కులవర్ధన్‌ది ఆత్మహత్యే.. ప్రకటించిన జిల్లా ఎస్పీ..
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:13 PM
మదనపల్లిలో చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టతనిచ్చారు. కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో ఈరోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిపారు.
అన్నమయ్య జిల్లా, ఫిబ్రవరి 18: మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కులవర్ధన్ మృతదేహం కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో లభ్యమైంది. చిన్నారి హత్య కేసుపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మీడియాతో మాట్లాడుతూ.. కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో ఈరోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిపారు. మృతదేహాన్ని కులవర్ధన్‌గా అతని బంధువులు గుర్తించారని ఎస్పీ చెప్పారు.
మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. కులవర్ధన్ బంధువులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. మంగళవారం కులవర్ధన్‌ను అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా.. పోలీసుల నుంచి తప్పించుకుని అతడు పారిపోయాడని తెలిపారు. అతని ఆచూకీ కోసం మూడు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బుధవారం ఉదయం చెరువులో కులవర్ధన్ మృతదేహం తేలినట్లు తెలిసిందన్నారు. ప్రాథమిక విచారణలో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ అసెంబ్లీ.. రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపుపై మంత్రి జనార్దన్ సమాధానం
మదనపల్లిలో హత్యకు గురైన చిన్నారి అంత్యక్రియలు పూర్తి
Read Latest AP News And Telugu News