Share News

ఆక్వా కారిడార్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:44 AM

అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరును కలుపుతూ ఆక్వా కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.....

ఆక్వా కారిడార్‌

  • అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖ, కృష్ణపట్నం, నెల్లూరును కలుపుతూ ఏర్పాటు

  • బ్లూ ఎకానమీతో కొత్త ఆవిష్కరణలు అవసరం. ‘ఆంధ్ర ష్రింప్‌...ఇండియా సీఫుడ్‌’ అనే బ్రాండ్‌ విస్తృతం కావాలి. ఆక్వా రంగానికి భారతదేశం లైట్‌ హౌస్‌ అయితే, దానికి ఏపీ కేంద్ర బిందువు. ఆక్వా అభివృద్ధికి ఇదే సరైన తరుణం.

- సీఎం చంద్రబాబు

  • 72.5 కోట్లతో కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధి

  • ప్రపంచంలోని ప్రతి వంటగదికీ ఏపీ సీఫుడ్‌

  • రాష్ట్రంలో నేషనల్‌ ఫిషరీస్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం..15 రోజుల్లో స్థలమిస్తాం

  • భవిష్యత్తులో ఆక్వా ఎగుమతులకు విస్తృత అవకాశాలు

విశాఖపట్నం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరును కలుపుతూ ఆక్వా కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచంలోని ప్రతి వంట గదికీఆంధ్రప్రదేశ్‌ సముద్ర ఆహార ఉత్పత్తులను చేరుస్తామన్నారు. విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్‌లో శుక్రవారం ప్రారంభమైన ‘సముద్ర ఆహార ఉత్పత్తులు, ఎగుమతుల’ రెండు రోజుల జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగాను, అనంతరం మీడియాతోను సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో నేషనల్‌ ఫిషరీస్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌ ఆమోదం తెలిపారని, దానికి 15 రోజుల్లో భూమి కేటాయిస్తామని తెలిపారు. కాకినాడలో పాత ఫిషింగ్‌ హార్బర్‌ను రూ.72 కోట్లతో ఆధునికీకరించడానికి ఆయన అంగీకరించారన్నారు. అమెరికా గత ఏడాది టారిఫ్‌లు పెంచడం వల్ల భారతదేశానికి మేలే జరిగిందని సీఎం వ్యాఖ్యానించారు. దానివల్ల కొత్త మార్కెట్లు ఎక్కడున్నాయో తెలిసిందని, ఎగుమతులు కూడా పెరిగాయని తెలిపారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని, ఏడాదికి 197 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. దేశంలో రొయ్యల ఉత్పత్తుల్లో 66 శాతం ఏపీ నుంచే ఉన్నాయని, రాష్ట్రంలో మెగా సీఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల ఏర్పాటుకు సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. క్వాలిటీ, సస్టెయినబులిటీ, ట్రేసబులిటీ, ఇన్నోవేషన్‌, జీరో పొల్యూషన్‌...అనేవి ఆక్వా రంగంలో చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. ఆక్వా అభివృద్ధికి ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

2.jpg


ఆక్వాలో మన వాటా 38 శాతం

‘‘దేశం నుంచి ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ వాటా 38 శాతం. దీనిని మరింత పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నాం. రైతులు, మత్స్యకారులకు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. బ్లూ ఎకానమీకి కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఆక్వా ఎగుమతులతో ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు మత్స్యకారులు, రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తీరం నుంచి దూరంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు 200 మెకనైజ్డ్‌ బోట్లు కేంద్రం అందిస్తుంది.’’

కేంద్రం సహకరించాలి

‘‘దేశంలో వ్యవసాయం తర్వాత ఆక్వా రంగమే అతి పెద్ద పరిశ్రమ. బ్లూ ఎకానమీకి మంచి భవిష్యత్తు ఉంది. ఆక్వా ఉత్పుత్తులకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్‌ ఆహార ఉత్పత్తులు తినడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలో ఆక్వా ఉత్పత్తులు కేవలం 12 శాతమే ప్రాసెసింగ్‌ చేస్తున్నారు. దీనిని మరింత పెంచి మార్కెట్‌లోకి తీసుకువస్తే భారీ ఆదాయం వస్తుంది. ఆక్వాలోనూ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు పెద్దపీట వేయాలి. ఈ రంగానికి విద్యుత్‌ యూనిట్‌ రూ.1.50కే అందిస్తున్నాం. ఫిష్‌ ఫీడ్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతంగా పెరిగిన సోయా ధరల విషయంలో కేంద్రం సహకారం అవసరం. ఏడాదికి 30 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో ఏపీ వాటా 30 శాతం. సర్క్యులర్‌ ఎకానమీకి ఆక్వా రంగాన్ని అనుసంధానం చేసేలా భీమవరంలో ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తోంది. మార్కెట్‌ ఇబ్బందులతో మద్దతు ధర కోల్పోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలి..’’ అని చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు పియూశ్‌ గోయల్‌, కె.రామ్మోహన్‌నాయుడు , రాజీవ్‌ రంజన్‌ సింగ్‌, చిరాగ్‌ పాశ్వాశ్‌, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎంపెడా అధికారులు పాల్గొన్నారు.

