం
భారత్, చైనా వందల ఏళ్ల క్రితమే
గొప్ప నాగరికతలతో విలసిల్లాయి: ఇరాన్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: భారత్, చైనా తదితర దేశాలను నరకాలుగా.. ఆ దేశాల నుంచి అమెరికాకు వచ్చేవారిని ‘గ్యాంగ్‌స్టర్స్ విత్ ల్యాప్‌టా్‌ప్స’గా అభివర్ణిస్తూ అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ చేసిన పాడ్‌కా్‌స్టను డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్‌లో రీపోస్ట్ చేశారు. దాదాపు 10 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో.. మైఖేల్ శావేజ్ పలు జాత్యహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు వలస వచ్చిన భారతీయులు, చైనీయులు ఈ దేశానికి చేసిన నష్టం.. మాఫియా కుటుంబాలన్నీ కలిపి చేసిన నష్టంకన్నా ఎక్కువ అని ఆరోపించారు. ‘‘నా ఉద్దేశంలో వాళ్లంతా గ్యాంగ్‌స్టర్స్ విత్ ల్యాప్‌టాప్స్. మనల్ని నిలువునా దోచుకున్నారు. మనల్ని రెండో తరగతి పౌరుల్లా చూశారు. మూడో ప్రపంచ దేశాలు పైచేయి సాధించేలా చేశారు. మన జెండాను కాలరాశారు’’ అంటూ మండిపడ్డారు. ఇండియా, చైనా దేశాల నుంచి చాలా మంది.. తమకు పుట్టే పిల్లలకు అమెరికన్ పౌరసత్వం వచ్చేలా చేయడం కోసమే తొమ్మిదో నెలలో ఆ దేశానికి వస్తున్నారని అందులో ఆయన ఆరోపించారు. ‘‘పుట్టిన బిడ్డకు వెంటనే అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది. తర్వాత వాళ్లు చైనా, ఇండియా లేదా మరో నరకం నుంచి వారి కుటుంబం మొత్తాన్నీ ఇక్కడికి (అమెరికాకు) తీసుకొచ్చేస్తారు.’’ అని ధ్వజమెత్తారు. ‘అమెరికా బర్త్‌రైట్ సిటిజన్‌షి్‌ప లా’ (జన్మతః పౌరసత్వ హక్కు చట్టం)లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అమెరికా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. ఈ అంశాన్ని కోర్టులకు వదిలేయకుండా.. దీనిపై జాతీయస్థాయిలో రెఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. గతంలో తాను భారత్‌కు గొప్ప మద్దతుదారుడినని.. కానీ, కాలిఫోర్నియాలోని ఒక హైటెక్ కంపెనీలో శ్వేతజాతీయులకు ఉద్యోగాలు రావడం దాదాపు శూన్యమని తెలిసినప్పటి నుంచి తన అభిప్రాయం మారిందని చెప్పారు.
ఆ కంపెనీలో అంతర్గత వ్యవస్థలన్నీ చైనీయులు, భారతీయుల గుప్పిట్లో ఉన్నాయని.. అక్కడ ఉద్యోగం రావాలంటే భారతీయులైనా, చైనీయులైనా అయి ఉండాలని ఆరోపించారు. ‘‘అమెరికా రాజ్యాంగాన్ని విమానాలు రాక ముందు, టీవీ, ఇంటర్నెట్, రేడియో.. ఇవేవీ లేక ముందు రాశారు. తొమ్మిదో నెల గర్భంతో విమానాల్లో అమెరికాకు చాలామంది వస్తున్న ఈ రోజుల్లో పాత వాదనలు ఎంతవరకూ సమంజసం?’’ అని ప్రశ్నించారు. శావేజ్ పాడ్‌కా్‌స్టను ట్రంప్ రీపోస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో.. వాషింగ్టన్ వర్గాలు అప్రమత్తమై నష్టనివారణ చర్యలకు దిగాయి. భారత్ చాలా గొప్పదేశమని ట్రంప్ అన్నారని.. ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. శావేజ్ పాడ్‌కాస్ట్‌ను ట్రంప్ రీపోస్ట్ చేయడంపై భారత్ స్పందించింది. ఆ వ్యాఖ్యలు అజ్ఞానంతో కూడుకున్నవి, అనుచితమైనవి, జుగుప్సాకరంగా ఉన్నాయని ధ్వజమెత్తింది. ఈ వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ఉన్న వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించవని.. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తుచేసింది. కాగా.. శావేజ్ పోస్టును ట్రంప్ రీపోస్ట్ చేయడాన్ని హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ఖండించింది. భారత్ చైనాలు వందల ఏళ్లక్రితమే గొప్ప నాగరికతతో వెల్లివిరిశాయని గుర్తుచేసింది. ఇరాన్‌లో పౌరులను అంతం చేస్తానన్న ట్రంప్ ప్రగల్భాలు పలికే యుద్ద నేరగాడని మండిపడింది. రోజుకో మాట మార్చే ట్రంప్‌కు మానవత్వం మచ్చుకైనా లేదని, అతడి వాఖ్యలు జాత్యహంకారానికి నిదర్శనమని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి