కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్... తాడిపత్రిలో ఉద్రిక్తం
ABN , Publish Date - Jun 12 , 2026 | 09:34 AM
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
అనంతపురం, జూన్ 12: జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో వైసీపీ తలపెట్టిన ‘వెన్నుపోటు రెండేళ్లు’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమానికి వెళ్లేందుకు యత్నించిన పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు పోలీసులపైకి దూసుకెళ్లారు. శాంతిభద్రతల దృష్టా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు.
వైసీపీ అధిష్ఠానం పిలుపు మేరకు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా వైసీపీ శ్రేణులు తాడిపత్రికి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంతో బైక్ ర్యాలీ చేపడుతున్నట్లు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. పెద్దఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ కార్యక్రమానికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ, టీడీపీ పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో తాడిపత్రిలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండటంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముందుస్తుగా పోలీసుల అనుమతి తీసుకోకుండా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని చేపడుతుండటంతో పాటు శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ పెద్దారెడ్డిని పోలీసులు ముందుగా గృహనిర్బంధం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని చేసి తీరుతామని మాజీ ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేశ్
26, 28 తేదీల్లో చెన్నై-తిరుపతి రైళ్ల రద్దు
Read Latest AP News And Telugu News