ఏపీ అసెంబ్లీ.. రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపుపై మంత్రి జనార్దన్ సమాధానం
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:10 AM
రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపు అంశంపై ఏపీ అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 18: ఏపీ అసెంబ్లీలో (AP Assembly Session) రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపు విషయంపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) సమాధానం ఇచ్చారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి మాట్లాడారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క రోజు మీటింగ్ కోసం వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మొక్కలను నరికివేసిన దుస్థితి ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల విస్తరణ పనుల్లో అడ్డువచ్చే చెట్లను మాత్రమే తొలగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
జాతీయ రహదారుల పచ్చదనం కోసం సివిల్ పనుల ఖర్చులో 1 శాతం.. హైవేల వెంబడి మొక్కల పెంపకం, నిర్వహణకు కేటాయిస్తున్నారని మంత్రి తెలిపారు. రోడ్డు మధ్య, ఇరువైపులా అవెన్యూ మొక్కలు నాటాలని మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్ర రహదారులకు సంబంధించి ‘రైట్ ఆఫ్ వే’ భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డు ఇరువైపులా చెట్ల పెంపకం జరుగుతోంది. అందుబాటులో లేని సందర్భంలో అటవీ శాఖ మార్గదర్శకాల ప్రకారం అటవీకరణ భూముల్లో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ఏళ్ల తరబడి ఉన్న భారీ చెట్లను ఇతర ప్రాంతాలకు మార్చి నాటేందుకు (ట్రాన్స్‌లొకేషన్) చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. యలమంచిలి నియోజకవర్గంలోనే ఇటీవల దాదాపు 18 చెట్లను నాటినట్లు బీసీ జనార్దన్ వెల్లడించారు.
గతంలో సచివాలయానికి వచ్చే రహదారిలో చెట్లు ఎండిపోయిన పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని సంరక్షిస్తున్నామని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రహదారులకు ఇరువైపులా చెట్లు పెంచుతూ పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నడిరోడ్డుపై గొంతుకోసుకున్న యువకుడు.. భయాందోళనలో ప్రజలు
వైసీపీ వాయిదా తీర్మానాల తిరస్కరణ.. సభలో గందరగోళం
Read Latest AP News And Telugu News