5.jpg


మండుటెండలో బాబు సైకిల్‌ సవారీ

  • ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి నోవాటెల్‌ వరకు...

ఉదయం 10.45 గంటల సమయం....మాడు పగిలే ఎండ.. వేడిని తట్టుకోలేక అందరూ చెట్ల నీడకు చేరుకున్నారు. ఆ సమయంలో ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానం నుంచి ఆర్కే బీచ్‌రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌కు సైకిల్‌పై వెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. ‘ఎండ తీవ్రంగా ఉంది సార్‌’...అని మీడియా ప్రతినిధులు అంటే...‘విశాఖపట్నంలో వాతావరణం చల్లబడుతుందనుకున్నాను.’ అంటూ సైకిల్‌ తొక్కడం ప్రారంభించారు. దారిపొడవునా నిలబడిన పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఉత్సాహంగా ముందుకువెళ్లారు. త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, పోలమాంబ ఆలయం, ప్రభుత్వ మానసిక వైద్యశాల, చినవాల్తేరు మీదుగా బీచ్‌రోడ్డులోకి వెళ్లి అక్కడ నుంచి నోవాటెల్‌ హోటల్‌కు చేరుకున్నారు. సుమారు ఐదున్నర కిలోమీటర్ల దూరాన్ని 21.19 నిమిషాల్లో చేరుకున్నారు. ఆయనను సైకిళ్లపై జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌, ఎమ్మెల్యేలు గణబాబు, వంశీకృష్ణశ్రీనివాస్‌ అనుసరించారు. అనంతరం చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘సైకిల్‌ తొక్కడం నిత్యజీవితంలో ఒక భాగం కావాలి. దీనివల్ల రెండు విధాలుగా ప్రయోజనం ఉంటుంది. ఒకటి కాలుష్యం తగ్గడం, రెండోది శరీర దృఢత్వం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం. విశాఖలో సైక్లింగ్‌ కోసం ప్రత్యేక పార్కులను అందుబాటులోకి తెస్తాం’’ అని తెలిపారు.

విశాఖ విమానాశ్రయం కొనసాగిస్తాం: సీఎం

భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చినప్పటికీ విశాఖలో విమానాశ్రయం కొనసాగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. శుక్రవారం జరిగిన విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ సమీక్షా సమావేశంలో, భూముల లభ్యత గురించి చర్చ జరిగింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభిస్తే...విశాఖ విమానాశ్రయంలో 200 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సీఎంకు వివరించారు. ఆ భూములను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందనగా, విశాఖలో కూడా ఎయిర్‌పోర్టును కొనసాగిస్తామని సీఎం తెలిపారు.


4.jpg

ఎక్కువ మొక్కలు నాటిన వారికే టికెట్లు

  • సీఎం సరదా వ్యాఖ్యలు

  • ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో మొక్క నాటిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో 50 శాతం భూమిని పచ్చదనంతో (గ్రీన్‌ కవర్‌) నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మొక్కలు పెంచిన వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని అర్హతగా పెడతామంటూ..పక్కనే ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన శుక్రవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుతో కలిసి మొక్కను నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 2.5 కోట్ల సీడ్‌ బాల్స్‌తో గ్రీనరీ పెంచేలా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కృషి చేస్తున్నారని అభినందించారు.

6.jpg

కైలాసగిరి నుంచి భోగాపురం వరకు బే సిటీ

  • ఆనందపురంలో 303 ఎకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌

  • విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ సమీక్షలో సీఎం వెల్లడి

కైలాసగిరి నుంచి భోగాపురం వరకు బే సిటీ నిర్మాణానికి ప్రాజెక్టు తయారు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. నోవాటెల్‌ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) పరిధిలోని తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. బే సిటీగా విశాఖపట్నం తయారు కావాలని, ఇదంతా వీఈఆర్‌లో భాగంగానే జరగాలని సూచించారు. వీఈఆర్‌ కోసం ప్రాజెక్టు మానటరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆనందపురం మండలంలోని జగన్నాథపురంలో అందుబాటులో ఉన్న 303 ఎకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించాలని సూచించారు. కైలాసగిరిని ఆధ్యాత్మికంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నారు. అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేలా బీచ్‌ వాటర్‌ స్పోర్ట్స్‌తో పాటు వినోదం అందించే ప్రాజెక్టులకు పెట్టుబడులు రప్పించే ప్రయత్నాలు జరగాలన్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు పోలవరం ప్రాజెక్టు, పాపికొండలు వంటి పర్యాటక ప్రాంతాలు అదనపు ఆకర్షణగా నిలవాలని కోరారు. పారిశ్రామిక ప్రాంతాలను ఆనుకొని ఏర్పాటయ్యే టౌన్‌షిప్పుల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. నీతి ఆయోగ్‌ సమర్పించిన వీఈఆర్‌ ప్రాజెక్టు నివేదికను ప్రజల్లో చర్చకు పెట్టాలని, మేధావులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 06:42 AM