టమోటాను చుట్టుముట్టిన చీడపీడలు
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:21 PM
టమోటా సాగుకు గతంలో పెట్టుబడి చాలా తక్కువ అయ్యేది. దిగుబడి ఆశాజనకంగా వచ్చేది. ధరలు మధ్యస్తంగా ఉన్నా.. లాభాలు వచ్చేవి.
ఎన్ని మందులు వాడినా ప్రయోజనం శూన్యం
భారీగా పడిపోతున్న దిగుబడులు
పంటను తొలగించుకుంటున్న పలువురు రైతులు
సర్వం నష్టపోతున్న వైనం
టమోటా అంటే జాక్‌పాట్ పంట. ధరలు బాగుంటే భారీ లాభాలు వస్తాయి. దీంతో ధరలు రాకపోతాయా అని జిల్లా రైతులు విస్తారంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటను వివిధ రకాల తెగుళ్లు చుట్టుముట్టాయి. ఎన్ని రకాల రసాయన మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావట్లేదు. దీంతో పెట్టుబడి తడిసి మోపెడవుతోంది. అయినా.. తెగుళ్లు తగ్గక కొందరు రైతులు ఏకంగా పంటనే తొలగించేసుకుంటున్నారు. దీంతో సర్వం నష్టపోతున్నారు. తెగులు నివారణకు సలహాలు ఇవ్వాల్సిన అధికారులు ఎక్కడున్నారో కూడా తెలీదని రైతులు వాపోతున్నారు.
కుందుర్పి/రామగిరి(అనంతపురం): టమోటా సాగుకు గతంలో పెట్టుబడి చాలా తక్కువ అయ్యేది. దిగుబడి ఆశాజనకంగా వచ్చేది. ధరలు మధ్యస్తంగా ఉన్నా.. లాభాలు వచ్చేవి. ప్రస్తుతం పంట సాగు విధానంలో విపరీతమైన మార్పులొచ్చాయి. పంట సాగుకు కట్టెలు, పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పెట్టుబడి విపరీతంగా పెరిగింది. ఎకరాలో సాగుకు రూ.లక్షకుపైగా పెరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గతంలో టమోటా పంట పూర్తయ్యేసరికి 25కిపైగా కోతలు వచ్చేవి. ప్రస్తుతం పంట కోతకొచ్చే సమయానికి టమోటా తోటలు నేలన పడిపోతున్నాయి.
మహా అంటే 6 నుంచి 8 కోతలే వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఇందుకు టమోటా నారు నాణ్యత లోపమా? పురుగు మందులు నాసిరకమా? అని రైతులు సందిగ్ధంలో పడిపోయారు. టమోటాను ఆశించిన మచ్చ, ఎండ తెగుళ్లకు వేలకువేల రూపాయలు పెట్టి మందులు పిచికారీ చేసినా ప్రయోజనం దక్కట్లేదు. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. చీడపీడలపై అవగాహన కల్పించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. అవగాహనలేని గ్రామీణ ప్రాంత రైతులు, మందుల షాపులను ఆశ్రయిస్తున్నారను. షాపుల నిర్వాహకులు తెలిసీతెలియని మందులు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అవి ఫలితం ఇవ్వక రైతులు మరింత నష్టపోతున్నారు. చేసేదిలేక పంటనే వదిలేసుకుంటున్నారు.
పూర్తిగా నష్టపోతున్నాం
ఏప్రిల్, మే నెలల్లో టమోటా సాగు చేశా. పంట వైరస్ బారిన పడుతోంది. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. దీంతో ఖర్చు అధికమవుతోంది. రూ.లక్షల్లో మందులు కొనాల్సి వస్తోంది. ఎన్ని పిచికారీ చేసినా వైరస్ నియంత్రణలోకి రావట్లేదు. పంట పూర్తిగా దెబ్బతింటోంది.
రామిరెడ్డి, రైతు, రామగిరి
పెట్టుబడి వృథా
మూడెకరాల్లో టమోటా సాగు చేసి 60 రోజులవుతుంది. ఎనిమిది సార్లు మందులు పిచికారీ చేశా. పంటను ఆశించిన మచ్చ, ఆకు తెగుళ్లు తగ్గట్లేదు. కాయలు, చెట్లకు పూర్తిగా మచ్చసోకి వదిలేయాల్సిన దుస్థితి దాపురించింది. రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టా. దిక్కుతోచడం లేదు.
జగన్నాథ్, రైతు, కరిగానపల్లి, కుందుర్పి మండలం
తగ్గని తెగుళ్లు
రెండెకరాల్లో టమోటా సాగుచేశా. ఇప్పటికే 50 రోజులైంది. అనేకసార్లు మందులు పిచికారీ చేశా. రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టా. తెగుళ్లు మాత్రం తగ్గలేదు.
నగేష్, రైతు, కుందుర్పి
వాతావరణంలో మార్పుల కారణంగానే
వాతావరణంలో మార్పుల కారణంగా టమోటాను చీడపీడలు ఆశిస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి మూడు గ్రాముల సీవోసీ గానీ, 0.25 గ్రాములు స్టెప్రోసైక్లిస్ గానీ, గ్రాము రోకోగానీ కలుపుకుని, పంటకు పిచికారీ చేసుకోవాలి.
గౌసియా, ఉద్యాన శాఖాధికారి
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరలు పెరిగాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
వీకెండ్ థెరపీ.. ఉపశమనం కోసం వెల్‌నెస్ సెంటర్లకు
Read Latest AP News And Telangana