Share News

ట‘మాట’ రాదు

ABN , Publish Date - Feb 28 , 2026 | 10:54 AM

టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయు. కిలో రూపాయి కూడా పలకడం లేదు. వారం రోజులుగా టమోటా ధర మరి దారుణంగా తయారైంది.

ట‘మాట’ రాదు

  • పాతాళంలో టమోటా ధర

  • కిలో గరిష్ఠం రూ.8, కనిష్ఠం రూ.4

  • పంటను చేనులోనే వదిలేస్తున్న రైతులు

అనంతపురం: టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయు. కిలో రూపాయి కూడా పలకడం లేదు. వారం రోజులుగా టమోటా ధర మరి దారుణంగా తయారైంది. అనంతపురం జిల్లాలోని కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో కిలో గరిష్ఠంగా రూ.8తో అమ్ముడు పోతున్నాయి. కిలో సరాసరి ధర రూ.ఐదారు పలుకుతుండగా, కనిష్ఠ ధర రూ.నాలుగుకు పడిపోయింది. ధరలు పడిపోవడంతో అన్నదాతలు పంటను చేనులోనే వదిలేస్తున్నారు.


కాయలు తగ్గినా పెరగని ధర

ప్రస్తుతం టమోటా సీజన్‌ ముగుస్తోంది. ఈక్రమంలో జిల్లాలో చాల వరకు టమోటా సాగు తగ్గింది. ఈనేపథ్యంలో మార్కెట్‌కు టమోటా దిగుబడులు తగ్గిపోయాయి. పదిరోజుల కిందట వరకు రోజుకు 600నుంచి 800టన్నుల వరకు టమోటాలు మార్కెట్‌కు వచ్చేవి. ప్రస్తుతం ఆసంఖ్య సగానికి పడిపోయింది. గత వారం రోజులుగా 300నుంచి400మధ్య ఉంటున్నాయి. ఈక్రమంలో ధరల పెరుగుదల ఉంటుందనుకుంటే అదిలేకుండా పోయింది. ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే ప్రాంతాల్లో టమోటా ఉండటంధరల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. కక్కలపల్లి మార్కెట్‌కు వచ్చే వ్యాపారులంతా ఇతరప్రాంతాల నుంచి వచ్చే వారే. సీజన్‌ ముగుస్తుండటంతో వ్యాపారులు ఇక్కడకు రావడం తగ్గించేశారు. దీంతో మార్కెట్‌కు వచ్చిన కాయలను చింతామణి, మదనపల్లి, హైదరాబాదు తదితర ప్రాంతాలకు పంపుతున్నారు.


pandu1.2.jpgపంటను చేనులోనే వదిలేస్తున్న రైతులు

టమోటా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ పద్ధతిలో పంట సాగు చేస్తే ఎకరానికి రూ.50వేల వరకు ఖర్చు అవుతోంది. మల్చింగ్‌ షీట్‌, కట్టెలపై సాగు చేస్తే మరో రూ.50వేలు అదనపు ఖర్చు అవుతుంది. పంట కోత కొచ్చిన తరువాత కూలీల ఖర్చులు, మార్కెట్‌కు కాయల తరలింపు రవాణా, వాహనాల బాడుగ, ఇతరత్ర అన్నీ కలుపుకుని తడిసిమోపేడవుతున్నాయి. అన్నీ కష్టాలను భరించి మార్కెట్‌కు కాయలు తీసుకెళ్లితే ధరలు ఉండని పరిస్థితి. మార్కెట్‌లో టమోటాకు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట చేతి కొచ్చే సమయానికి ధరలు లేకుండా పోయాయంటూ వాపోతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలంటూ కోరుతున్నారు. రవాణా ఖర్చులు కూడా గిట్టవని పలువురు రైతులు టమోటాలను పొలంలోనే వదిలేస్తున్నారు.


గిట్టుబాటు ధర కల్పించాలి: శ్రీధర్‌, రైతు, రామనపల్లి

టమోటా ధరలు తగ్గిపోవడంతో దిక్కుతోచడం లేదు. మార్కెట్‌లో 15కిలో బాక్సు రూ.65 నుంచి రూ.90 పలుకుతోంది. పంటసాగుకు పెట్టుబడుల రూపంలో పెద్దఎత్తున ఖర్చు అయ్యాయి. అప్పులు చేసి పంటసాగు చేశా. ప్రభుత్వం టమోటాకు గిట్టుబాటు ధర కల్పించి ఆందుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ..

భగ్గుమన్న పసిడి ధరలు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2026 | 10:54 AM